ఉల్లి, వెల్లుల్లి లేకుండానే..హోటల్ రుచితో బ్రాహ్మణ శైలి వెజ్ కుర్మా.. చపాతీ, పూరీల్లోకి పర్ఫెక్ట్!

Posted By:

చపాతీ, పూరీ, పరాఠా.. వీటికి సరైన కాంబినేషన్ అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది వేడి వేడి వెజ్ కుర్మా. అయితే ఉల్లిపాయ, వెల్లుల్లి వాడకుండా అచ్చం హోటల్ స్టైల్ రుచితో కుర్మాను ఎప్పుడైనా ఇంట్లో ట్రై చేశారా? పండుగ రోజుల్లో లేదా ఉపవాస సమయాల్లో అద్భుతమైన రుచితో పాటు, సాత్వికమైన ఆహారాన్ని తీసుకోవాలనుకునే వారికి బ్రాహ్మణ శైలి వెజ్ కుర్మా ఒక బెస్ట్ ఆప్షన్.

సాధారణంగా ఉల్లి, వెల్లుల్లి వేస్తేనే కూరలకు రుచి వస్తుందని చాలామంది అపోహ పడుతుంటారు. కానీ సరైన మసాలా దినుసులు, కొబ్బరి మిశ్రమంతో చేసే ఈ బ్రాహ్మణ శైలి కుర్మా రుచి చూస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. ఇది సులభంగా జీర్ణమవడమే కాకుండా పొట్టకు చాలా తేలికగా ఉంటుంది. ఉల్లిపాయ, వెల్లుల్లి లేకపోవడం వల్ల ఇది శరీరంలో వేడిని పెంచదు.

No Onion No Garlic Brahmin Style Veg Kurma Recipe in Telugu Best Side Dish for Chapati Puri

బ్రాహ్మణ శైలి వెజ్ కుర్మా తయారీకి కావలసినవి

-తరిగిన క్యారెట్
-బీన్స్ ముక్కలు
-ఉడికిన బంగాళదుంప ముక్కలు
-పచ్చి కొబ్బరి తురుము
-గుప్పెడు జీడిపప్పు
-కొద్దిగా కొత్తిమీర
-ఒక స్పూన్ జీలకర్ర
-కొద్దిగా షాజీరా
-పచ్చిమిర్చి
-చిన్న అల్లం ముక్క
-చిటికెడు పసుపు
-కొద్దిగా చింతపండు
-ఆవాలు
-దాల్చిన చెక్క
-లవంగాలు
-పచ్చిమిర్చి
-వంటనూనె
-ఉప్పు

బ్రాహ్మణ శైలి వెజ్ కుర్మా తయారీ విధానం

-ముందుగా మసాలాను సిద్ధం చేసుకోవాలి. ఇందుకోసం మిక్సీ జార్ లో పచ్చి కొబ్బరి తురుము, జీడిపప్పు, కొత్తిమీర, జీలకర్ర, షాజీరా, పచ్చిమిర్చి, అల్లం, పసుపు, కొద్దిగా చింతపండు వేయాలి. తగినన్ని నీళ్లు పోసి ఎక్కడా బరక లేకుండా మెత్తని పేస్ట్‌ లా గ్రైండ్ చేసుకోవాలి.

-ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్రెషర్ కుక్కర్ పెట్టుకోవాలి. తగినంత నూనె వేసి వేడయ్యాక అందులో ఆవాలు, దాల్చినచెక్క, లవంగాలు వేసి వేయించాలి. ఆ తర్వాత చీల్చిన పచ్చిమిర్చి వేసి కాస్త వేగనివ్వాలి. పోపు వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్, బీన్స్, ఉడికించిన బంగాళదుంప ముక్కలను కుక్కర్‌ లో వేసి ఓ మూడు నిమిషాల పాటు నూనెలో బాగా మగ్గనివ్వాలి. కూరగాయ ముక్కలు కాస్త మెత్తబడాలి.

-ఇప్పుడు ముందుగా మిక్సీ పట్టుకున్న కొబ్బరి-జీడిపప్పు మసాలా పేస్ట్‌ ను ఆ ముక్కల్లో వేసి బాగా కలపాలి. మసాలా పచ్చివాసన పోయేంత వరకు మరో మూడు నిమిషాలు సన్నని మంటపై వేయించాలి.

-చివరగా కుర్మా గ్రేవీకి తగినన్ని నీళ్లు పోసి, రుచికి సరిపడా ఉప్పు వేసి కలుపుకోవాలి. కుక్కర్ మూతపెట్టి మీడియం మంటపై ఒక్క విజిల్ వచ్చే వరకు ఉడికించాలి.

-కుక్కర్ ప్రెషర్ దానంతట అదే పోయిన తర్వాత మూత తీస్తే..వేడివేడి బ్రాహ్మణ శైలి వెజ్ కుర్మా రెడీ. దీనిని చపాతీ, పూరీ, పరాఠాలతో పాటు ఇడ్లీ, దోశ, నెయ్యి అన్నం లేదా వెజ్ పులావ్‌ తో కూడా ఆస్వాదించవచ్చు.

[ of 5 - Users]
Story first published: Thursday, March 19, 2026, 21:53 [IST]
Desktop Bottom Promotion