బయట క్రిస్పీగా, లోపల మెత్తగా.. ఆలుగడ్డతో అద్భుతమైన స్నాక్..15 నిమిషాల్లోనే ఎలా చేసుకోవాలంటే..

Posted By:

బంగాళదుంప లేదా ఆలుగడ్డ అంటే ఇష్టపడని వారు ఎవరూ ఉండరు. చిన్నపిల్లల నుండి పెద్దవారి వరకు అందరూ ఇష్టంగా తినే కూరగాయ ఇది. ముఖ్యంగా సాయంత్రం వేళ టీ లేదా కాఫీతో పాటు ఏదైనా వేడివేడిగా, కరకరలాడుతూ తినాలనిపిస్తే బంగాళదుంపతో చేసిన స్నాక్స్ అద్భుతంగా ఉంటాయి. బంగాళదుంపతో కేవలం 10-15 నిమిషాల్లో తయారు చేసుకోగలిగే అద్భుతమైన స్నాక్ తయారుచేసుకోవచ్చు.

సాయంత్రం పూట పిల్లలు స్కూల్ నుండి రాగానే లేదా ఇంటికి ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు హడావిడి లేకుండా ఇంట్లో ఉండే తక్కువ పదార్థాలతోనే ఈ స్నాక్ తయారు చేయవచ్చు. ఇది పైకి ఎంతో క్రిస్పీగా, లోపల మెత్తగా ఉండి నోట్లో ఇట్టే కరిగిపోతుంది. బంగాళదుంపతో కరకరలాడే క్రిస్పీ స్నాక్ ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

Crispy Outside Melts Inside The Ultimate Potato Cheese Snack Recipe in Telugu

తయారీకి కావలసిన పదార్థాలు
-బంగాళదుంపలు
-మోజరెల్లా చీజ్
-మొక్క జొన్న పిండి
-మిరియాల పొడి
-కొత్తిమీర
-ఆయిల్

తయారీ విధానం

-ముందుగా 3 బంగాళదుంపలను పైన చెక్కు తీసేసి పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి.

-తర్వాత స్టవ్ మీద ఓ గిన్నె పెట్టి అందులో బంగాలదుంప ముక్కలు వేసి,అవి మునిగేంతవరకు నీటిని పోసి మెత్తగా ఉడికించి స్టవ్ ఆపేయాలి.

-ఓ బౌల్ లో ఉడికించిన బంగాళదుంప ముక్కలు వేసి పప్పు గుత్తితో మెత్తగా మెదుపుకోవాలి(మాష్ చేసుకోవాలి.)

-మెత్తగా మెదుపుకున్న బంగాళదుంప మిశ్రమంలో కొత్తిమీర తరుగు, 100గ్రాముల మోజరెల్లా చీజ్ తురుము, 4 టేబుల్ స్పూన్ల మెక్కజొన్న పిండి, కొద్దిగా నల్ల మిరియాల పొడి వేసి మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి.

-కలిపిన మొత్తాన్ని 2 పెద్ద లడ్డు ముద్దల్లా చేసుకొని పక్కన పెట్టుకోండి.

-ఒక చెక్క పీటపై లేదా చపాతీ పీటపై కొంచెం పొడి పిండి చల్లుకొని దాని మీద కలిపిన పిండి ముద్దను పెట్టి చపాతీ కర్రతో వత్తుకోవాలి. మరీ సన్నగా కాకుండా, మరీ లావుగా కాకుండా మధ్యస్థంగా సుమారు 1 ఇంచు మందం ఉండేలా చూసుకోండి.

-ఇప్పుడు ఒక కత్తి తీసుకుని దానిని చిన్న చిన్న ముక్కలుగా (సుమారు 1 ఇంచు పొడవు) స్క్వేయర్ షేపులో కట్ చేసుకోవాలి.

-తర్వాత స్టవ్ మీద బాండీ పెట్టి డీప్ ఫ్రై చేయడానికి సరిపడా ఆయిల్ పోసి వేడి చెయ్యాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో కట్ చేసిన బంగాళదుంప మిశ్రమం ముక్కలను వేయాలి. నూనెలో వేసిన వెంటనే గరిటతో కలపకూడదు. అలా చేస్తే అవి విరిగిపోతాయి. ఒక నిమిషం పాటు వేగనివ్వండి. అవి కొంచెం గట్టిపడ్డాక, గరిటతో అటు ఇటు తిప్పుతూ బంగారు రంగు వచ్చే వరకు వేయించుకోవాలి.

-మంచి రంగు వచ్చాక, టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్ లోకి తీసుకోండి. ఇది అదనపు నూనెను పీల్చుకుంటుంది. అంతే క్రిస్పీ బంగాళదుంప స్నాక్ రెడీ.

-ఈ బంగాళదుంప స్నాక్ లోకి నంజుకోడానికి..ఓ బౌల్ లో 3 టేబుల్ స్పూన్ల సోర్ క్రీం, 1టేబుల్ స్పూన్ కెచప్, 1 టేబుల్ స్పూన్ సోయా సాస్, 1 టేబుల్ స్పూన్ వోర్సెస్టర్‌షైర్ సాస్, 1 టీస్పూన్ పప్రిక, 1 టేబుల్ స్పూన్ మయోనైజ్ వేసి మొత్తం బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇందులో రెడీ అయిన బంగాళదుంప స్నాక్ ను ముంచుకొని తింటుంటే స్వర్గమే.

[ of 5 - Users]
Story first published: Friday, January 2, 2026, 12:33 [IST]
Desktop Bottom Promotion