For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గర్భధారణ సమయంలో అల్ట్రాసౌండ్ స్కాన్ ఉపయోగాలు

|

ప్రస్తుత ఆధునిక యుగంలో వైద్య విజ్ఞానం బాగా అభివృద్ధి చెందడంతో గర్భిణీల పాలిట వరంగా అల్ట్రాసౌండ్‌ స్కానింగ్‌ ఆవిర్భవించింది. గర్భిణీలను తప్పనిసరిగా స్కానింగ్‌ చేయించుకోమని వైద్యనిపుణులు ప్రోత్సహిస్తున్నారు. తొలి స్కానింగ్‌ గర్భం ధరించిన మూడు నెలల్లోపే చేయించుకోమంటున్నారు. అసలు ఈ స్కానింగ్‌ అంటే ఏంటి? దీన్ని ఎందుకు ఉపయోగిస్తారు? దానివల్ల ఉపయోగాలేంటి? తెలుసుకుందాం..

అల్ట్రాసౌండ్‌ అంటే అతిధ్వనులు. అంటే చాలా హెచ్చు పౌనఃపున్యం గల ధ్వని తరంగాలు. తరంగాల పౌనఃపున్యాన్ని హెర్ట్‌జ్‌ అనే ప్రమాణాల్లో కొలుస్తారు. 20 హెర్ట్‌జ్‌లు మొదలు 20వేల హెర్ట్‌జ్‌ల పౌనఃపున్యం గల ధ్వని తరంగాలను మానవ చెవి గ్రహించి శబ్దాలు లేదా స్పీచ్‌గా స్వీకరిస్తుంది. 20 వేల హెర్ట్‌జ్‌లను మించిన పౌనఃపున్యం గల ధ్వని తరంగాలను కంపనాల ద్వారా ఒక ప్రవాహిలో పుట్టిస్తారు. ఈ తరంగాలు ప్రవాహి గుండా ఒక అడ్డును ఢీకొన్నప్పుడు అందులో కొన్ని తరంగాలు పరావర్తనం చెంది మరికొన్ని అడ్డుగుండా దూసుకుని వెళ్లిపోతాయి. ఈ తరంగాలను ఉత్పత్తి చేసిన ట్రాన్స్‌డ్యూసర్‌ వెనుతిరిగి వచ్చిన తరంగాలను గ్రహించగల్గుతుంది. ఈ విధంగా అడ్డుగా నిలిచిన వస్తువు ప్రతిబింబాన్ని ఈ పరావర్తన తరంగాలు ఏర్పరుస్తాయి. ఘనరూపంలో వుండే వస్తువుల ప్రతిబింబాలు కాంతివంతంగా కన్పిస్తాయి. తక్కువ సాంద్రత గల వస్తువుల ప్రతిబింబాలు నల్లగా కన్పిస్తాయి. ఈ ప్రతిబింబాలను బట్టి అడ్డుగా వచ్చిన వస్తుసాంద్రతను కూడా తెలుసుకోవచ్చు.

Uses Of An Ultrasound Scan During Pregnancy

స్కానింగ్‌ యంత్రాలు: తొలి రోజుల్లో ఆవిర్భవించిన స్కానింగ్‌ యంత్రాలు శరీర అంతర్భాగాల్లోని చిత్రాలను స్పష్టంగా, వివరంగా తీయగలిగాయి. కానీ ఈ చిత్రాలు చాలా పెద్దవిగా ఉండి, కదల్చడానికి వీలులేనివిగా ఉండేవి. కాలక్రమేణా కొత్త కొత్త స్కానింగ్‌ యంత్రాలు ఆవిర్భవించాయి. ఇప్పుడు వీటి సహాయంతో గర్భిణీ కడుపులోని శిశువు వివరాల్నీ తెలుసుకోగల పరిస్థితి ఉత్పన్నమైంది. గర్భస్థ శిశువు శ్వాస, కదలికలు, గుండె కొట్టుకునే రేటు, రక్తప్రవాహ తీరు వీటన్నింటిని అధ్యయనం చేయడం సాధ్యమౌతోంది. ట్రాన్స్‌డ్యూసర్‌ లేదా ప్రోబ్‌ విద్యుత్‌ శక్తిని హెచ్చు పౌనఃపున్యం గల ధ్వనిగా మార్పు చెందించి ధ్వని తరంగాలను గర్భిణీ శరీరంలోకి పంపడమే గాక తిరిగి వచ్చే ప్రతిధ్వనులను అతిధ్వని ప్రతిబింబాలుగా మార్చి తెరమీద చూపించగల్గుతున్నాయి.

చిత్రం ఎలా తయారవుతుంది?శరీరంపై ప్రోబ్‌ ఉంచుతారు. ఇది అతిధ్వని తరంగాలను శరీరంలోకి పంపి పరీక్ష చేయవలసిన ప్రాంతంలోకి వెళ్లి అక్కడ అడ్డులను ఢీకొని తిరిగి ప్రతిధ్వని తరంగాలుగా వెనుదిరిగి వస్తాయి. ఈ ప్రతిధ్వని ఒక చుక్కగా ఎలక్ట్రానికల్‌గా మారి తెరమీద కన్పిస్తుంది. ఇటువంటి అనేక చుక్కలు కలిసి తెరమీద చిత్రాన్ని ఏర్పరుస్తాయి. చిత్రంలోని నలుపు - తెలుపు గీతలు పరిశీలిస్తే నలుపు గీతలు ప్రవాహి తాలూకు చిత్రంగానూ, తెలుపు గీతలు ఎముకలు వంటి కణాలవిగానూ గుర్తిస్తారు.

స్కానింగ్‌ ఎందుకు?

పిండం యొక్క ఆరోగ్య స్థితిగతులు: గర్భిణీలకు స్కానింగ్‌ ఒక వరం. స్కానింగ్‌ వల్ల ప్రసవం ఎప్పుడు అయ్యేది తెలుస్తుంది. అల్ట్రా సౌండ్ స్కానింగ్ ద్వారా పిండం యొక్క స్థానం తెలుసుకోవడానికి ఇది ఒక గొప్ప పోషిస్తుంది. పిండం గర్భంలో ఉన్నదీ లేనిది కనుగొనేందుకు సహాయపడుతుంది. గర్భస్థ శిశువులో అవయవ లోపాలు ఉంటే తెలుస్తాయి. గర్భంలో ఉన్నది కవలలా, ఇంకా ఎక్కువమంది ఉన్నారా? అనే విషయం తెలుస్తుంది. గర్భస్థ శిశువుకు అంతర్గతంగా శారీరకంగా ఉండే అనేక విషయాలు తెలుస్తాయి. గర్భస్థ శిశువుకు ఉండే జన్యులోపాలు, క్రోమోజోముల్లో అసాధారణత్వం వంటివి వెల్లడవుతాయి.

ప్లాసెంటా స్థానం: గర్భంలో ప్లాసెంటా స్థానాన్ని సరిచూసేందుకు స్కానింగ్‌ ఉపయోగపడుతుంది. ప్లాసెంటా గర్భంలో కిందికి ఉంటే గర్భాశయం నుండి బిడ్డ బయటికి వచ్చే మార్గాన్ని ఇది మూసేస్తుంది. ప్లాసెంటా ఇలా మార్గాన్ని మూసేస్తే నొప్పులు, వాటి ఫలితంగా విపరీత రక్తస్రావం జరుగుతుంది. సిజేరియన్‌ చేయాల్సి వస్తుంది.

డౌన్ సిండ్రోమ్: కడుపులో పెరుగుతున్న శిశువుకు డౌన్ సిండ్రోమ్ ఉన్నది లేనిది తెలుసుకోవడానికి, ఆల్ట్రాసౌండ్ స్కానింగ్ ను 11-14వారాల లోపు స్కానింగ్ చేస్తారు. బిడ్డకు జన్యుపరమైన సమస్యలు కనుగొనడానికి అల్ట్రా సౌండ్ స్కానింగ్ చేస్తారు. డౌన్ సిండ్రోమ్ ను శిశువు యొక్క నాసిక ఎముక మరియు శిశువు యొక్క మొడ వెనుక చర్మం మందం పొడవు ద్వారా తెలుసుకోవడం జరుగుతుంది.

పుట్టుకలో లోపాలు: ఆల్ట్రాసౌండ్ స్కానింగ్ ను 18-20వారాల మధ్య చేస్తారు. దీన్ని అనామలీ స్కానింగ్ అంటారు. ఈ స్కానింగ్ వల్ల శిశువు పుట్టుకలో ఏదైనా లోపం ఉన్నది లేనిది తెలుసుకోవచ్చు. 20వ వారంలో తీసే స్కానింగ్ వల్ల పుట్టబోయే బిడ్డ ఆడ లేదా మగ అనికూడా తెలుసుకోవచ్చు. పిండయొక్క వెన్నెముక, అవయవాలను, మెదడు మరియు అంతర్గత అవయవాలు వంటి పిండం నిర్మాణం యొక్క అభివృద్ధిని తెలుసుకోవడానికి ఇది సహాయపడుతుంది.

English summary

Uses Of An Ultrasound Scan During Pregnancy | గర్భిణీకి అల్ట్రాసౌండ్ స్కాన్ వల్ల ఉపయోగాలు


 Ultrasound scan uses high-frequency sound waves to get an idea about internal organs. The echoes produced by the sound waves are recorded and transformed into video or photographic images. A prenatal ultrasound scan will reveal all the radiological details of the pregnancy.
Story first published: Friday, June 21, 2013, 14:25 [IST]
Desktop Bottom Promotion