వీకెండ్ కి అద్దిరిపోయే రొయ్యల బిర్యానీ..ఈ చిట్కాలతో రెస్టారెంట్ లో రుచి ఇంట్లోనే..

Posted By:

వీకెండ్ వచ్చిందంటే చాలు ఇంట్లో ఏదైనా ప్రత్యేకమైన వంటకం కావాలని కోరుకుంటారు. అలాంటి సమయంలో మీ కుటుంబ సభ్యుల హృదయాలను గెలుచుకోవడానికి ఒక అద్భుతమైన వంటకం ఉంది. అదే ఘుమఘుమలాడే రొయ్యల దమ్ బిర్యానీ. కొన్ని చిన్నచిన్న చిట్కాలతో ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ రొయ్యల బిర్యానీని సులభంగా ఎలా తయారు చేసుకోవచ్చో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
రొయ్యలు: 250 -300 గ్రాములు
బాస్మతి బియ్యం: 1 కప్పు (200 గ్రాములు)
ఉల్లిపాయలు: 1 పెద్దది
టమోటా: 1
పచ్చిమిర్చి: 2-3
అల్లం వెల్లుల్లి పేస్ట్: 1 టేబుల్ స్పూన్
గట్టి పెరుగు: 2 టేబుల్ స్పూన్లు
బిర్యానీ మసాలా: 1 టేబుల్ స్పూన్
పసుపు: పావు టీస్పూన్
కారం: 1 టీస్పూన్
ఉప్పు: రుచికి సరిపడా
నూనె/నెయ్యి: 3 టేబుల్ స్పూన్లు
నిమ్మరసం: 1 టేబుల్ స్పూన్
కొత్తిమీర, పుదీనా: సన్నగా తరిగినవి

Restaurant Style Prawns Biryani Made Easy at Home Recipe in Telugu

తయారీ విధానం

-ముందుగా శుభ్రం చేసిన రొయ్యలలో కొద్దిగా ఉప్పు, పసుపు, నిమ్మరసం వేసి బాగా కలిపి 15 నిమిషాల పాటు పక్కన పెట్టాలి. ఇది రొయ్యలు మెత్తగా, రుచిగా ఉండటానికి సహాయపడుతుంది.

-బాస్మతి బియ్యాన్ని కడిగి 30 నిమిషాలు నానబెట్టాలి.

-తర్వాత ఒక గిన్నెలో నీళ్లు పోసి, కొద్దిగా ఉప్పు వేసి మరిగించాలి. నీళ్లు మరుగుతున్నప్పుడు నానబెట్టిన బియ్యాన్ని వేసి కేవలం 70శాతం వరకు మాత్రమే ఉడికించాలి. బియ్యం మెత్తబడకూడదు. ఆ తర్వాత నీటిని వడకట్టి బియ్యాన్ని పక్కన పెట్టుకోవాలి.

-అడుగు మందంగా ఉన్న పాత్రలో నూనె లేదా నెయ్యి వేడి చేయాలి. తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి, అవి బంగారు గోధుమ రంగులోకి మారే వరకు బాగా వేయించాలి.

-ఇప్పుడు అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. ఆపై టమోటా ముక్కలు, పెరుగు, బిర్యానీ మసాలా, కారం, పసుపు, ఉప్పు వేసి నూనె పైకి తేలే వరకు 5 నిమిషాలు ఉడికించాలి.

-ఇప్పుడు అందులో మ్యారినేట్ చేసిన రొయ్యలను వేసి మసాలాతో బాగా కలిపి 3-4 నిమిషాలు ఉడికించాలి. రొయ్యలు ఎక్కువగా ఉడికితే గట్టిపడతాయి. ఇప్పుడు మంటను పూర్తిగా తగ్గించి రొయ్యల గ్రేవీపై సగం ఉడికించిన అన్నాన్ని ఒక పొరలా పరవాలి. దానిపై కొత్తిమీర, పుదీనా చల్లి, మిగిలిన అన్నాన్ని కూడా వేయాలి.

-పాత్రపై మూతను గట్టిగా పెట్టి ఆవిరి బయటకు పోకుండా చూడాలి. సన్నని మంట మీద 10 నుండి 12 నిమిషాల పాటు దమ్ చేయాలి.

-దమ్ అయ్యాక పొయ్యి ఆపి 10 నిమిషాలు అలా వదిలేయండి. ఆ తర్వాత నెమ్మదిగా ఒక పక్క నుండి కలుపుతూ, వేడివేడిగా ఒక ప్లేట్‌ లోకి తీసుకోండి. దీనిపై కొత్తిమీర, పుదీనా, నిమ్మరసంతో అలంకరించి, చల్లటి పెరుగు రైతా లేదా సలాడ్‌ తో తింటే సూపరో సూపర్.

[ of 5 - Users]
Story first published: Thursday, October 30, 2025, 22:03 [IST]
Desktop Bottom Promotion