For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పార్థి గ్యాంగ్‌ నిజమేనా? ఇంతకు ఎవరీ గ్యాంగ్.. ఏం చేస్తుంటారు.. ఇదంతా కుక్కల వ్యాపారం కోసమా?

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో పార్థి గ్యాంగ్‌ సంచరిస్తుందన్న సమాచారంలో ఎంత వరకు నిజముందో తెలియదు. పార్థి గ్యాంగ్, పార్థీ గ్యాంగ్, పార్ధి గ్యాంగ్, దోపీడీలు, పిల్లల్ని ఎత్తుకెళ్లడం, వాట్సాప్ మెసేజ్.

|

పార్థీ గ్యాంగ్‌ అనేది కరడుగట్టిన నేరగాళ్ల ముఠా..! ఇప్పుడీ గ్యాంగ్‌.. అందరినీ హడలెత్తిస్తోంది. చీకటి పడితే చాలు.. ప్రజలు ముఖ్యంగా గ్రామీణులు గజగజ వణికిపోతున్నారు. కొన్ని చోట్ల.. ప్రజలే వంతులవారీగా కర్రలు, వేటకొడవళ్లు.. కారంపొడి చేతబట్టి.. పహారా కాస్తున్నారు.గత కొన్ని రోజులుగా పార్థీ గ్యాంగ్‌ భయం వెంటాడుతోంది. మారణాయుధాలతో సంచరించే ఈ ముఠా.. దొంగతనాలు, అత్యాచారాలు, హత్యల్లో ఆరితేరిన వారని చాలా మంది విశ్వసిస్తున్నారు.

అడ్డొచ్చిన వారిని చంపడం, దొరికిన చోట దోచుకోవడం పార్థి గ్యాంగునకు వెన్నతో పెట్టిన విద్య. పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేసే ఈ గ్యాంగు మరోమారు జనంపై పడేందుకు దిగిపోయిందని తెలుగు రాష్ట్రాల్లో అంతటా ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి.

అలాంటి వారు ఎవరూ లేరు

అలాంటి వారు ఎవరూ లేరు

వారిని పట్టుకోవడానికి సకల యత్నాలు చేసిన పోలీసులు అలాంటి వారు ఎవరూ లేరని కొన్నిచోట్ల స్టేట్ మెంట్స్ కూడా ఇచ్చారు. కానీ జనం మాత్రం భయంతో అల్లాడిపోతున్నారు. ఈ కరడుగట్టిన పార్థి గ్యాంగ్‌ కోసం అంతటా తనిఖీలు జరుగుతూనే ఉన్నాయి.

రాయలసీమ జిల్లాల్లో సంచరిస్తుందని..

రాయలసీమ జిల్లాల్లో సంచరిస్తుందని..

ఉత్తర భారతదేశానికి చెందిన పార్ధిగ్యాంగ్‌ రాయలసీమ జిల్లాల్లో సంచరిస్తున్నట్లు పోలీసులకు సమాచారం రావడంతో చాలా రోజులుగా ప్రత్యేక నిఘా ఉంచారు. ఇప్పటి వరకు కర్ణాటక, మహారాష్ట్ర తదితర ప్రాంతాల్లో దోపిడీలకు పాల్పడిన ఈ గ్యాంగ్‌ తాజాగా రాయలసీమలోని కొన్ని జిల్లాలో సంచరిస్తున్నట్లు అక్కడి పోలీసులకు సమాచారం రావడంతో ఆయా జిల్లాల పోలీసులు ముందస్తు నిఘా ఉంచారు.

పోలీసుల ప్రత్యేక నిఘా

పోలీసుల ప్రత్యేక నిఘా

రాత్రి వేళల్లో నిర్మానుష్యమైన కాలనీల్లో, తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దోపిడీ చేయడం వీరి పార్ఠీ గ్యాంగ్ ప్రత్యేకత.పగటి వేళల్లో వీధుల వెంబడి సంచరించి ఇళ్లను ఎంపిక చేసుకుంటారు. శివారు కాలనీలపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. వీరు పగలు బిచ్చగాళ్లుగా, కూలీలుగా, చిన్న చిన్న వ్యాపారులుగా వీధుల్లో తిరుగుతుంటారట. ఈ గ్యాంగ్‌ సభ్యులు దోపిడీ చేసే సమయంలో ఇంట్లో అడ్డు వచ్చిన వారిని అతి కిరాతకంగా చంపడానికి కూడా వెనుకాడబోరని పోలీసుల కథనం.

జనాల్లో భయం

జనాల్లో భయం

ఈ నేపథ్యంలో రాయలసీమలోని అన్ని ప్రాంతాల్లో శివారు ప్రాంతాల్లో అనుమానితులుగా ఉండే వ్యక్తులను గుర్తించి వారి వేలిముద్రలను, ఆధారాలను కూడా పోలీసులు సేకరిస్తున్నారు. ఇక పార్థి గ్యాంగ్ భయం జనాల్లో ఎలా ఉందనడానికి కొన్ని సంఘటనలు నిదర్శనంగా ఉన్నాయి.

సారూ మా పిల్లలు పదిలమేనా?

సారూ మా పిల్లలు పదిలమేనా?

తాజాగా హుస్నాబాద్‌ ఎల్లం బజార్‌కు చెందిన ఓ మహిళ... కార్డున్‌ సెర్చ్‌ పర్యవేక్షించడానికి వచ్చిన అక్కడి సీపీ జోయల్‌ డేవిస్‌ ఎదుట తన భయం వ్యక్తం చేసింది. సారూ మా పిల్లలు పదిలమేనా?, పార్థి గ్యాగ్‌ తిరుతుందంట నిజమేనా? అని సీపీని అడిగింది. గ్రామాల్లో పిల్లలను ఎత్తుకెళ్లే దొంగలు తిరుగుతున్నారని ప్రచారం జరుగుతోంది నిజమేనా సారు? గుంపుల కొద్ది పోలీసులు వస్తే భయమైతాంది అంటూ ఆందోళన వ్యక్తం చేసింది.

అలాంటి వదంతులు నమ్మవద్దు

అలాంటి వదంతులు నమ్మవద్దు

దీనిపై సీపీ జోయల్‌ డేవీస్‌ స్పందిస్తూ... అదేమి లేదమ్మా అలాంటి వదంతులు నమ్మవద్దని సూచించారు. మీ ఫోన్లలో వాట్సాప్‌కు వచ్చిన ఫొటోలు ఏమైనా ఉన్నాయా అని సదరు మహిళను ప్రశ్నించారు. తమ వద్ద ఫొటోలు లేవని అందరు అనుకుంటున్నారని ఆమె బదులిచ్చింది. హుస్నాబాద్‌ పట్టణంలోని ఎల్లంబజార్‌లో తాజాగా పోలీసులు కార్డూన్‌ సెర్చ్‌ నిర్వహిస్తుండగా ఈ సన్నివేశం చోటు చేసుకుంది.

వాస్తవం లేదు

వాస్తవం లేదు

పిల్లలను ఎత్తుకు పోయేందుకు పార్థి గ్యాంగ్‌ వంటి ముఠాలు, నేరగాళ్లు, దొంగలు తిరుగుతున్నారన్న వార్తల్లో వాస్తవం లేదని సీపీ ఆ మహిళకు భరోసా ఇచ్చారు. సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు. అలాంటి సమాచారం, ఆధారాలు పోలీస్‌ల వద్ద లేవని స్థానిక మహిళలకు ధైర్యం చెప్పారు. ఇలాంటి ప్రచారాలను ప్రజలు నమ్మొద్దని సూచించారు.

జనాలకు కొండంత ధైర్యం ఇస్తున్నారు

జనాలకు కొండంత ధైర్యం ఇస్తున్నారు

ఇలా రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి చోట జనం భయపడుతూ పోలీసులను ఇలాంటి ప్రశ్నలను అడుగుతూనే ఉన్నారు. పోలీసులు జనాలకు కొండంత ధైర్యం ఇస్తున్నారు. మీ రక్షణకు మేము ఉన్నామని, నిరంతరం గస్తీ నిర్వహిస్తున్నామని భరోసానిస్తున్నారు. గ్రామాలు, పట్టణాల్లోని అనుమానిత ప్రదేశాలు, వ్యక్తులపై పోలీసుల నిఘా నిరంతరం ఉంటుందని అన్నిచోట్ల పోలీసులు భరోసానిస్తున్నారు.

కట్టేసి దేహ శుద్ధి చేస్తున్నారు

కట్టేసి దేహ శుద్ధి చేస్తున్నారు

అయితే పార్థీ గ్యాంగ్ సభ్యులు ఉన్నారో లేదో కానీ కొన్ని చోట్ల ప్రజలు ఎవరు గుర్తుతెలియని వ్యక్తులు కనపడినా కట్టేసి దేహ శుద్ధి చేస్తున్నారు. ఎవరు కొత్త వ్యక్తులు గ్రామాల్లో కనిపించినా పార్థీ ముఠా సభ్యులంటూ అనుమానిస్తున్నారు. దొంగలు హల్‌చల్‌ చేస్తున్నారంటూ చాలా ఊళ్లలో వదంతులు షికారు చేస్తున్నాయి.

రాత్రిళ్లు కాపలాగా గస్తీ తిరుగుతున్నారు

రాత్రిళ్లు కాపలాగా గస్తీ తిరుగుతున్నారు

సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ఈ ప్రచారం ఇప్పుడు ప్రజల్లోకి కూడా వెళ్ళింది. దీంతో చాలా గ్రామాల వాసులకు ఇప్పుడు కంటి మీద కునుకు కరువైంది. పలు గ్రామాల్లో నిద్ర మానుకుని రాత్రిళ్లు కాపలాగా గస్తీ తిరుగుతున్నారు. ఈ క్రమంలో అనుమానిత, గుర్తుతెలియని వ్యక్తులను నిర్బంధిస్తున్నారు. వారిపై దాడులకు దిగుతున్నారు.

అయితే వదంతులను నమ్మి అమాయకులపై దాడులు చేయకూడదని పోలీసులు సూచిస్తున్నారు.

కుక్కలు అమ్ముకునేందుకు..

కుక్కలు అమ్ముకునేందుకు..

అయితే కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన శునకాల వ్యాపారి వినోద్ కుమార్ ‌రెడ్డి కుక్కలను అమ్ముకునేందుకు ఏకంగా కరుడుగట్టిన పార్థీ గ్యాంగ్ పేరును వాడుకుని జనాల్లో భయభ్రాంతులు సృష్టించాడని కూడా వార్తలు వస్తున్నాయి. పార్థీ గ్యాంగ్ రాయలసీమలో అడుగుపెట్టిందని, జాగ్రత్తగా ఉండాలని, డబ్బు కోసం ముఠా సభ్యులు ఎంతకైనా తెగిస్తారని, మానప్రాణాలను హరించేందుకు కూడా వెనకాడరంటూ ఓ మెసేజ్ సృష్టించి ప్రజల్లోకి వదిలాడు. ఇంట్లో శునకాలను పెంచుకోవడం ద్వారా నిశ్చింతగా ఉండొచ్చంటూ చివర్లో ట్యాగ్‌లైన్ కూడా తగిలించాడు.

కుక్కల వ్యాపారాన్ని పెంచుకోవడానికే

కుక్కల వ్యాపారాన్ని పెంచుకోవడానికే

వినోద్ కుమార్ సృష్టించిన మెసేజ్ పోలీసుల వరకు చేరడంతో రంగంలోకి దిగారు. ప్రత్యేకంగా గాలింపు చేపట్టి పార్థీ గ్యాంగ్ ముఠా దిగిందన్నది అవాస్తవమని తేల్చేశారు. దీంతో మెసేజ్‌ను సృష్టించిన వినోద్ కుమార్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. తన కుక్కల వ్యాపారాన్ని పెంచుకోవడానికే ఈ మెసేజ్ సృష్టించానని, మరే దురుద్దేశం లేదని విచారణలో పేర్కొన్నాడు.

ఎవరీ పార్థీ గ్యాంగ్

ఎవరీ పార్థీ గ్యాంగ్

మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలోని పాసే పార్థీ తెగకి చెందిన వీరిని పార్థీ గ్యాంగ్ అంటారు. మహారాష్ట్రలోని చత్రీ, పర్బాని, నాసిక్, ఇంజన్‌ఘాట్, గుల్బర్గా, బాంబే, ఔరంగాబాధ్, మధ్యప్రదేశ్, భూపాల్‌ తదితర ప్రాంతాల్లో వీరు నివసిస్తుంటారు. వీరి కుటుంబాల్లో అందరూ దోపిడీలు, దొంగతనాలు చేయడంలో సిద్ధహస్తులు. కుటుంబాలతో ఉపాధి కూలీల్లా ఇతర ప్రాంతాలకు తరలి వెళుతారు. గ్రామ సరిహద్దులు, పట్టణ శివార్లు, ఫ్లై ఓవర్‌ బ్రిడ్జిల కింద, రైల్వేస్టేషన్, బస్‌స్టేషన్‌ల సమీపంలో గుడారాలు వేసుకుని సంచార జీవనం సాగిస్తారు.

యాచకుల్లా జీవనం సాగిస్తారు

యాచకుల్లా జీవనం సాగిస్తారు

మహిళలు పగటి వేళల్లో పరిసర ప్రాంతాల్లో చిత్తుకాగితాలు ఏరుకోవడం, పిన్నీసులు, పూసలు అమ్మడం, యాచకుల్లా జీవనం చేస్తూ తమ పనులకు వీలుగా ఉండే ఇంటిని లక్ష్యంగా ఎంచుకుంటారు. రాత్రి వేళల్లో ఆ ఇంట్లో దొంగతనాలకు పాల్పడుతారు. ఆ సమయంలో వారి కదలికలను ఎవరూ గుర్తుపట్టకుండా ఉండేలా జాగ్రత్త పడుతారు. ఆనవాళ్లు దొరక్కుండా వీరు దొంగతనం చేసే ఇంటికి వెళ్లిన సమయంలో తమ ఆనవాళ్లను ఎవరూ గుర్తు పట్టకుండా ఉండేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటారు.

కిరాతకంగా హత్యలకి తెగపడుతారు

కిరాతకంగా హత్యలకి తెగపడుతారు

ఇక గ్యాంగులోని పురుషులు పగటి వేళలలో కుర్తీ, లుంగీ ధరించి కూలీలు, బిచ్చగాళ్లగా నటిస్తుంటారు. రాత్రివేళల్లో ఒంటికి ఒండ్రుమట్టి, నూనె రాసుకుని చోరీలు, దోపిడీలకి పాల్పడుతుంటారు. ఇళ్ల కిటికీల గ్రిల్స్ తొలగించి గ్యాంగ్ సభ్యులందరూ ఇళ్లలోకి ప్రవేశిస్తారు. ఇళ్లలో వారు ఎదురు తిరిగితే కిరాతకంగా హత్యలకి తెగపడుతారు. చిన్నపిల్లలు, మహిళలు, వృద్ధులు అని కూడా చూడరు. పైశాచికంగా హతమారుస్తారు. బ్లేడులు, కత్తులు, ఇనుప కడ్డీలు, తుపాకుల్ని వినియోగిస్తారు. .

అత్యంత క్రూరంగా ఉంటుంది

అత్యంత క్రూరంగా ఉంటుంది

వీరి వ్యవహారశైలి అత్యంత క్రూరంగా ఉంటుంది. లక్ష్యంగా ఎంచుకొన్న ఇంట్లో భయానక వాతావరణం సృష్టిస్తారు. ఇంట్లో ఉన్న చిన్న, పెద్దా, వృద్ధులు, వికలాంగులు తేడా లేకుండా అందర్ని అతి క్రూరంగా (రాడ్‌లు, కర్రలతో తలపై విచక్షణా రహితంగా కొట్టడం, కత్తులతో గొంతులు కోయడం) మట్టుపెట్టి అందిన కాడికి దోచుకెళుతారు. నేరానికి పాల్పడే సమయంలో ఎవరు అడ్డొచ్చినా వారిని హత మారుస్తారు.

ముంబాయి పోలీసులు కాల్పులు జరిపి

ముంబాయి పోలీసులు కాల్పులు జరిపి

ఇప్పటికీ పార్థి గ్యాంగ్‌లు సుమారు 10 ఉండొచ్చని పోలీసులు అంచనా. ఒక్కో బృందంలో 14 నుంచి 20 మంది సభ్యులు ఉంటారని సమాచారం. 1999వ సంవత్సరం నుంచి మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఆంధ్ర, తెలంగాణ ప్రాంతాలలో పలు దోపిడీలు, చోరీలకి పాల్పడ్డారు. అయితే ఒకే ఒక్కసారి ముంబాయి పోలీసులు కాల్పులు జరిపి కొందర్ని అరెస్ట్ చేయకలిగారు.

నిజమెంతో తెలియదు

నిజమెంతో తెలియదు

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో పార్థి గ్యాంగ్‌ సంచరిస్తుందన్న సమాచారంలో ఎంత వరకు నిజముందో తెలియదు. అయితే పోలీసులు ముందస్తు చర్యల్లో భాగంగా సిబ్బందిని అప్రమత్తం చేశారు. అంతటా తనిఖీలు ముమ్మరం చేశారు. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని. తమ ప్రాంతాల్లో అనుమానాస్పద వ్యక్తులు, కొత్తవారు తారసపడితే వెంటనే డయల్‌ 100కు సమాచారం అందించాలని పోలీసులు తెలుపుతున్నారు.

English summary

fear of parthi gang grips people

fear of parthi gang grips people
Story first published:Tuesday, May 22, 2018, 12:02 [IST]
Desktop Bottom Promotion