డీప్ ఫ్రై లేదు,రుచిలో తగ్గేదే లేదు..చుక్క నూనె లేకుండానే కరకరలాడే పొటాటో కట్లెట్స్

Posted By:

ప్రస్తుత ఉరుకులు పరుగుల జీవితంలో ఉదయం లేవగానే బ్రేక్ ఫాస్ట్ లోకి ఏం చేయాలి? లేదా సాయంత్రం పిల్లలు స్కూల్ నుండి రాగానే వేడిగా, రుచిగా ఏం పెట్టాలి? అనే ప్రశ్న ప్రతి ఇల్లాలిని వేధిస్తుంటుంది. అయితే రుచికరమైన స్నాక్స్ అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేవి నూనెలో డీప్ ఫ్రై చేసిన పదార్థాలే. కానీ ఆరోగ్యానికి ఇవి మంచివి కావు.

వేయించిన ఆహారాలకు దూరంగా ఉంటూ, రుచి విషయంలో ఎలాంటి రాజీ పడకుండా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలనుకునే వారికి నాన్ ఫ్రైడ్ పొటాటో కట్లెట్స్ ఒక బెస్ట్ ఆప్షన్. ఈ కట్లెట్స్ కడుపుకు ఎంతో తేలికగా ఉంటాయి. ఉడికించిన కూరగాయలు కూడా ఇందులో చేర్చడం వల్ల పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. రోజంతా మిమ్మల్ని ఉత్సాహంగా, శక్తివంతంగా ఉంచే బంగాళాదుంప కట్లెట్స్ ఎలా చేసుకోవాలో ఇక్కడ చూడండి.

image: dindigul food court

పొటాటో కట్లెట్స్ తయారీకి కావలసిన పదార్థాలు

ఉడికించిన బంగాళాదుంపలు - 4
ఉడికించిన బఠానీలు, క్యారెట్, బీన్స్- అర కప్పు
బ్రెడ్ స్లైసెస్ - 3
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టీస్పూన్
కారం - అర టీస్పూన్
గరం మసాలా - అర టీస్పూన్
కార్న్‌ఫ్లోర్ లేదా శనగపిండి -2 టీస్పూన్లు
కొత్తిమీర - కొద్దిగా
ఉప్పు -సరిపడా
నూనె - 1 టేబుల్ స్పూన్

పొటాటో కట్లెట్స్ తయారీ విధానం

-ముందుగా ఒక పెద్ద గిన్నె తీసుకుని, అందులో ముందుగా ఉడికించి పెట్టుకున్న బంగాళాదుంపలను వేసి ఉండలు లేకుండా మెత్తగా మాష్ (గుజ్జులా) చేయండి.

-మెత్తగా మాష్ చేసిన బంగాళదుం మిశ్రమంలో ఉడికించిన కూరగాయల ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, గరం మసాలా, ఉప్పు, కొత్తిమీర వేసి అన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలి.

-కట్లెట్స్ చేసేటప్పుడు అవి విడిపోకుండా ఉండటం చాలా ముఖ్యం. అందుకోసం మిక్సీ గిన్నెలో బ్రెడ్ స్లైసెస్ వేసి వాటిని పొడిలా చేసుకోవాలి. మిక్సీ పట్టుకున్న బ్రెడ్ పొడిని,అలాగే కార్న్‌ఫ్లోర్ లేదా శనగపిండిని బంగాళదుంప మిశ్రమంలో వేసి గట్టి ముద్దలా కలుపుకోవాలి.

-ఇప్పుడు చేతులకు కొద్దిగా నూనె రాసుకుని, తయారుచేసుకున్న మిశ్రమం నుండి చిన్న చిన్న ఉండలుగా తీసుకుని టిక్కీల్లాగా ఒత్తుకోవాలి.

-మీ దగ్గర ఎయిర్ ఫ్రైయర్ ఉంటే, అందులో ఈ కట్లెట్స్‌ ను ఉంచి తక్కువ ఉష్ణోగ్రత వద్ద రెండు వైపులా కాల్చుకోవచ్చు. దీనివల్ల నూనె చుక్క లేకుండానే కట్లెట్స్ రెడీ.

-మీ దగ్గర ఎయిర్ ఫ్రైయర్ లేకపోతే..స్టవ్ మీద ఒక నాన్ స్టిక్ పాన్ పెట్టి వేడి చేయండి. కేవలం ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి పాన్ అంతటా రాసి తయారు చేసి పెట్టుకున్న పొటాటో టిక్కీలను పాన్ మీద ఉంచి, మంటను తక్కువలో ఉంచి రెండు వైపులా తిప్పుతూ, కట్లెట్స్ మంచి కలర్ వచ్చి, కరకరలాడే వరకు కాల్చుకోవాలి.

-అంతే వేడివేడి నాన్ ఫ్రైడ్ పొటాటో కట్లెట్స్ రెడీ. వీటిని పుదీనా చట్నీతో గానీ, టొమాటో కెచప్‌తో గానీ తింటే ఆ రుచే వేరు.

[ of 5 - Users]
Story first published: Wednesday, March 25, 2026, 7:06 [IST]
Desktop Bottom Promotion