ధాబా స్టైల్ పనీర్ కర్రీ..తింటుంటే మజా నెక్ట్స్ లెవల్ అంతే..ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే

Posted By:

మనలో చాలామంది ఎప్పుడైనా ధాబాకి లేదా హోటల్ కి వెళ్లినప్పుడు రోటీ, పరోటా లేదా చపాతీలు ఆర్డర్ చేస్తే అందులోకి దాదాపుగా పనీర్ కర్రీనే ఎక్కువగా ఆర్డర్ చేస్తుంటారు. హోటల్ లేదా ధాబాలో పనీర్ కర్రీ తింటుంటే నోటీకి కమ్మగా ఉంటుంది. అయితే దీని ఖరీదు కూడా ఎక్కువగానే ఉంటుంది. ఇది రైస్ లోకి కూడా కలుపుకొని తినడానికి అద్భుతంగా ఉంటుంది.

పనీర్ అంటే ఇష్టపడనివాళ్లు కూడా ఒక్కసారి ధాబా స్టైల్ పనీర్ కర్రీ తిన్నారంటే జన్మలో మర్చిపోలేరు. ధాబా స్టైల్ లో ఉంటే పనీర్ కర్రీ ఇంట్లో అదే టేస్ట్, అదే ఫ్లేవర్ తో కొన్ని చిట్కాలను ఉపయోగించి తయారుచేసుకోవచ్చు. అచ్చం ధాబా స్టైల్ లో టేస్టీ పనీర్ కర్రీని మీ ఇంట్లోనే ఈజీగా ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

Dhaba style paneer curry at home recipe in telugu

ధాబా స్టైల్ పనీర్ కర్రీ తయారీకి కావాల్సిన పదార్థాలు

-టమాటో
-ఉల్లిపాయ
-గరం మసాలా
-కొత్తిమీర
-పనీర్
-జీలకర్ర పొడి
-ఆయిల్ లేదా నెయ్యి
-ధనియాల పొడి
-కారం
-ఉప్పు
-పసుపు
-జీలకర్ర
-యాలకలు
-బిర్యానీ ఆకు
-లవంగాలు
-దాల్చిన చెక్క
-కసూరి మేధీ
-పెరుగు

Dhaba style paneer curry at home recipe in telugu

ధాబా స్టైల్ పనీర్ కర్రీ తయారీ విధానం

-ముందుగా 200 గ్రాముల పనీర్ ని తీసుకొని మీకు నచ్చిన సైజులో క్యూబ్స్ లా కట్ చేసుకోండి.

-తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో అర టీస్పూన్ ధనియాల పొడి, పావు టీస్పూన్ గరం మసాలా,అర టీస్పూన్ కారం, పావు టీస్పూన్ ఉప్పు వేసి మొత్తం కలిసేలా కలిపాక ఇందులో కట్ చేసిన పనీర్ ముక్కలు వేసి మసాలాలన్నీ పనీర్ కి బాగా పట్టేలా కలుపుకోండి.

-తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ లేదా వెన్న వేసి వేడి చేశాక ఇందులో మసాలాలు కలిపి ఉంచుకున్న పనీర్ ముక్కలను ఇందులో వేసి 2 నిమిషాలు ఫ్రై చేసుకోండి. మరీ ఎక్కువగా ఫ్రై చేయకూడదు.

-వేయించిన పనీర్ ముక్కలను ఆయిల్ లో నుంచి ఓ గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోండి.

-తర్వాత స్టవ్ మీద ఉన్న పాన్ లోని మిగిలిన ఆయిల్ లోనే 1 కప్పు ఉల్లిపాయ చీలికలు వేసి సగం వరకు ఫ్రై చేసుకున్నాక అందులో 1 కప్పు టమాటో పెద్ద ముక్కలు వేసి అవి మెత్తబడే దాకా ఫ్రై చేసుకొని స్టవ్ ఆపేసి చల్లారనివ్వాలి.

-ఇప్పుడు మిక్సీ జార్ లో వేయించిన టమాటో,ఉల్లిపాయలు వేసి మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోండి.

-తర్వాత స్టవ్ మీద మరో పాన్ పెట్టి 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ లేదా నెయ్యి వేసి వేడి చేసి ఇందులో అర టీస్పూన్ జీలకర్ర, 2 యాలకలు, లవంగాలు, చిన్న దాల్చిన చెక్క ముక్క, 2 బిర్యానీ ఆకులు వేసి ఫ్రై చేయాలి. లైట్ గా ఫ్రై చేశాక ఇందులో గ్రైండ్ చేసిన ఉల్లిపాయ,టమాటో పేస్ట్ వేసి 2-3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి.

-ఉల్లిపాయ టమాటో పేస్ట్ కొద్దిగా ఫ్రై అయ్యాక అందులో ఫ్రెష్ గా ప్రిపేర్ చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలపండి.

-టమటో ఉల్లిపాయ పేస్ట్ నుంచి లైట్ గా ఆయిల్ రిలీజ్ అవుతున్న సమయంలో అందులో 1 టీస్పూన్ ధనియాల పొడి, అర టీస్పూన్ వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి, 2 టీస్పూన్ల కారం, చిటికెడు పసుపు, సరిపడా ఉప్పు వేసి తక్కువ మంట మీద బాగా కలపండి.

-మసాలాలన్నీ కలిపాక అందులో 4 టేబుల్ స్పూన్ల కమ్మటి పెరుగు వేసి కలిపి మూత పెట్టి 2 నిమిషాలు తక్కువ మంట మీద ఉడికించాలి. తర్వాత మూత తీసి అందులో గ్రేవీకి సరిపడా నీళ్లు పోసి కలిపి మూతపెట్టి మళ్లీ 4 నిమిషాలు తక్కువ మంట మీద బాగా మరిగించాలి.

-కర్రీలో నుంచి ఆయిల్ పైకి తేలుతున్న సమయంలో అందులో ఫ్రై చేసిన పనీర్ ముక్కలు వేసి నెమ్మదిగా కలపండి. మళ్లీ మూతపెట్టి 3 నిమిషాలు మీడియం మంటమీద ఉడికించాలి. తర్వాత మూత తీసి అర టీస్పూన్ గరం మసాలా పొడి, కొత్తిమీర తరుగు, 1 టీస్పూన్ కసూరి మేథీని ఇందులో నలిపి వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి. అంతే నోరూరించే ధాబా స్టైల్ పనీర్ కర్రీ రెడీ.

[ of 5 - Users]
Story first published: Monday, July 28, 2025, 11:03 [IST]
Desktop Bottom Promotion