మహాశివరాత్రి స్పెషల్.. కర్ణాటక స్టైల్ తంబిట్టు.. రుచి అద్భుతం!

Posted By:

మహాశివరాత్రి పర్వదినం హిందువులకు అత్యంత పవిత్రమైన రోజు. సాధారణంగా మహా శివరాత్రి అంటే చాలామంది ఉపవాసం చేస్తారు. శివరాత్రి సమయంలో దేవుడికి సమర్పించే నైవేద్యాలకు ప్రత్యేక స్థానం ఉంది. అయితే కర్ణాటక వాళ్లు మహాశివరాత్రికి హురిగడలే తంబిట్టు అనే ఒక స్పెషల్ స్వీట్ తయారుచేస్తారు. ఉపవాసం వేళ శరీరం నీరసించి పోకుండా తిన్న వెంటనే శరీరానికి శక్తినిచ్చే వంటకమే హురిగడలే తంబిట్టు(దీనినే తెలుగులో పుట్నాల లడ్డు లేదా వేయించిన శనగపప్పు లడ్డు అంటారు).

ఈ మహాశివరాత్రి నాడు మీరు తప్పకహురిగడలే తంబిట్టు ట్రై చేసి ఉపవాసం వేళ ఆస్వాదించండి. ఈ తంబిట్టు రుచికి అద్భుతంగా ఉండటమే కాకుండా, ఆరోగ్యపరంగా కూడా చాలా మంచిది. దీనిని తయారు చేయడం చాలా సులభం, తక్కువ సమయంలోనే సిద్ధం చేసుకోవచ్చు. కర్ణాటకలో ఇంటికో తీరుగా దీనిని తయారు చేస్తారు. అయితే ఉత్తర కర్ణాటక స్టైల్ లో హురిగడలే తంబిట్టు ఎలా చేసుకోవాలో ఇక్కడ చూడండి.

తయారీకి కావాల్సిన పదార్థాలు

-వేయించిన శనగపప్పు
-బెల్లం తురుము
-కొబ్బరి
-నెయ్యి
-యాలకులు

తయారీ విధానం

-మొదట పుట్నాలను ( శనగపప్పు) బాండీలో వేసి సన్నని మంటపై ఒకటి లేదా రెండు నిమిషాల పాటు వేయించాలి. ఇలా చేయడం వల్ల పప్పులోని తేమ పోయి, మంచి సువాసన వస్తుంది.

-ఇప్పుడు మిక్సీ గిన్నెలో 3 కప్పుల వేయించిన పుట్నాల పప్పు(తినే శెనగపప్పు), 5 యాలకలు వేసి మొత్తాన్ని మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకోండి.

-గ్రైండ్ చేసుకున్న పొడి మరింత మృదువుగా ఉండాలి. ఇందుకోసం ఆ పిండిని జల్లెడలో వేసి జల్లించుకోండి. అప్పుడు మెత్తని, మృదువైన పొడి దిగుతుంది. దీనిని పక్కన పెట్టుకోండి.

-ఇప్పుడు మిక్సీ గిన్నెలో సగం చిప్ప తాజా కొబ్బరి ముక్కలు వేసి మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోండి.

-ఇప్పుడు మిక్సీ గిన్నెలో 1 పచ్చి కొబ్బరి కాయ ముక్కలన్నీ వేసి,ఇందులో 2 కప్పుల నీళ్లు పోసి మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకోండి. ఈ మిశ్రమాన్ని ఒక క్లాత్ లో వేసి ఒక గిన్నెలోకి పిండితే చిక్కని కొబ్బరి పాలు వస్తాయి.

-తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి అందులో 2 కప్పుల బెల్లం తురుము వేసి,ఇందులో ముప్పావు కప్పు నీళ్లు పోసి జస్ట్ బెల్లంని కరిగిస్తే చాలు. పానకంలా ఉండాలి.

-జల్లించి పెట్టుకున్న పిండిలో ఈ బెల్లం పాకం వడకట్టి పోయాలి. ఇందులోనే గ్రైండ్ చేసుకున్న పచ్చి కొబ్బరి పొడి కూడా వేసి చేత్తో మెత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి.

-పిండి బాగా కలుపుకున్న తర్వాత చేతికి కొంచెం నెయ్యి రాసుకోవాలి. పిండిని కొంచెం చేతుల్లోకి తీసుకొని లడ్డుల్లా చేసుకోండి. బందరు లడ్డుల్లా రోల్ చేసుకోండి. అంతే తంబిట్టు రెడీ.

-ఇప్పుడు పక్కన ఉంచుకున్న కొబ్బరి పాలు ఒక గిన్నెలో పోసి అందులో ఈ లడ్డు వేసి తింటే చాలా రుచిగా ఉంటుంది.

[ of 5 - Users]
Desktop Bottom Promotion