ఉగాది సంప్రదాయ వంటకాలు: జస్ట్ 20 నిమిషాల్లో సజ్జ బూరెలు, కొబ్బరి బూరెలు..ఎలా చేసుకోవాలంటే.

Posted By:

ఉగాది పండుగ అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడి. తెలుగు లోగిళ్లలో కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఎంతో ఘనంగా జరుపుకునే ఈ పండుగ రోజున.. పచ్చడితో పాటు కమ్మని సాంప్రదాయ వంటకాలను ఆస్వాదించడం మన ఆనవాయితీ.

ఈ ఉగాదికి మీ ఇంట్లో పండుగ వాతావరణాన్ని మరింత రెట్టింపు చేయడానికి, అందరి నోళ్లు తీపి చేయడానికి రెండు అద్భుతమైన సాంప్రదాయ, ఆరోగ్యకరమైన స్వీట్ రెసిపీలు కొబ్బరి బూరెలు, సజ్జ బూరెలు. వీటిని జస్ట్ 20 నిమిషాల్లో మీ ఇంట్లోనే ఈజీగా ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

Ugadi Special Traditional Sweet Recipes Tasty Healthy Kobbari Burelu Sajja Burelu in Just 20 Minutes

కొబ్బరి బూరెలు తయారీకి కావాల్సిన పదార్థాలు

మినప్పప్పు పిండి: 1 కప్పు
బియ్యప్పిండి: 2 కప్పులు
పచ్చి కొబ్బరి తురుము: 3 కప్పులు
బెల్లం తురుము: 1 కప్పు
జీడిపప్పు: పావు కప్పు
యాలకుల పొడి: అర టీస్పూన్
ఉప్పు: చిటికెడు
నూనె: డీప్ ఫ్రైకి సరిపడా

కొబ్బరి బూరెలు తయారీ విధానం

-ముందుగా జల్లించిన మినప్పప్పు పిండిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అందులో బియ్యప్పిండి, చిటికెడు ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి దోసె పిండిలా (కొంచెం చిక్కగా) కలుపుకుని రెండు గంటల పాటు పక్కన పెట్టుకోవాలి.

-తర్వాత స్టవ్ మీద మందపాటి కడాయి పెట్టి అందులో బెల్లం, పచ్చి కొబ్బరి తురుము వేసి సన్నని మంటపై బాగా కలపాలి. ఈ మిశ్రమం పాకంలా దగ్గరపడ్డాక, అందులో జీడిపప్పు ముక్కలు, యాలకుల పొడి, రెండు టీ స్పూన్ల బియ్యప్పిండి వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి.

-మిశ్రమం కాస్త చల్లారాక చిన్న చిన్న ఉండలుగా (పూర్ణాలుగా) చేసుకుని పక్కన పెట్టుకోవాలి.

-ఇప్పుడు 2 గంటలు నానబెట్టుకున్న పిండిని తీసుకుని కొద్దిగా నీళ్లు పోసి జారుగా కలుపుకోవాలి. ఒక్కో కొబ్బరి ఉండను ఈ పిండిలో ముంచి, కాగుతున్న నూనెలో వేసి ఎర్రగా వేయించి తీసుకుంటే.. కమ్మని కొబ్బరి బూరెలు రెడీ.

సజ్జ బూరెలు తయారీకి కావాల్సిన పదార్థాలు

సజ్జలు: 1 కిలో
సగ్గుబియ్యం: 1 టేబుల్ స్పూన్
బెల్లం తురుము: అర కిలో
నువ్వులు: పావు కప్పు
ఎండు కొబ్బరి పొడి: పావు కప్పు
యాలకుల పొడి: అర టీస్పూన్
ఉప్పు: తగినంత
నూనె: డీప్ ఫ్రైకి సరిపడా

సజ్జ బూరెలు తయారీ విధానం

-ముందుగా సజ్జలు, సగ్గుబియ్యం కలిపి మిల్లులో మెత్తని పిండిలా ఆడించుకోవాలి.

-బెల్లం తురుమును కొద్దిగా నీళ్లలో వేసి కరిగేదాకా నానబెట్టాలి.

-ఇప్పుడు ఒక వెడల్పాటి పళ్లెంలో సజ్జ పిండి తీసుకుని, అందులో ఎండు కొబ్బరి పొడి, వేయించిన నువ్వులు, యాలకుల పొడి, తగినంత ఉప్పు వేసి బాగా కలపాలి. కరిగిన బెల్లం నీళ్లను ఈ పిండిలో పోస్తూ ఉండలు కట్టకుండా ముద్దలా కలుపుకోవాలి.

-కలిపిన పిండిని నిమ్మకాయ సైజులో చిన్న చిన్న ఉండలుగా తీసుకుని చేత్తో బూరెల్లా (కాస్త మందంగా) వత్తుకోవాలి.

-స్టవ్ మీద కడాయి పెట్టి నూనె లేదా నెయ్యి బాగా వేడి చేసి, వత్తుకున్న బూరెలను వేసి రెండు వైపులా చక్కగా కాల్చుకుని ప్లేట్లోకి తీసుకోవాలి. సజ్జ బూరెలు రెడీ.

[ of 5 - Users]
Story first published: Wednesday, March 18, 2026, 9:20 [IST]
Desktop Bottom Promotion