నోట్లో వేసుకుంటే కరిగిపోయే బీరకాయ బజ్జీ.. కేవలం నిమిషాల్లో ఇలా రెడీ చేసుకోండి

Posted By:

సాయంత్రం వేళ మనసు సహజంగానే వేడివేడి స్నాక్స్ తినాలని కోరుకుంటుంది. అందులోనూ చేతిలో ఓ కప్పు వేడివేడి టీ లేదా కాఫీ ఉండి, దానికి తోడుగా కరకరలాడే బజ్జీలు ఉంటే ఆ మజాయే వేరు.

సాధారణంగా మన ఇళ్లలో బజ్జీలు అనగానే టక్కున గుర్తొచ్చేవి ఉల్లిపాయ బజ్జీ, మిరపకాయ బజ్జీ లేదా బంగాళదుంప బజ్జీ. అయితే ఈ సారి కాస్త కొత్తగా బీరకాయ బజ్జీ ట్రై చేయండి. రుచికి ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. నోరూరించే కరకరలాడే బీరకాయ బజ్జీ ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

Crispy Outside Soft Inside Beerakaya Bajji Recipe in Telugu

కావాల్సిన పదార్థాలు
శనగపిండి - 1 కప్పు
బియ్యం పిండి - 2 టేబుల్ స్పూన్లు
పసుపు - 1 చిటికెడు
కాశ్మీరీ కారం - 1 టీస్పూన్
ఇంగువ పొడి - పావు టీస్పూన్
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టేబుల్ స్పూన్
ధనియాల పొడి - అర టీస్పూన్
ఇడ్లీ పిండి - 1 టేబుల్ స్పూన్
ఉప్పు - మీ రుచికి తగినంత
నీళ్లు - పిండి కలుపుకోవడానికి తగినంత
నెయ్యి - పావు టీస్పూన్
వంట సోడా - 1 చిటికెడు
లేత బీరకాయ - 1 పెద్దది
నూనె - డీప్ ఫ్రై చేయడానికి సరిపడా

తయారీ విధానం

-ముందుగా ఒక వెడల్పాటి గిన్నె తీసుకుని అందులో శనగపిండి, బియ్యం పిండి, పసుపు, కాశ్మీరీ కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, ఇంగువ వేసి అన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలి.

-ఇప్పుడు ఈ మిశ్రమంలో ఒక చెంచా ఇడ్లీ పిండి వేసి, మీ రుచికి సరిపడా ఉప్పును కూడా జతచేయండి. ఆ తర్వాత కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ, పిండిలో ఎక్కడా ఉండలు లేకుండా చూసుకుంటూ బజ్జీల పిండిలా (మరీ పలచగా కాకుండా, మరీ చిక్కగా కాకుండా) మీ చేతులతో బాగా కలుపుకోవాలి.

-చివరగా అందులో ప పావు టీస్పూన్ నెయ్యి, ఒక చిటికెడు వంట సోడా వేసి మరోసారి బాగా కలిపి పక్కన పెట్టుకోండి.

-ఇప్పుడు ఒక తాజా లేత బీరకాయను తీసుకుని, పైన ఉన్న చెక్కు (తొక్క) పలచగా తీసేయండి. ఆ తర్వాత బీరకాయను సన్నని గుండ్రటి బిళ్లల్లాగా (స్లైసెస్) కోసుకుని పక్కన పెట్టుకోండి.

-స్టవ్ ఆన్ చేసి, డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి కడాయిని వేడి చేయండి. నూనె బాగా వేడెక్కిన తర్వాత ముందుగా కోసి పెట్టుకున్న ఒక్కో బీరకాయ ముక్కను తీసుకుని సిద్ధం చేసుకున్న పిండిలో రెండు వైపులా బాగా ముంచి, మెల్లగా నూనెలో వదలండి.

-బజ్జీలు రెండు వైపులా బంగారు గోధుమ రంగులోకి వచ్చే వరకు మీడియం మంట మీద వేయించుకుని ఒక ప్లేట్‌ లోకి తీసుకోండి.
అంతే ఎంతో గుమగుమలాడే, లోపల మెత్తగా బయట కరకరలాడే బీరకాయ బజ్జీలు రెడీ.

-వీటిని వేడివేడిగా టొమాటో కెచప్ లేదా పుదీనా చట్నీతో తింటూ ఆస్వాదిస్తే ఆ కిక్కే వేరు.

[ of 5 - Users]
Story first published: Saturday, February 28, 2026, 21:45 [IST]
Desktop Bottom Promotion