For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ మూడు అలవాట్లు మీ తల్లిని ఆరోగ్యంగా మరియు సంతోషంగా ఉండేలా చేయగలవు

|

దేవుడు ప్రతిచోటా ఉండలేక అమ్మని సృష్టించాడు అంటారు. నిజమే, ప్రేమకి స్వచ్ఛమైన రూపంలా ప్రతిబింబిస్తుంది అమ్మ. తల్లి విలువ తెలిసిన ప్రతిఒక్కరికీ తల్లిప్రేమ విలువ తెలుస్తుంది. తల్లి అంటేనే ఒక అద్భుతం, కుటుంబానికి వెన్నెముకలా ఉంటూ, అందరి సంరక్షణకు బాధ్యత వహించే నిస్వార్ధ జీవి అమ్మ.

ఈ ప్రపంచమంతా మనల్ని విడిచినా, మన చేయి వదలకుండా మనకు మద్దతునిచ్చే ఒకే ఒక వ్యక్తి అమ్మ. ఆమె ఉదారత, సంరక్షణ, ఆప్యాయత, క్షమాగుణం ఏ ఇతర వ్యక్తితోనూ సరితూగదు. ఒక తల్లి ప్రేమను నిర్వచించడం ఎంతటి వారికైనా ఒక సవాలుగానే ఉంటుంది. ప్రతి ఒక్కరి వ్యక్తిగత అవసరాలను నిరంతరం గమనిస్తూ, తనవారికోసం, ఎటువంటి త్యాగానికైనా సిద్దపడే అమ్మ అనిర్వచనీయం. అటువంటి అమ్మను జీవితాంతం సంతోషంగా చూసుకోవలసిన బాధ్యత మనమీద ఉంటుంది. అవునా?

కొన్నిరోజుల క్రితం, ప్రపంచ తల్లుల దినోత్సవం నాడు మంచిమంచి కాప్షన్లతో కూడిన చిత్రాలు, కొటేషన్లు, శీర్షికలను సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేస్తూ, వారివారి తల్లుల మీద ఉన్న ప్రేమను ప్రపంచంతో పంచుకోవడం అందరమూ చూశాము. కానీ మిగిలిన సంవత్సరమంతా అదే ప్రేమను కొనసాగిస్తున్నారా? లేదా కేవలం సోషల్ మీడియాలో లైకులు, షేర్ల కోసమే అన్నట్లు పోస్ట్స్ చేశారా? ఇక్కడ ఎవరినీ కించపరచడం లేదు. తల్లులను గుండెలలో పెట్టుకుని చూసే పిల్లలు ఉన్నట్లే, వారిని నిరంతరం తమచేష్టలతో భాదపెట్టే వారు కూడా ఈ ప్రపంచంలో సర్వసాధారణం. మారుతూ ఉన్న టెక్ ప్రపంచం కారణంగా పక్కన చేరి, బాగోగులు అడగాల్సిన వారు ఎప్పుడో కానీ, మెసేజ్ లేదా కాల్స్ ద్వారా చుట్టపు చూపుగా పలకరిస్తూ సంబంధాల ఉనికినే ప్రశ్నార్ధకం చేస్తున్నారు అన్నది వాస్తవం.

ఆమెకు ఖరీదైన బహుమతులను ఇవ్వడానికి బదులుగా, ఇక్కడ చెప్పబడిన మూడు అలవాట్లను పాటిస్తున్నారేమో గమనిస్తూ ఉండండి. ఈ మూడు అలవాట్లు, ఆమెను సంతోషంగా, ఆరోగ్యంగా ఉండేందుకు దోహదం చేస్తాయి.

1. పోషకాహారాన్ని తీసుకోవడం:

తల్లి, వారి పిల్లలు తినగా మిగిలిపోయిన ఆహారాన్ని తినే అలవాటును కలిగి ఉంటుంది. దీనికి కారణం, ఆమె ఆహారాన్ని వృథాచేయటానికి ఇష్టపడకపోవడమే. మరియు కష్టపడి సంపాదించినది అన్న భావన. ఇలా పిల్లలు తినగా మిగిలిన బర్గర్/పాన్కేక్ వంటి ఆహారాలను తరచుగా తీసుకోవడం కారణంగా, శరీరంలో అదనపు కేలరీలు పేరుకొనిపోయే ప్రమాదం ఉంది. క్రమంగా ఇది ఊబకాయానికి దారితీయవచ్చు.

మీ పిల్లలు తినే తీరు, పరిమాణం వయసు దృష్ట్యా మారుతుందని గ్రహించడం అత్యవసరం. పసిపిల్లలకు కొంత సమయం విరామం ఇచ్చిన తర్వాత భోజనం అవసరం ఉండవచ్చు, కానీ పెద్దలలో, జీర్ణవ్యవస్థ భిన్నంగా ఉన్న కారణాన, ప్రతి రెండు-మూడు గంటలకు ఒకసారి ఆహారాన్ని తీసుకోవలసిన అవసరం ఉండదు. కావున తీసుకునే ఆహారం మీద శ్రద్ద ఉంచడం అవసరం.

అంతేకాక, అధిక పనిఒత్తిడి కారణంగా మహిళల్లో అనేకమంది తరచుగా ఆహారాన్ని మరచిపోవడం, లేదా స్కిప్ చేయడం చేస్తుంటారు. సంవత్సరాలుగా, ఈ నిర్లక్ష్యం కొనసాగడం మూలంగా శరీరంలో అత్యంత ముఖ్యమైన పోషకలోపాలకు దారితీస్తుంది. శరీరం ఆరోగ్యకరమైన జీవక్రియలను కలిగి ఉండాలంటే, మన శరీరంలో తగినంత ప్రోటీన్ ఉండటం అవసరం.

కావున, మహిళలు వర్కింగ్ ఉమెన్ అయినా, గృహిణిగా ఉన్నా, బ్రొకోలీ, బాదం, గుడ్డు, కాటేజ్ చీజ్, చికెన్ బ్రెస్ట్, లీన్ బీఫ్, చేపలు, క్వినోయా మరియు వోట్మీల్ వంటి ప్రోటీన్ ఆధారిత ఆహారాలను తరచుగా తీసుకునేలా జాగ్రత్త వహించాలి.

2. వ్యాయామం తప్పనిసరి:

మన తల్లుల దైనందిక జీవనచర్యలలో బిజీషెడ్యూల్ నిమిత్తం, వ్యాయామానికి సమయం కేటాయించలేని స్థితిలో ఉంటూ ఉంటారు. కానీ ఒక ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలంటే, జీవనశైలికి సరిపోయేలా, మరియు శరీరం క్రియాశీలకంగా ఉండేందుకు వ్యాయామం తప్పనిసరిగా ఉంటుంది. వ్యాయామశాలకు వెళ్ళే సమయం లేనిపక్షంలో, ఇంటిలోనే కాస్త సమయం కేటాయించి కొన్ని వ్యాయామ పద్దతులను అనుసరించడం మేలు. అంతేకాకుండా, జాగింగ్, నడక, ఏరోబిక్స్, యోగా వంటివి కూడా అనుసరించవచ్చు. క్రమంగా అదనపు కేలరీలు కరిగి, శరీరం చురుకుగా ఉండేలా సహకరిస్తుంది.

3. మెదడును శాంతపరచండి:

ఆరోగ్యకరమైన ఆహారం మరియు వ్యాయామాలు మీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి సూచించదగిన స్పష్టమైన మార్గాలుగా ఉన్నా కూడా, మానసిక ప్రశాంతత కూడా అత్యంత ముఖ్యమైన అంశాలలో ఒకటిగా ఉంటుంది. తరచుగా మన తల్లులు, నిద్రలో ఉలికిపాట్లకు గురవడం లేదా, చిన్నచిన్న విషయాలకే టెన్షన్ గురవడం వంటివి చూస్తూనే ఉంటాం. దీనికి కారణం, వారు ప్రతిఅడుగులోనూ మన సంరక్షణ గురించి ఆలోచించడమే. వారికి మీ విధానాలు, నడవడికలపట్ల ధైర్యాన్నివ్వడం ద్వారా, వారు సంరక్షణా భావాన్ని కలిగి ఉండి సంతోషంగా ఉండగలరు. ఉదాహరణకు పిల్లలకు టిఫిన్ బాక్స్ ఏర్పాటు చేయడం దగ్గర నుండి, సరైన సమయానికి తింటున్నారా లేదా అని ఆలోచించడం వరకు నిరంతరం ఆలోచనలలో మునిగి ఉంటారు. మరియు కుటుంబ సభ్యుల, ఆర్ధిక, ఆరోగ్య పర్యవేక్షణ మొదలైన అనేక అంశాల నడుమ వారి ఆందోళనలు కొనసాగుతూ ఉంటాయి. క్రమంగా కొన్ని ఆరోగ్యసమస్యలకు కూడా గురవుతూ ఉంటారు.

కానీ మీకు కూడా వ్యక్తిగత స్వేచ్చ, స్వాతంత్ర్యం, ఉంటాయని మరువకండి. ఏమాత్రం వెసులుబాటు ఉన్నా, మీ ఆలోచనా దృక్పదం ప్రకారం నడుచుకోవడం కూడా అవసరం. అనగా సోషల్ మీడియా పర్యవేక్షించడం, మేకప్, షాపింగ్, సినిమా, ట్రిప్స్ వంటి వాటికి సమయాన్ని వెచ్చించడం అవసరం. మీ ఆసక్తులను అనుసరించి, పుస్తకాలను చదవడం, హస్తకళలు, పార్ట్-టైమ్ ఉద్యోగంలో చేరడం వంటివి కూడా మీకు సహాయపడగలవు.

దీనితోపాటు, మీ మనస్సు మరియు శరీరానికి విశ్రాంతిని అందించే క్రమంలో కొన్ని గంటల శాంతియుత నిద్ర కూడా అవసరమని మరువకండి. మీ శిశువు కోసం రాత్రిమధ్యలో నిద్రలేచి పర్యవేక్షించడం సబబే, కానీ ఆ పని మీ భాగస్వామికి కూడా అప్పగించండి. భాద్యతలు పంచుకుంటేనే అది కుటుంబం అవుతుందని గుర్తుంచుకోండి.

పైనచెప్పిన ఈ అంశాలన్నీ, ఆరోగ్యకరమైన మరియు సంతోషకరమైన జీవితాన్ని గడపడానికి మీరు తీసుకోదగిన ప్రాథమిక మార్పులలో కొన్ని మాత్రమే. తల్లిగా జీవన గమనం ప్రారంభించాక, అనేకరకాల ఒడిదుడుకులు ఎదురవడం సహజంగానే ఉంటుంది. కానీ తల్లులు ఎప్పటికీ, అన్ని సమస్యలను సంతులనపరచగల సూపర్ వుమన్స్ వలెనే ఉంటారు. వారి జాగ్రత్త కూడా మన భాద్యత అని మరువకండి.

English summary

These 3 Habits Aid Mothers In Living Happier and Longer

A mother is always busy working for her children and her family. In between, she often misses out to take care of her own self. But yes, you need to make sure that she has a healthy and happier life. There are 3 simple things she needs to follow: having a nutritious diet, exercise and keep her mind cool.
Desktop Bottom Promotion