For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హెచ్ఐవి చికిత్స కొరకు HAART థెరఫీ (HAART- హైలీ యాక్టివ్ యాంటిరిట్రోవైరల్ థెరఫీ)

|

1981 లో హెచ్ఐవి (హ్యూమన్ ఇమ్యునో డెఫిషియన్సీ సిండ్రోం) ని కనుగొన్న తర్వాత, కాలానుగుణంగా అనుసరించబడిన అనేక రకాల డ్రగ్స్ థెరపీలలో భాగంగా 'వన్ డ్రగ్ థెరపీ'ని ప్రధానంగా ఈ హెచ్ఐవి చికిత్సలో ఉపయోగించబడేది. తొలినాళ్లలో అత్యంత సాధారణంగా వినియోగించిన మందులలో కొంతమేర సత్ఫలితాలతో AZT డ్రగ్ ప్రధానంగా వినియోగించబడేది. కానీ ఇటువంటి 'మోనోథెరపీలు' అంతిమంగా ఎయిడ్స్ కారక వైరస్లను పూర్తి స్థాయిలో పెరగకుండా చేయడంలో అంత సమర్ధవంతంగా లేవని కనుగొనడం జరిగింది.

హెచ్ఐవి వైరస్లో ఇటువంటి "వన్ డ్రగ్ చికిత్సల" కు నిరోధకతను త్వరగా సృష్టించుకునే సామర్థ్యాన్ని కలిగి ఉన్న కారణంగా, ఈ మోనోథెరపీలు వైఫల్యం చెందాయని చెప్పవచ్చు. క్రమంగా తర్వాతి కాలాలలో హెచ్ఐవి వైరస్, ఇటువంటి "వన్ డ్రగ్ ఔషధాలకు" ప్రతిస్పందించడాన్ని కూడా ఆపివేసింది.

ఆ తర్వాత, 1995లో "కాంబినేషన్ డ్రగ్ ట్రీట్మెంట్" కనిపెట్టడం జరిగింది. దీన్నే ప్రాధమికంగా 'ఎయిడ్స్ కాక్టెయిల్' అని పిలిచేవారు. ఈ థెరపీ కాలక్రమేణా "హైలీ యాక్టివ్ యాంటీ రెట్రో వైరల్ థెరపీ (హార్ట్)" గా పిలువబడుతుంది. దీనిని కొన్ని సందర్భాలలో "కాంబినేషన్ యాంటీ రెట్రో వైరల్ థెరపీ (cART)" అని కానీ, లేదా కేవలం "యాంటీ రెట్రో వైరల్ థెరపీ" (ART) అని పిలవడం జరుగుతుంటుంది.

ఈ చికిత్స హెచ్ఐవీ భాధితులకు ఒక వరంలా మారింది. ఇది, హెచ్ఐవీ వైరస్ల పరిమాణాన్ని తగ్గించడంతో పాటుగా, అనేక అధ్యయనాలలో CD4 (తెల్ల రక్త కణాలు) కణాల కౌంట్ పెరుగుదలను చూపించడం జరిగింది. HIV నాశనం చేసే రోగ నిరోధక కణాలుగా ఈ తెల్ల రక్తకణాలు పనిచేస్తాయి

జీవితాన్నే మార్చగల హెచ్ఐవి చికిత్స రకమైన, "హార్ట్" గురించిన మరిన్ని వివరాల కోసం వ్యాసంలో ముందుకు సాగండి.

గమనిక : హెచ్ఐవి వైరస్ కారకంగా ఎయిడ్స్ వస్తుంది కానీ, హెచ్ఐవి సోకిన ప్రతి ఒక్కరూ ఎయిడ్స్ బాధితులు కారు. హెచ్ఐవి కారణంగా రోగ నిరోధక శక్తి పూర్తిగా తగ్గిన పక్షంలో అది ఎయిడ్స్ (అక్వైర్డ్ ఇమ్యునో డెఫిషియన్సీ సిండ్రోం) గా మారుతుంది. ప్రారంభ దశలోనే గుర్తిస్తే, అది ఎయిడ్స్ వలె రూపాంతరం చెందకుండా జాగ్రత్త పడవచ్చునని వైద్యులు చెప్తున్నారు. ఎయిడ్స్ అనేది హెచ్ఐవి చివరి దశగా ఉంటుందని గుర్తుంచుకోండి.

అసలు ఏమిటీ హార్ట్ :

హార్ట్ అనగా 'హైలీ యాక్టివ్ (అత్యంత చురుకైన) యాంటీ రెట్రో వైరల్ డ్రగ్ థెరపీ' కు సంక్షిప్త నామంగా ఉంటుంది. ఇది 1990 వ దశకం చివరి నుండి HIV చికిత్సలో ఉపయోగించబడుతున్న కాంబినేషన్ డ్రగ్ థెరపీ (కొన్ని రకాల ఔషధాల కలయిక) గా ఉంది.

1996లో, ప్రోటీస్ ఇన్హిబిటర్లను ప్రవేశ పెట్టడం ద్వారా, వైద్యులు మూడు లేదా అంతకన్నా ఎక్కువ డ్రగ్ ఏజెంట్లను కలిపి, హెచ్ఐవి జీవిత చక్రంలోని భిన్న దశలను ప్రతిఘటించేలా, క్రమంగా వైరస్ విస్తరణను తగ్గించగలిగేలా చేయగలిగారు. అంతేకాకుండా హెచ్ఐవిని పూర్తిగా నిలిపివేయడంలో కూడా ఆస్కారం ఉన్నట్లుగా చెబుతున్నారు. ఈ "హార్ట్" చికిత్సా వినియోగం ద్వారా, ఎయిడ్స్ ఆధారిత మరణాల సంఖ్యలో అత్యధికంగా 50 శాతం తగ్గుదలను పరిశీలించినట్లు అధ్యయనాలు సైతం తెలుపుతున్నాయి.

నిజానికి ఈ హార్ట్ ను' ట్రిపుల్ థెరపీ ' మరియు ' ట్రిపుల్ డ్రగ్ కాక్టెయిల్ ' అని కూడా పిలవడం జరుగుతుంటుంది. రోగి శరీరంలోని వైరల్ లోడ్ (రక్తంలోని వైరస్ల మొత్తం), CD4+ కణ గణన, వైరస్ యొక్క ప్రత్యేకమైన జాతి, మొదలైన కారకాలను పరిగణనలోకి తీసుకుని విభిన్న ఔషదాల కలయిక వైద్యుల చేత నిర్దేశించబడుతుంది. అయితే, ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. "హార్ట్" హెచ్ఐవి ని శరీరం నుండి పూర్తి స్థాయిలో తొలగించలేకపోయినా కూడా, ఆ వ్యక్తి జీవిత కాలాన్ని పెంచడంలో ఎంతగానో సహకరిస్తుంది. కొన్ని ప్రత్యేకించిన సందర్భాలలో, ఎయిడ్స్ కారక వైరస్లను పూర్తి స్థాయిలో కూడా తొలగిపోవడం గమనించడం జరిగిందని పరిశోధకులు చెప్తున్నారు.

"హార్ట్" ప్రాథమికంగా వైరల్ లోడ్ మరియు వైరస్ ప్రభావాన్ని ఆలస్యం చేయడం / అడ్డుకోవడం ద్వారా నిరోధించగలుగుతుంది. క్రమంగా ఎయిడ్స్ చికిత్సలో సహాయ సహకారాలను అందివ్వగలుగుతుంది. క్రమంగా హెచ్ఐవీ సోకిన వ్యక్తుల మనుగడను పొడిగించగలుగుతుంది..

ఒకప్పుడు అత్యంత ప్రాణాంతకమైన రుగ్మతగా ఉన్న ఈ హెచ్ఐవి సమస్యను, "హార్ట్" చికిత్స ద్వారా సమర్ధవంతంగా ఎదుర్కోగలుగుతున్నామని వైద్యులు చెబుతున్నారు అంతేకాకుండా గణనీయ ఫలితాలను సాధించగలిగామని కూడా చెప్తున్నారు.

అసలు హెచ్ఐవి ఏవిధంగా కనుగొనబడుతుంది?

అసలు హెచ్ఐవి ఏవిధంగా కనుగొనబడుతుంది?

ఒక వ్యక్తి హెచ్ఐవి సమస్యకి గురైనప్పుడు, ఆ వైరస్లను ఎదుర్కొనే క్రమంలో భాగంగా, రోగ నిరోధక వ్యవస్థ ప్రతిరక్షకాలను (ప్రధానంగా ప్రోటీన్) ఉత్పత్తి చేయడం ప్రారంభిస్తుంది. హెచ్ఐవి నిర్ధారించడానికి నిర్వహించే పరీక్షలు, ప్రధానంగా శరీరంలో ప్రతిరక్షకాల ఉనికిని గుర్తించేవిగా ఉంటాయి. వైరస్ బారిన పడిన తరువాత, సుమారు 6 నుండి 8 వారాల స్వల్ప కాల వ్యవధిలో నిర్వహించే పరీక్షల ఆధారంగా, శరీరంలోని రోగ నిరోధక శక్తి స్థాయిలను గుర్తించడం జరుగుతుంది. క్రమంగా వైరస్ను ఖచ్చితంగా నిర్ధారించడానికి వీలవుతుంది.

అనేక సరికొత్త పరీక్షా విధానాలు, కేవలం 2 వారాలలోనే గుర్తించడం సాధ్యపడుతుందని చెబుతున్నప్పటికీ, ఈ వెయిటింగ్ పీరియడ్ (వైరస్ నిర్ధారణకు ముందు సమయం) హెచ్ఐవి పెరుగుదలలో ప్రభావాన్ని పెంచడంలో అత్యంత క్లిష్టమైన మరియు ప్రమాదకరమైన సమయంగా నమ్మబడుతుంది.

హెచ్ఐవి నెగటివ్ వస్తే ఎటువంటి సమస్యా లేదు కానీ, పాజిటివ్ నమోదయితే, నిర్ధారణల సమయం కారణంగా ఎటువంటి చికిత్సలు తీసుకోని కారణంగా, వైరస్ పెరిగే ప్రమాదముంటుందని వైద్యులు చెప్తుంటారు. ఒక్కోసారి వ్యాధి లేదు అని తప్పుడు నివేదికలు వస్తుంటాయి, ఇవి కూడా చికిత్సా జాప్యానికి కారణంగా మారుతాయి. కావున ఇటువంటి పరిస్థితులలో ఒకటికి రెండు చోట్ల పరీక్షలు చేయించుకోవడం ఉత్తమంగా సూచించబడుతుంది. పైగా ప్రభుత్వం వారు, ప్రభుత్వ ఆసుపత్రులలో ఉచిత హెచ్ఐవి నిర్ధారణ చేపడుతున్నారు కూడా.

ఒక్కోసారి వైరస్ పీడిత వ్యక్తి జీవన శైలిలోని అసురక్షిత చర్యల కారణంగా వైరస్ అత్యంత వేగంగా వ్యాప్తి చెందే అవకాశాలు కూడా లేకపోలేదు. సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సి.డి.సి) ప్రకారం, 13 నుండి 64 సంవత్సరాల వయస్సు మధ్యలో ఉన్న ఎవరైనా, రొటీన్ వైద్య పరీక్షలలో భాగంగా హెచ్ఐవి పరీక్షను కూడా నమోదు చేయాలని సిఫార్సు చేసింది. క్రమంగా అనేక ఆసుపత్రులు, రక్త పరీక్షలలో భాగంగా హెచ్ఐవి పరీక్షలను సైతం సూచిస్తున్నారు.

ఈ

ఈ "హార్ట్" ఎలా పనిచేస్తుంది :

వన్ డ్రగ్ థెరపీలు, లేదా డ్రగ్ - డ్రగ్ థెరపీల వలె కాకుండా, మూడు లేదా అంతకన్నా ఎక్కువగా యాంటీ రెట్రో వైరల్ డ్రగ్స్ (హార్ట్ చికిత్స మాదిరి) డ్రగ్స్ సమ్మిళితాన్ని ఈ చికిత్సలో వాడబడుతుంది. క్రమంగా హెచ్ఐవి యొక్క విస్త్రృత శ్రేణి వైరస్లను సమర్థవంతంగా నిరోధించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని చెప్పబడింది. మూడు లేదా అంతన్నా ఎక్కువ ఔషధాలు కలిపి ఉన్నప్పుడు, ఒక ఔషధం, ఒక నిర్ధిష్ట రకానికి చెందిన వైరస్లను అణిచివేయలేకపోయినా కూడా ఇతర డ్రగ్ ఏజెంట్లలో ఏదోఒకటి ఆ వైరస్ల అణిచివేతలో సహాయపడగలదు. క్రమంగా వైరస్లు గుర్తించలేనంత తక్కువగా ఉన్నప్పుడు, రక్త ప్రవాహంలో కొన్ని వైరస్లు మాత్రమే సంచరిస్తుంటాయి. అందువలన, అవి రోగ నిరోధక శక్తితో తలపడడం కూడా తక్కువగా ఉంటుంది.

"హార్ట్" చికిత్సలోని ఈ విధానం, ప్రీ హార్ట్ థెరపీల వలె కాకుండా, విజయావకాశాలను పెంచింది. క్రమంగా "హార్ట్" విధానానికి ముందు ఉన్న చికిత్సలన్నీ విఫలమయ్యాయి. ఎందుకంటే దీనిలో వాడిన ఔషధాలు కూడా తగ్గు స్థాయిలో ఉన్న కారణంగా, వైరస్లను పూర్తి స్థాయిలో అణిచివేయడం కష్టంగా ఉండేది. క్రమంగా ఈ డ్రగ్స్ ఆపివేసిన అతి కొద్దికాలంలోనే, గణనీయంగా వైరస్ పెరగడం గమనించడం జరిగింది. దీనిని డ్రగ్ రెసిస్టెంట్ అని వ్యవహరించడం జరుగుతుంది. క్రమంగా ఇవి హెచ్ఐవిని అరికట్టడంలో సమర్ధవంతమైన ప్రయోజనాలను అందివ్వలేకపోతున్నాయని గ్రహించి, "హార్ట్" చికిత్సా విధానానికి అలవాటు పడడం జరిగింది.

"హార్ట్" చికిత్సలో ఉపయోగించబడే మందులు :

ప్రస్తుతం ఐదు తరగతులలో యాంటీ రెట్రో వైరల్ డ్రగ్స్ మందులను విభజించడం జరిగింది. ప్రతి ఔషధం హెచ్ఐవి జీవిత చక్రంలోని నిర్ధిష్ట దశలలోని వైరస్లను అణిచివేయడానికి బాధ్యత వహిస్తుంది.

ఈ ఐదు తరగతులు దిగువ పేర్కొన్నవిధంగా వున్నాయి :

1) ఎంట్రీ లేదా ఫ్యూషన్ ఇన్హిబిటర్లు (CCR5 గ్రాహక ప్రతిరక్షకాలను కలిగి ఉంటాయి) :

• CD4 (తెల్ల రక్త కణాలు) కణాల్లోకి వైరస్ ప్రవేశించకుండా నిరోధించడానికి ఈ ఇన్హిబిటర్లు రూపొందించడం జరిగింది.

2) న్యూక్లియోసైడ్ మరియు న్యూక్లియోటైడ్ రివర్స్ ట్రాన్స్కిప్టేస్ ఇన్హిబిటర్లు (NRTI/NtRTI):

• హెచ్ఐవి ప్రతిక్షేపణం కొరకు నిర్దేశించబడింది. దీనికి రివర్స్ ట్రాన్స్ స్క్రిప్టేస్ (RT) అనే ఎంజైమ్ అవసరం అవుతుంది. ఈ NRTi, వైరస్ల ఎదుగుదలను అరికట్టడంలో సహాయపడేలా తప్పుడు రివర్స్ ట్రాన్స్ స్క్రిప్టేస్ వర్షన్లను వైరస్లకు అందించడం ద్వారా హెచ్ఐవి వైరస్ను నిరోధించగలుగుతుంది

3) నాన్ న్యూక్లియోసైడ్ రివర్స్ ట్రాన్స్క్రిప్టేస్ ఇన్హిబిటర్ (NNRTI) :

హెచ్ఐవి పెరుగుదలకు దోహదపడే, కీలక ప్రోటీన్ నిలిపివేయడంలో ఇది ఎంతగానో సహాయం చేస్తుంది.

4) ఇంటిగ్రేస్ ఇన్హిబిటర్స్ (INSTI) :

• హెచ్ఐవి CD4 కణాల్లోకి ప్రవేశి౦చినప్పుడు అది కణాలలోని జన్యు పదార్థాలలోకి చొచ్చుకునిపోవడం ప్రారంభిస్తుంది. ఇంటిగ్రేస్ అనే ప్రోటీన్ అందించే సహాయం వలన ఈ చేరిక సాధ్యపడుతుంది. ఈదశను పూర్తి చేసే వైరస్ల సామర్థ్యాన్ని నిరోధించేందుకు ఇంటిగ్రేస్ ఇన్హిబిటర్స్ రూపొందించబడ్డాయి.

5) ప్రోటీస్ ఇన్హిబిటర్ (PI) :

• ప్రోటీస్ అనే ప్రోటీన్ (HIV ప్రతిరూపకానికి అవసరమైన కీలకమైన పదార్ధం), ఈ ఇన్హిబిటర్ ద్వారా తొలగించబడుతుంది.

ఇతర తరగతుల యాంటీ రెట్రో వైరల్స్ కోసం ఇంకనూ పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి. క్రమంగా ఈ సరికొత్త జనరేషన్ డ్రగ్స్, రోగ నిరోధక శక్తిని మెరుగుపరచడం కోసం మాత్రమే కాకుండా, థెరపీలో ఉన్న వారికి సాదాసీదా మోతాదులను అందిస్తూ, సమర్ధవంతంగా ప్రతికూల ప్రభావాలను తగ్గించే లక్ష్యంతో అభివృద్ధి చేయబడుతున్నాయి.

సిఫార్సు చేయబడిన హెచ్ఐవి చికిత్స ప్రోటోకాల్ :

సిఫార్సు చేయబడిన హెచ్ఐవి చికిత్స ప్రోటోకాల్ :

నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సూచించిన ప్రకారం, ప్రాథమికంగా హెచ్ఐవి ఔషధం కొరకు ప్రస్తుతం సిఫారసు చేయబడ్డ మోతాదు రెండు లేదా అంతకన్నా ఎక్కువ భిన్న తరగతుల నుంచి మూడు ఔషధాలను కలిగి ఉంటుంది. ఇది సాధారణంగా దిగువ పేర్కొన్న విధంగా ఉంటుంది

• రెండు NRTIs లతో పాటుగా, ఒక INSTI, ఒక NNRTI లేదా PI ఇవ్వబడుతుంది.

• కోబిసిస్టాట్ లేదా రిటోనవిర్లను బూస్టర్లుగా వాడడం జరుగుతుంది.

వైద్యుల విధి :

వైద్యుల విధి :

ఒకసారి చికిత్స ప్రారంభించిన తర్వాత, రోగిని పూర్తిగా పరీక్షించి, జరుగుతున్న ప్రతిచర్యలను అంచనా వేస్తూ, సక్సెస్ రేట్ చెక్ చేస్తూ ఉండటం డాక్టర్ ప్రధాన బాధ్యతగా ఉంటుంది. ఒకవేళ చికిత్స పనిచేయని పక్షంలో, రోగి అలర్జీలు ప్రతిచర్యలు/దుష్ప్రభావాలు చూపించడం ప్రారంభించినా, ఆ ఔషధాలలో స్వల్ప మార్పులను చేయవలసి ఉంటుంది.

హెచ్ఐవి బారిన పడిన ప్రజలందరికీ యాంటీరెట్రోవైరల్ డ్రగ్స్ ట్రీట్మెంట్ సిఫారసు చేయబడుతోంది. అయితే, కొన్ని ప్రత్యేకించిన సందర్భాల్లో చికిత్స ఎమర్జెన్సీ ఎక్కువగా ఉంటుంది.

అటువంటి పరిస్థితులు ప్రధానంగా :

అటువంటి పరిస్థితులు ప్రధానంగా :

• గర్భవతిగా ఉన్నప్పుడు

• వ్యక్తికి గతంలో హెచ్ఐవి సంబంధిత డిమెన్షియా లేదా క్యాన్సర్ (నరాల నొప్పి లేదా ఇన్ఫెక్షన్స్ వంటి ఇతర HIV సంబంధిత సమస్యలతో సహా) కలిగి ఉండడం.

• వ్యక్తి తెల్ల రక్తకణాలు (CD4+ కణాలు) 200 కణాలు/mm3 లోపున కలిగి ఉన్నారు

• వ్యక్తికి హెపటైటిస్ - బి లేదా హెపటైటిస్ - సి వ్యాధుల సమస్య ఉన్న ఎడల.

యాంటీ రెట్రో వైరల్ ట్రీట్మెంట్ జీవితకాలం కొనసాగించడం కారణంగా, వైరల్ లోడ్ తగ్గడానికి మాత్రమే కాకుండా, సాధారణ CD4+ కౌంట్ ఉండేలా సహకరిస్తుంది, తద్వారా హెచ్ఐవికి గురైన వ్యక్తి మనుగడ అధిక కాలం సాగించేలా సహాయం చేస్తుంది.

భవిష్యత్తులో

భవిష్యత్తులో "హార్ట్" చికిత్సలో రాబోవు మార్పులు :

హెచ్ఐవి సోకిన వ్యక్తులకు కేవలం తగ్గుదల కోసం మాత్రమే కాకుండా, అధిక సంఖ్యలో తిరిగి సంక్రమించకుండా ఈ "హార్ట్" ఉపయోగకరంగా ఉండడం కనుగొనడం జరిగింది. ఈ వ్యూహాన్ని 'ట్రీట్మెంట్ యాస్ ప్రివెన్షన్ (TasP)' గా పేర్కొంటారు. అంతేకాకుండా, ఒక సమూహంలో 'కమ్యూనిటీ వైరల్ లోడ్' తగ్గించడంలో ఈవ్యూహం అత్యంత ప్రభావవంతంగా ఉందని అధ్యయనాలు తెలుపుతున్నాయి. వ్యాధి సోకిన వ్యక్తి నుండి మరొక వ్యక్తికి వైరస్ సోకకుండా ఇది సహాయపడుతుందని కూడా కనుగొనడం జరిగింది. క్రమంగా, హెచ్ఐవి వైరస్ స్థాయిని తగ్గించడం మాత్రమే కాకుండా, గుండె వ్యాధులు మరియు క్యాన్సర్ వంటి హెచ్ఐవి సంబంధితం కాని అస్వస్థతలలో కూడా "హార్ట్" యొక్క సమర్థతను తెలుసుకోవడానికి పరిశోధనలు విస్తృతంగా నిర్వహించబడుతున్నాయి. భౌగోళిక ప్రాంతాలు, జాతులు, ఆర్ధిక పరమైన అంశాలతో సంబంధం లేకుండా హెచ్ఐవి ఉన్న వ్యక్తులందరికీ "హార్ట్" చికిత్సను తక్కువ ధరలలోనే ప్రారంభించేలా చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తుంది.

దీర్ఘకాలిక యాంటీ రెట్రో వైరల్ డ్రగ్ ఏజెంట్లు (నెలవారీ లేదా త్రైమాసిక ఇంజెక్షన్ల ద్వారా సులభతరం చేసేలా) మరియు తరువాతి తరం మందుల పరిచయంతో "హార్ట్" మరింతగా సవరించబడింది.

కొత్తగా అభివృద్ధి చెందిన ఈ డ్రగ్స్ యొక్క ప్రధాన లక్ష్యం, ట్రిపుల్ డ్రగ్ కాక్టెయిల్ డోసు తగ్గించి తక్కువ మందులు ఉండేలా చేయడం. (బహుశా కేవలం రెండు డ్రగ్స్ మాత్రమే ఉండేలా ప్రామాణికాలు చేయవచ్చు). క్రమంగా తక్కువ డ్రగ్స్ ఉపయోగిస్తూ, ఎటువంటి దుష్ప్రభావాలు తలెత్తకుండా సమర్ధవంతంగా హెచ్ఐవి ఎదుర్కునేలా దోహదపడుతాయి.

వీటన్నిటితో పాటు, కుటుంబ సభ్యుల మరియు సన్నిహితుల సహకారం ఎక్కువ అవసరంగా ఉంటుంది. నిజానికి, ఇంకనూ హెచ్ఐవి బాధితుల పట్ల ఒకింత వివక్ష కనపడుతూనే ఉంది. కానీ మందులను అనుసరిస్తూ, నిర్దిష్టమైన జీవన శైలి మరియు ఆహార ప్రామాణికాలను అనుసరిస్తున్న ఎడల ఎటువంటి సమస్యలు లేకుండా జీవితాన్ని ఉన్నత స్థాయిలో కొనసాగగించవచ్చునని అందరికీ తెలియాల్సిన అవసరం ఉంది. పుట్టుకతోనే హెచ్ఐవి ఉన్నా కూడా, మందుల సహాయంతో జీవితాన్ని గెలిచిన అనేకమంది జీవితాలు ఉదాహరణలుగా, మార్గదర్శకాలుగా ఉన్నాయి కూడా. సరైన తోడ్పాటు, మానసిక స్థైర్యం ఇవ్వగలిగితే, హెచ్ఐవి అనేది ఒక జబ్బు కిందకు కూడా రాదు అని గ్రహించాల్సిన అవసరం ఉంది.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర ఆరోగ్య, జీవనశైలి, ఆహార, మాతృ శిశు సంబంధ, వ్యాయామ, లైంగిక, ఫాషన్, ఆద్యాత్మిక, జ్యోతిష్య, హస్త సాముద్రిక, తదితర విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి

Read more about: hiv aids
English summary

HAART (Highly Active Antiretroviral Therapy) For Treating HIV

Failure of monotherapies led to the discovery of HAART to treat people infected with HIV. HAART gave way to a sense of renewed hope for an increased survival rate for people living with HIV. Studies have shown an increase in the count of CD4 cells (immune cells that HIV destroys) in people who have undergone this Combi