రక్తం పట్టాలా? ఎముకలు బలపడాలా? అయితే ఈ లడ్డు తినాల్సిందే!

Posted By:

ఈ రోజుల్లో చాలామంది పిల్లలు జంక్ ఫుడ్‌ కి అలవాటు పడి, రక్తహీనత, బలహీనమైన ఎముకల వంటి సమస్యలతో బాధపడుతున్నారు. అలాంటివారికి ఇంట్లోనే, మీ చేతులతోనే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం అందించే అద్భుతమైన స్నాక్ సజ్జు లడ్డు చేసి ఇవ్వండి.

రోజూ ఒక్క సజ్జ లడ్డు తింటే చాలు, మీ పిల్లలలో రక్తహీనత మాయమవుతుంది, ఎముకలు బలంగా తయారవుతాయి. స్కూల్ నుండి వచ్చిన పిల్లలకు లేదా సాయంత్రం ఆకలిగా ఉన్నప్పుడు ఇవ్వడానికి ఇది బెస్ట్ స్నాక్. ఇంట్లోనే ఈ లడ్డు ఎలా తయారు చేయాలో ఇక్కడ చూడండి.

సజ్జ లడ్డుకి కావలసిన పదార్థాలు

సజ్జ పిండి:250 గ్రాములు
బెల్లం:400 గ్రాములు
నెయ్యి: 10-12 టీస్పూన్లు
తెల్ల నువ్వులు: 100 గ్రాములు
వేరుశనగలు (పల్లీలు): 150 గ్రాములు
బాదం: 75 గ్రాములు
ఎండుద్రాక్ష (కిస్మిస్): 25 గ్రాములు
ఏలకుల పొడి: 1 టీస్పూన్
శొంఠి పొడి: పావు టీస్పూన్
ఉప్పు: 2 చిటికెడు
నీరు: అర కప్పు

సజ్జ లడ్డు తయారీ విధానం

-ముందుగా స్టవ్ వెలిగించి మందపాటి బాండీని పెట్టుకోండి. అందులో 1 టీస్పూన్ నెయ్యి వేసి వేడెక్కాక, తెల్ల నువ్వులు వేసి బంగారు రంగు వచ్చేవరకు దోరగా వేయించండి. వీటిని ఒక ప్లేట్‌ లోకి తీసుకుని చల్లారనివ్వండి.

-అదే బాండీలో మరో టీస్పూన్ నెయ్యి వేసి, వేయించిన వేరుశనగ పప్పులను (పొట్టు తీసినవి) వేసి కాసేపు వేయించండి. వీటిని కూడా నువ్వుల ప్లేట్‌ లోకి తీసుకోండి.

-ఇప్పుడు మళ్ళీ అదే బాండీలో 1 టీస్పూన్ నెయ్యి వేసి, తరిగిన బాదం ముక్కలను వేయించండి. అవి వేగాక ఎండుద్రాక్ష వేసి, అవి ఉబ్బే వరకు వేయించి పక్కన పెట్టుకోండి.

-మళ్లీ అదే బాండీలో 2 టీస్పూన్ల నెయ్యి వేసి, సజ్జ పిండి వేయండి. సన్నని మంటపై పిండిని వేయిస్తూ, మధ్యమధ్యలో కొద్దికొద్దిగా (మొత్తం 8 టీస్పూన్ల వరకు) నెయ్యి కలుపుతూ ఉండాలి. పిండి నుండి పచ్చి వాసన పోయి, కమ్మటి సువాసన వచ్చే వరకు వేయించి, పక్కన పెట్టి చల్లార్చండి.

-వేయించి పెట్టుకున్న నువ్వులు, పల్లీలు, బాదంలో సగం తీసుకుని మిక్సీ జార్‌ లో వేసి ఒక్కసారి బరకగా తిప్పండి. మరీ మెత్తగా పొడి చేయకూడదు.

-ఒక పెద్ద గిన్నెలో వేయించిన సజ్జ పిండి, మిక్సీ పట్టిన పప్పుల పొడి, మిగిలిన వేయించిన పప్పులు, ఏలకుల పొడి, శొంఠి పొడి, చిటికెడు ఉప్పు వేసి బాగా కలపండి.

-ఒక గిన్నెలో తురిమిన బెల్లం, అర కప్పు నీళ్లు పోసి కరిగించండి. బెల్లం కరిగాక వడకట్టి, మళ్ళీ స్టవ్ మీద పెట్టి తీగ పాకం వచ్చే వరకు మరిగించండి.

-తీగ పాకం రాగానే స్టవ్ ఆపేసి వెంటనే ఆ పాకాన్ని పిండి మిశ్రమంలో పోయండి. గరిటెతో వేగంగా, బాగా కలపండి. మిశ్రమం గోరువెచ్చగా ఉన్నప్పుడే చేతికి కొద్దిగా నెయ్యి రాసుకుని, మీకు నచ్చిన సైజులో గుండ్రని లడ్డూలుగా చుట్టండి.

-అంతే సజ్జ లడ్డు రెడీ. వీటిని గాలి చొరబడని డబ్బాలో నిల్వ ఉంచితే 10-15 రోజుల వరకు ప్రెష్ గా ఉంటాయి.

[ of 5 - Users]
Desktop Bottom Promotion