హరియాలీ మటన్ బిర్యానీ.. తింటుంటే అబ్బా అనాల్సిందే..ఎలా చేసుకోవాలంటే..

Posted By:

రెగ్యులర్‌ గా చేసుకునే మటన్ దమ్ బిర్యానీ, చికెన్ బిర్యానీలు తిని బోర్ కొట్టిందా? అయితే ఈసారి కాస్త కొత్తగా, ఆరోగ్యానికి మేలు చేస్తూనే.. నాలుకకు అద్భుతమైన రుచిని పరిచయం చేసే హరియాలీ మటన్ బిర్యానీ ట్రై చేయండి.

పుదీనా, కొత్తిమీరల పచ్చని సోయగంతో, మసాలాల ఘాటుతో, లేత మటన్ ముక్కల కలయికతో తయారయ్యే ఈ బిర్యానీ తింటుంటే.. అబ్బా అనాల్సిందే. ఈ సూపర్ టేస్టీ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇక్కడ చూడండి.

Hariyali Mutton Biryani Recipe Ingredients and Easy Preparation Method in Telugu

హరియాలీ మటన్ బిర్యానీ తయారీకి కావాల్సిన పదార్థాలు

లేత మటన్ - 1 కిలో
బాస్మతి బియ్యం - 3 కప్పులు
ఉల్లిపాయలు - 2 (సన్నగా తరగాలి)
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 2 టేబుల్ స్పూన్లు
కొత్తిమీర - 1 కప్పు (నిండుగా)
పుదీనా ఆకులు - 1 కప్పు
పచ్చిమిర్చి - 4
కమ్మటి పెరుగు - 1 కప్పు
ఎండు మిర్చి - 2
సోంపు - 1 టీస్పూన్
షాజీరా - 1 టీస్పూన్
యాలకులు - 3
లవంగాలు - 4
దాల్చిన చెక్క - 1 అంగుళం ముక్క
అనాస పువ్వు - 1
పసుపు - 1 టీస్పూన్
ఉప్పు - రుచికి తగినంత
నూనె - తగినంత
నీళ్లు - తగినన్ని

ఉల్లిపాయ కారం ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా? టిఫిన్స్ లోకి టేస్ట్ వేరే లెవల్

హరియాలీ మటన్ బిర్యానీ తయారీ విధానం

-ముందుగా 3 కప్పుల బాస్మతి బియ్యాన్ని శుభ్రంగా కడిగి, కనీసం అరగంట పాటు నీటిలో నానబెట్టుకోవాలి.

-ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో కడిగి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, ఒక కప్పు పెరుగు వేసి మెత్తని పేస్ట్‌ లా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇదే ఈ బిర్యానీకి అసలైన రుచిని, రంగును ఇస్తుంది.

-ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్రెజర్ కుక్కర్ పెట్టుకోవాలి. అందులో తగినంత నూనె లేదా నెయ్యి వేసి వేడి అయ్యాక.. యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, అనాస పువ్వు, సోంపు, షాజీరా, ఎండుమిర్చి వేసి వేయించాలి. ఆ తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసి బంగారు రంగులోకి మారేలా వేయించాలి.

-ఉల్లిపాయలు వేగాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా వేయించాలి. ఇప్పుడు శుభ్రం చేసుకున్న మటన్ ముక్కలను అందులో వేసి బాగా కలపాలి. కాసేపు మటన్ మగ్గాక రుచికి సరిపడా ఉప్పు, పసుపు వేసుకోవాలి.

-మటన్ ముక్కలకు ఉప్పు పట్టిన తర్వాత, ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గ్రీన్ పేస్ట్ వేసి బాగా కలపాలి. మటన్ ముక్కలకు ఆ పుదీనా, కొత్తిమీర ఫ్లేవర్ పట్టేలా 5 నిమిషాలు ఉడకనివ్వాలి. ఆ తర్వాత తగినన్ని నీళ్లు పోసి, కుక్కర్ మూతపెట్టి 6-7 విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించాలి. విజిల్స్ వచ్చాక ప్రెజర్ పోయేదాకా ఆగి మూత తీయాలి. అప్పుడు మటన్ లేతగా, జ్యూసీగా ఉడికి ఉంటుంది.

-మరో పొయ్యి మీద గిన్నెలో నీళ్లు మరిగించి, అందులో కొద్దిగా ఉప్పు, మసాలా దినుసులు వేసి నానబెట్టిన బాస్మతి బియ్యాన్ని 70 శాతం ఉడికించాలి. ఆ ఉడికిన అన్నాన్ని, కుక్కర్‌ లో ఉడికిన గ్రీన్ మటన్ గ్రేవీపై పొరలు పొరలుగా వేయాలి. పైన కొద్దిగా నెయ్యి, వేయించిన ఉల్లిపాయలు చల్లి, మూత పెట్టి తక్కువ మంట మీద 10-15 నిమిషాలు దమ్ చేయాలి.

-అంతే మూత తీయగానే ఇల్లంతా గుమగుమలాడే హరియాలీ మటన్ బిర్యానీ రెడీ.

[ of 5 - Users]
Story first published: Tuesday, September 29, 2026, 21:55 [IST]
Desktop Bottom Promotion