పసిపిల్లల కొరకు బేబీ వాకర్ వాడటం సురక్షితమేనా?

Written By: Gayatri Devupalli
Subscribe to Boldsky

జీవితంలో అమూల్యమైన బహుమతులు అయిన మన పిల్లలకు మనకు చేతనైనంతలో ప్రతిదీ ఉత్తమమైనవి ఇవ్వడానికి ప్రయత్నిస్తాం. చాలాసార్లు మన స్నేహితులు మరియు బంధువులు పిల్లల విషయంలో రకరకాల సలహాలు ఇచ్చినప్పటికీ, మన మనసుకు సరైనదిగా తోచినదే మనం చేస్తాం. పిల్లలు, ముఖ్యంగా పసిపిల్లలు తమ భావాలను వ్యక్తీకరించలేరు కనుక తల్లిదండ్రులు వారి బాగోగుల పట్ల అధికంగా ఆందోళన చెందుతారు. చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. వారు వేసుకునే బట్టలు నుండి వారికై ఉపయోగించే బేబీ గేర్ వరకు ప్రతి విషయంలో అత్యంత జాగ్రత్తలు తీసుకుంటారు, ఎందుకంటే అవి సురక్షితమైనవి కాకుంటే విషమ పరిస్థితులు ఎదుర్కోవలసి ఉంటుంది.

పిల్లలను సురక్షితంగా ఉంచడం ప్రతి తల్లి మరియు తండ్రి యొక్క బాధ్యత. ఈ విషయంలో ఎటువంటి రాజీకి ఆస్కారం లేదు. మీ బిడ్డ తన వయసుకు పరిమితమైన మైలురాయిని చెరుకుంటున్నారో లేదో గమనించి అందుకు తగిన తోడ్పాటును అందివ్వాలి. మీ పిల్లలు నడిచే దశకు చేరుకున్నపుడు, వారికి ప్రోత్సాహం అందించడానికి మీరేమి చేస్తారు? చాలా సంవత్సరాలుగా, మీరు తల్లిదండ్రులు పిల్లలకు నడక నేర్పడానికి వాకర్ ను ఉపయోగించడం చూసి ఉంటారు. మీరు కూడా మీ బాల్యంలో వాకర్ నే ఉపయోగించి ఉంటారు. అప్పటికి ఇప్పటికీ మీరు గమనించే తేడా ఏమిటంటే దాని తయారీ, బ్రాండ్ మారి అధునాతన హంగులు సమకూరాయి. ఇన్ని హంగులున్నప్పటికి ప్రస్తుత తల్లిదండ్రుల మెదడులో మెదిలే ప్రశ్న ఏమిటంటే అటువంటి వాకర్ ను వాడటం బిడ్డకు శ్రేయస్కరమేనా? కాదా?

Is it safe to use a baby walker for kids?

బేబీ వాకర్స్ అంటే ఏమిటి?

వాకర్ అనేది పిల్లలకు నడకను నేర్పేందుకు వాడే ఒక రకమైన యంత్రం. దీనికి చక్రాలతో కూడిన ఫ్రేములతో పాటు కూర్చునేందుకు వీలుగా ఒక సీటు అమార్చబడి ఉంటుంది. కొన్ని వాకర్లలో బిడ్డను సరైన స్థితిలో నిలిపి ఉంచి, కాళ్లతో చుట్టుపక్కల నడవడానికి వీలుకల్పించే విధంగా బెల్ట్ ఉంటుంది.

బేబీ వాకర్ వాడటం సురక్షితమేనా?

భద్రతా నిపుణుల సూచనల మేరకైతే కనుక బేబీ వాకర్లను వాడరాదు. ప్రముఖ బేబీ గేర్ సంస్థ వారు తయారు చేసిన వాకర్లు వాడిన పిల్లలలో పలు ఆరోగ్య సమస్యలు మరియు భద్రత విషయంలో ప్రమాదకర అంశాలు ఎదురయ్యాయి. పరిశోధకులు కూడా బేబీ వాకర్ల ఉపయోగాన్ని బలంగా వ్యతిరేకిస్తారు. బేబీ వాకర్లు బిడ్డలు నడవడానికి సంసిద్ధంగా లేనప్పటికీ, వారిని నడవడానికి ఉసిగొల్పే విధంగా ఈడుస్తాయి. (నిజానికి నడిచే తరుణం ఆసన్నమైనప్పుడు వారంతట వారే అడుగులు వేసి మిమ్మల్ని ఆశ్చర్యానికి గురిచేస్తారు).

పిల్లలు తమ వేసే అడుగులపై నియంత్రణ ఉండదు కనుక, వాకర్లో ఉన్నప్పుడు వారు ప్రమాదకరమైన వస్తువుల వైపు పరుగులు పెట్టడానికి ఆస్కారం అధికంగా వుంటుంది. వాకర్లో ఉన్న పిల్లలు వేడి కాఫీని ఒంపుకుని కాలిన గాయాలకు గురవ్వటం లేదా హీటర్లు మరియు ఈత కొలనుల వైపుగా జారుకోవడం వంటి సంఘటనలు గురించి మీరు వినే ఉంటారు. కొన్నిచోట్ల పిల్లలు వాకర్ల వలన మెట్ల మీద నుండి జారిపడి ఎముకలు విరగటమో లేదా బలమైన గాయాలవటమో జరుగుతుంటాయి.

పరిశోధన సమాచారం ప్రకారం, వాకర్లు పిల్లల వృద్ధికి ఏ విధంగా కూడా దోహదపడవు. అది పిల్లల నడక నేర్పడానికి వాడే ఒక ప్రమాదకరమైన వస్తువు. కొన్ని వాకర్లు మాత్రం పిల్లలు తమ చేతులతో పట్టుకునే వీలుండి, కాళ్లతో నెడుతూ ముందుకు కదిలేలా రూపకల్పన చేయబడి ఉంటాయి. వీటిని పిల్లలు తమ కాళ్లపై తాము నిలబడి నడవడానికి సంసిద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే ఉపయోగించగలరు. ఇటువంటి వాకర్ ను వాడటం వలన పిల్లల ఎదుగుదలకు ఎటువంటి ఆటంకం ఉండదు. ఏ రకమైన వాకర్ ను వాడినప్పటికీ పెద్దల పర్యవేక్షణ తప్పనిసరి.

బిడ్డ యొక్క ఎదుగుదల: మీరు మీ పిల్లల శారీరక -మానసిక ఎదుగుదలకై వారిని ఆడుకోవడం మరియు కొత్త విషయాలు నేర్చుకోవడంలో నిమగ్నం చేయాలనుకుంటే, ఒక స్టేషనరీ ప్లే మ్యాట్ లేదా ప్లే సెంటర్ ను ఉపయోగించండి. దీనివలన మీ పిల్లలు ఎల్లప్పుడు ఎదో ఒక పని చేస్తూ ఉంటారు, పైగా సురక్షితంగా ఉంటారు. వీటి వలన పిల్లలు ఒక నిర్దిష్టమైన ప్రదేశంలొనే ఉండి వినోదాన్ని కూడా పొందుతారు.

జన్మనిచ్చినందున మీ పిల్లల రక్షణ బాధ్యత సంపూర్ణంగా మీదే! కనుక మీరు అత్యంత అధునాతనమైనదైనా కానీ వాకర్ ను కొనకపోవడమే ఉత్తమం. బిడ్డ తనకు తానుగా నడవడానికి సమాయత్తం అయినప్పుడు మాత్రమే తన నడక అనే మైలురాయిని చేరనివ్వండి. వారిచేత బేబీ గేర్లను ఉపయోగింపజేసి బలవంతంగా నడిపించకండి. వారు పసిపిల్లలుగా కొంతకాలం మాత్రమే ఉంటారు. ఆ సమయంలో వారంతట వారినే కావలసినంత సమయం తీసుకుని ఎదగనివ్వండి. దీనివలన మీ బిడ్డ ఆనందంగా, ఆరోగ్యంగా ఎదగటమే కాదు ప్రశాంతంగా పెంచుతున్నామన్న భావన మీకూ ఉంటుంది.

English summary

Is it safe to use a baby walker for kids?

As a parent, we always want to gift our kids the best things in their life. As they grow, we want them to stand on their own feet and we get home a baby walker. But have you ever wondered how safe it is to use a walker for kids? According to experts, it's not very safe. With the most blessed gift in our life, we surely want to do the best for our children.