తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది?

ఈ రోజుల్లో రక్తసంబంధాల కంటే డబ్బులకే విలువెక్కువైంది. ఒకే కంచంలో తిని, ఒకే మంచంపై నిద్రించిన తోబుట్టువుల మధ్య ఆప్యాయతలను ఆస్తి తగాదాలు బలితీసుకుంటున్నాయి. అన్నాచెల్లెళ్లు లేదా అక్కాతమ్ముళ్ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితికి ప్రధాన కారణం ఆస్తుల పంపకమే.

ముఖ్యంగా తల్లిదండ్రులు బ్రతికి ఉన్నప్పుడే ఆస్తి పంపకాలు పూర్తి చేయకపోతే, వారి మరణానంతరం ఆ ఇల్లు కురుక్షేత్రంగా మారుతుంది. సమాజంలో చాలామంది తల్లిదండ్రులు తమ ఆస్తినంతా కొడుకులకే కట్టబెట్టాలని చూస్తుంటారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఆడబిడ్డలకు న్యాయపరమైన హక్కులు ఉంటాయా? ఆస్తి రకాన్ని బట్టి చట్టం ఏం చెబుతుందో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి.

Daughters Property Rights What the Law Says About Ancestral vs Self Acquired Property

తల్లిదండ్రుల స్వార్జితం - ఆడబిడ్డల హక్కులు

తల్లిదండ్రులు తమ సొంత కష్టార్జితంతో కొనుగోలు చేసిన ఆస్తిని (స్వార్జితం) ఎవరికైనా ఇచ్చుకునే పూర్తి స్వేచ్ఛ వారికి ఉంటుంది. వారు తమ ఆస్తిని రిజిస్టర్డ్ దానపత్రం (Gift Deed) ద్వారా గానీ, వీలునామా ద్వారా గానీ కొడుకు పేరు మీద రాస్తే, దానిపై కూతురు నేరుగా హక్కు కోరడానికి చట్టం అంగీకరించదు.

అయితే ఇక్కడే ఒక కీలకమైన మినహాయింపు ఉంది. ఒకవేళ ఆ వీలునామాను కొడుకు మోసంతోనో, భయపెట్టి బలవంతంగానో రాయించుకున్నా.. లేదా తల్లిదండ్రులు మానసిక స్థితి సరిగా లేని సమయంలో వారి సంతకాలు తీసుకున్నా.. కూతురు ఆ వీలునామాను న్యాయస్థానంలో సవాలు చేయవచ్చు.

మరోవైపు, తల్లిదండ్రులు ఎలాంటి వీలునామా రాయకుండానే కన్నుమూస్తే, హిందూ వారసత్వ చట్టం ప్రకారం ఆ స్వార్జిత ఆస్తిలో కొడుకుతో పాటు కూతురు (పెళ్లయినా, కాకపోయినా) ప్రథమ శ్రేణి వారసురాలిగా సమాన వాటాను పొందుతుంది.

దక్షిణ భారతదేశంలో అతిపెద్ద జిల్లా ఏదో తెలుసా?.. 90% మంది తప్పుగానే చెప్తారు!దక్షిణ భారతదేశంలో అతిపెద్ద జిల్లా ఏదో తెలుసా?.. 90% మంది తప్పుగానే చెప్తారు!

పూర్వీకుల ఆస్తిలో సమాన హక్కు

వంశపారంపర్యంగా వస్తున్న ఆస్తి (పిత్రార్జితం) విషయంలో ఆడబిడ్డలకు చట్టం కొండంత అండగా నిలుస్తోంది. 2005 హిందూ వారసత్వ (సవరణ) చట్టం ప్రకారం, తాత ముత్తాతల నుంచి వచ్చే ఆస్తిలో కొడుకులతో పాటు కూతుళ్లకు కూడా పుట్టుకతోనే సమాన హక్కు ఉంటుంది.

కూతురికి పెళ్లైపోయి, అత్తింటికి వెళ్లినంత మాత్రాన ఆమె చట్టబద్ధమైన హక్కులు ఏమాత్రం కాలరాయబడవు. వంశపారంపర్య ఆస్తిని తల్లిదండ్రులు తమ ఇష్టానుసారం ఆడబిడ్డలకు కాదని, కేవలం కొడుకు పేరు మీద మాత్రమే బదిలీ చేయడానికి వీల్లేదు. అలా చేస్తే చట్టం ముందు అది చెల్లదు.

అన్యాయం జరిగితే న్యాయస్థానమే శరణ్యం

చాలామంది ఆడపిల్లలు ఆస్తి విషయంలో తమకు అన్యాయం జరిగినా మౌనంగా ఉండిపోతారు. అన్నదమ్ములతో ఎందుకు గొడవలు అని రాజీ పడిపోతారు. ఆస్తి మొత్తం అన్న లేదా తమ్ముడి పేరు మీద రిజిస్ట్రేషన్ అయిపోయినంత మాత్రాన కథ ముగిసిపోయినట్లు కాదు. ఆడబిడ్డలకు ఆస్తి దక్కకుండా చట్టవిరుద్ధంగా లేదా మోసపూరితంగా రిజిస్ట్రేషన్లు జరిగినా సరే, వారు ఏమాత్రం అధైర్యపడకూడదు. తమకు రావాల్సిన న్యాయమైన వాటా కోసం ధైర్యంగా కోర్టును ఆశ్రయించి, న్యాయపోరాటం ద్వారా తమ హక్కులను సొంతం చేసుకోవచ్చు.

Story first published: Friday, September 4, 2026, 15:10 [IST]
Desktop Bottom Promotion