2వ తరగతి హిందూ విద్యార్థికి 'కల్మా' హోంవర్క్..హైదరాబాద్ లో ముస్లిం టీచర్ చేసిన పనికి..

స్కూల్స్ అంటే కులమతాలకు అతీతంగా విద్యాబుద్ధులు నేర్పించే పవిత్ర దేవాలయాలు. అక్కడ విద్యార్థులందరినీ సమాన దృష్టితో చూడాల్సిన బాధ్యత టీచర్స్ పై ఉంటుంది. కానీ తాజాగా హైదరాబాద్ సైదాబాద్ ఏరియాలోని ఒక స్కూల్ లో జరిగిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. హిందూ విద్యార్థికి కల్మా హోంవర్క్ గా ఇవ్వడంపై వివాదం చెలరేగింది. అయితే అటు పాఠశాల యాజమాన్యం, ఇటు పోలీసులు సకాలంలో స్పందించడంతో వివాదం సద్దుమణిగింది.

Learn Kalma for Homework Hyderabad School Sacks Muslim Teacher Over Religious Assignment

అసలేం జరిగింది

సైదాబాద్ ఏరియాలోని ఒక ప్రైవేట్ స్కూల్ లో పనిచేస్తున్న ఒక మహిళా టీచర్..2వ తరగతిలోని విద్యార్థులందరూ ఇంటి దగ్గర కల్మా (ఇస్లామిక్ ప్రార్థన) చదువుకుని రావాలని హోంవర్క్‌ గా ఇచ్చారు. ఆ క్లాస్ లో మొత్తం 25 మంది విద్యార్థులు ఉన్నారు. వారిలో 24 మంది ముస్లిం విద్యార్థులే ఉన్నప్పటికీ, ఒక హిందూ విద్యార్థి కూడా ఉన్నాడు.

లౌకిక విద్యావిధానం అమలయ్యే మన దేశంలో, విద్యార్థులందరికీ ఒక మతపరమైన ప్రార్థనను చదవమని హోంవర్క్‌ గా ఇవ్వడం విద్యా విధానంతో పాటు ఆ పాఠశాల నియమావళిని కూడా పూర్తిగా ఉల్లంఘించడమే అవుతుంది. సాయంత్రం వేళ ఈ విషయం తెలుసుకున్న ఆ హిందూ విద్యార్థి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. వెంటనే స్కూల్ కి వెళ్లి యాజమాన్యాన్ని నిలదీయడంతో పాటు స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి కంప్లెయింట్ చేశారు.

స్పందించిన స్కూల్ మేనేజ్ మెంట్

తల్లిదండ్రుల కంప్లెయింట్ తో స్కూల్ మేనేజ్ మెంట్ వెంటనే అప్రమత్తమైంది. స్కూల్ ఎండీ స్పందిస్తూ ఒక అధికారిక ప్రకటన విడుదల చేశారు. నిబంధనలను ఉల్లంఘించి, మతపరమైన అంశాలను క్లాస్ రూమ్ లోకి తీసుకువచ్చిన ఆ మహిళా ఉపాధ్యాయురాలిని తక్షణమే ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. యాజమాన్యం తీసుకున్న ఈ కఠిన చర్యతో తల్లిదండ్రులు శాంతించారు. అయితే, ఈ ఘటన గురించి స్థానికంగా వార్తలు వ్యాపించడంతో, కొన్ని స్థానిక సంఘాలు, బృందాలు పాఠశాల ప్రాంగణం సమీపంలో గుమిగూడి నిరసన తెలపడం ప్రారంభించాయి. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

చిన్న వివాదం మతపరమైన ఘర్షణగా మారకుండా నిరోధించేందుకు పోలీసులు వెంటనే ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఎటువంటి హింసాత్మక ఘటనలు జరగకుండా పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చినట్లు డీసీపీ ప్రభాకర్ స్పష్టం చేశారు. నిరసనలు ఉద్రిక్తంగా మారకుండా ఉండేందుకు సుమారు 30 మందికి పైగా వ్యక్తులను ముందుజాగ్రత్త చర్యగా అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా ప్రశాంతంగా ఉందని ఆయన వివరించారు. స్కూల్ మేనేజ్ మెంట్ తీసుకున్న చర్యల పట్ల విద్యార్థి తల్లిదండ్రులు పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారని, యాజమాన్యంపై తమకు ఎలాంటి ఫిర్యాదు లేదని పోలీసులకు వాంగ్మూలం కూడా ఇచ్చారని ఆయన తెలిపారు.

అందుకే, ఈ ఘటనపై పోలీసులు ఎటువంటి అధికారిక ఫిర్యాదును నమోదు చేయలేదని, భవిష్యత్తులో ఏవైనా ఫిర్యాదులు అందితే న్యాయ సలహా తీసుకుని తదుపరి చర్యలు చేపడతామని స్పష్టం చేశారు.ఎవరూ కూడా ఎలాంటి వదంతులను నమ్మవద్దని, మతతత్వాన్ని, హిందూ-ముస్లిం విద్వేషాలను వ్యాప్తి చేయవద్దని డీసీపీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Desktop Bottom Promotion