లంబోదరుడికి ప్రీతికరమైన బెల్లం పాల తాలికలు.. పర్ఫెక్ట్‌గా రావాలంటే ఈ కొలతలతో ట్రై చేయండి.!

వినాయక చవితి సందర్భంగా విఘ్నేశ్వరుడికి ప్రీతికరమైన ప్రసాదాలు చేయడం మన తెలుగు సంప్రదాయంలో ఆనవాయితీ. లంబోదరుడికి ఇష్టమైన వాటిలో బెల్లం పాల తాళికలు ఒకటి. అయితే చాలా మంది ఈ ప్రసాదం చేసేటప్పుడు చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల పాలు విరిగిపోవడం లేదా, తీపి సరిపోకపోవడం, పాయసం గట్టిపడటం జరుగుతుంది. దీంతో కొంచెం నిరాశకి గురికాక తప్పదు. అయితే బెల్లం పాల తాళికలు చేసేటప్పుడు ఈ టిప్స్‌ ఫాలో అయ్యారంటే చాలా టేస్టీగా, పర్ఫెక్ట్‌గా చేయవచ్చు. ఆ కొలతలు, టిప్స్‌ చూద్దాం..

Vinayaka chavithi special bellam paala thalikalu with perfect measurements and process

బెల్లం పాల తాళికలు తయారీకి కావాల్సిన పదార్థాలు

సగ్గుబియ్యం- రెండు టేబుల్‌ స్పూన్లు
బెల్లం- ఒకటి పావు కప్పు
బియ్యం పిండి- కప్పు
పాలు- రెండున్నర కప్పులు
కాచి చల్లార్చిన పాలు- అర కప్పు
ఏలకుల పొడి- అరటీస్పూన్‌
నెయ్యి- టేబుల్‌ స్పూన్‌
జీడిపప్పు పలుకులు- పది
కిస్‌మిస్‌- పది
ఎండు కొబ్బరి ముక్కలు- అర కప్పు

బెల్లం పాల తాళికలు తయారీ విధానం

బెల్లం పాల తాళికల కోసం ముందుగా సగ్గుబియ్యాన్ని కడిగి గంట పాటు నానబెట్టుకోవాలి. అప్పుడే పాయసంలో ఇవి ఉబ్బుతూ బాగా ఉడుకుతూ టేస్టీగా వస్తాయి.

గణేశ్‌ చతుర్థి స్పెషల్‌.. తమిళనాడు స్టైల్‌లో నోరూరించే పరమాన్నం.. తింటే స్వర్గమే.!

ఇప్పుడు స్టవ్‌పైన పాన్‌ పెట్టుకుని అందులో పావు కప్పు బెల్లం వేసి కప్పు నీళ్లు పోసి బెల్లం కరిగేంత వరకు చిన్న మంటపైన కలుపుతూ ఉండాలి. బెల్లం కరిగిన తర్వాత బియ్యం కడిగి ఆరబెట్టి పొడి చేసి పిండి కప్పు తీసుకుని ఈ బెల్లం పానకంలో వేసి కలపాలి.

చపాతీ పిండి మాదిరిగా గరిటెతో మొత్తం కలిసేలా కలిపిన తర్వాత స్టవ్‌ ఆఫ్‌ చేసి పక్కన పెట్టి మూత పెట్టి చల్లారనివ్వాలి. ఈ లోపు స్టవ్‌పైన మరో పాన్‌లో కప్పు బెల్లం వేసి పావు కప్పు నీళ్లు పోసుకోవాలి. చిన్న మంటపైన బెల్లం కరిగిన తర్వాత రెండు నిమిషాల పాటు మరిగించి చల్లారపెట్టుకోవాలి.

Vinayaka chavithi special bellam paala thalikalu with perfect measurements and process

తర్వాత వెడల్పాటి బాణలిలో రెండున్నర కప్పుల పాలు పోసి కాచుకోవాలి. పాలు కాగేలోపు గోరువెచ్చగా అయిన పిండి ముద్దలో పిడికెడు పక్కన పెట్టి మిగతా పిండి ముద్దను తాళికల మాదిరిగా చేసుకోవాలి. లేదా మురుకుల గొట్టంలో పిండి పెట్టి ఒత్తుకోవచ్చు.

పాలు కాగిన తర్వాత నానబెట్టిన సగ్గుబియ్యాన్ని వేసి ఉడికించాలి. దాంతో పాటు తయారు చేసిన తాళికలను మరుగుతున్న పాలలో వేసి కలపకుండా ఐదు నిమిషాల పాటు చిన్న మంటపైన ఉడికించాలి. ఈ లోపు పక్కకు పెట్టుకున్న పిండి ముద్దలో కాచి చల్లార్చిన పాలు పోసి ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. పాలు లేకపోతే నీళ్లతో అయినా కలుపుకోవచ్చు.

ఈ జారు పిండిని ఉడుకుతున్న పాల తాళికల్లో పోసి స్మూత్‌గా, నిదానంగా కలుపుకోవాలి. చిన్న మంటపైన ఉడకనివ్వాలి. ఐదు నిమిషాల తర్వాత తాళికలు ఉడికాయో లేదా గరిటెతో చెక్‌ చేసుకోండి. ఉడికిన తర్వాత బాగా చల్లారనివ్వాలి.

బొజ్జ గణపయ్యకు ప్రత్యేక నైవేద్యం.. 15 నిమిషాల్లో సింపుల్‌గా చేసుకునే పంచకజ్జాయ.!

చల్లారిన తర్వాత సిద్ధం చేసి పెట్టుకున్న బెల్లం పానకాన్ని ఇందులో పోసి నెమ్మదిగా కలపాలి. వేడి తాళికల్లో వేడి బెల్లం పానకం పోసినట్లయితే పాలు విరిగిపోతాయి. అందుకే రెండూ చల్లారిన తర్వాత కలుపుకోవాలి. తర్వాత ఏలకుల పొడి వేసి కలపండి.

ఇప్పుడు స్టవ్‌పైన చిన్న పాన్‌ పెట్టుకుని అందులో నెయ్యి వేసి కరిగాక జీడిపప్పు, కిస్‌మిస్‌ వేసి వేయించుకుని బెల్లం పాల తాళికల్లో కలుపుకోవాలి. ఈ పద్ధతిలో చేస్తే పర్ఫెక్ట్‌ బెల్లం పాల తాళికలు రెడీ.

[ of 5 - Users]
Story first published: Friday, September 11, 2026, 5:31 [IST]
Desktop Bottom Promotion