For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Conceiving After Ectopic pregnancy: ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ తర్వాత గర్భం ధరించడం సాధ్యమేనా.. సంక్లిష్టతలు ఏంటంట

|

Conceiving After Ectopic pregnancy: తల్లి కావడం అనేది గొప్ప వరం. ఒక బిడ్డను నవమాసాలు మోసి జన్మనివ్వడం అనేది మాటల్లో చెప్పలేని గొప్ప అనుభూతి. గర్భం రాగానే మహిళలకు చెప్పలేని ఆనందం కలుగుతుంది. తాను తల్లి కాబోతున్నానని, బిడ్డకు జన్మనివ్వబోతున్నానని మురిసిపోతుంది. అయితే అన్ని గర్భాధారణలు ఆనందకరమైనవి కావు. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ లాంటివి చాలా బాధపెడతాయి.

ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ఏంటి?

ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ఏంటి?

గర్భం దాల్చాల్సిన చోట కాకుండా వేరే చోట ఏర్పడితే దాన్ని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటారు. సాధారణంగా అండం, వీర్య కణం అండ వాహికలో ఫలదీకరణం చెంది అది ఫెలోపియన్ ట్యూబుల ద్వారా ప్రయాణించి గర్భ సంచిలో అతుక్కుంటుంది. అలా గర్భ సంచిలో గర్భం ఏర్పడుతుంది. ఇలా కాకుండా అండవాహికలో లేదా ఫెలోపియన్ ట్యూబుల్లో గర్భం ఏర్పడితే దానిని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటారు. ఇలా ఎందుకు అవుతుందోనన్న కచ్చితమైన కారణం తెలియదు. అయితే ఇన్ఫెక్షన్, ఆపరేషన్ అయినా, ఐవీఎఫ్, పొగతాగే అలవాటు ఉన్నా ఇలాంటి పరిస్థితి తలెత్తవచ్చని వైద్యులు అంటున్నారు.

అయితే ఇలా ఏర్పడిన గర్భాన్ని మొదట్లో సాధారణ గర్భంగానే అనుకుంటారు. స్కాన్ చేసినప్పుడే ఇది ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అని తెలుస్తుంది. అయితే పిండం ట్యూబుల్లో ఎక్కువ కాలం ఉంటే, పిండం పెరిగే కొద్ది ట్యూబులకు సాగే గుణం లేకపోవడం వల్ల అవి చీలిపోయే ప్రమాదం ఉంటుంది. అప్పుడు అంతర్గత రక్తస్రావం జరుగుతుంది. ఇది ప్రాణాంతకం. సరైన చికిత్స అందకపోతే గర్భిణీ చనిపోయే ప్రమాదం ఉంది.

ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీకి చికిత్స:

ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీకి చికిత్స:

* గర్భధారణ తొలినాళ్లలో కనుక గుర్తించినట్లైతే మెథోట్రెక్సేట్ ఇచ్చి ఫెలోపియన్ ట్యూబుకు హాని కలిగించకుండా చేస్తారు. గర్భధారణ కణజాలాన్ని శరీరం శోషించుకుంటుంది.

* కొందరిలో ఫెలోపియన్ ట్యూబులు అధికంగా సాగిపోవడం లేదా చిట్లిపోయి రక్తస్రావం కలుగజేస్తాయి. ఇటువంటి కేసులలో ఫెలోపియన్ ట్యూబును పాక్షికంగా లేదా పూర్తిగా తొలగించవలసి వస్తుంది. ఇటువంటి సమయంలో అత్యవసర శస్త్రచికిత్స అవసరమవుతుంది.

* లాపరోస్కోపిక్ శస్త్రచికిత్స ద్వారా లాపరోస్కోప్ ను ఉపయోగించి వైద్యులు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీని ఫెలోపియన్ ట్యూబల నుండి గర్భసంచిలోనికి ప్రవేశపెడతారు. సాధారణ అనస్థీషియా ఇచ్చి ఈ శస్త్రచికిత్స చేస్తారు. ఈ పద్ధతిలో ఫెలోపియన్ ట్యూబులను సరిచేయడం లేదా తొలగించడం కూడా చేస్తారు. ఒకవేళ లాపరోస్కోపిక్ శస్త్రచికిత్స విఫలమైనట్లైతే కనుక లాపరోటమీ చేస్తారు.

ఎక్టోపిక్ గర్భం తర్వాత గర్భం దాల్చవచ్చా?

ఎక్టోపిక్ గర్భం తర్వాత గర్భం దాల్చవచ్చా?

ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అయినా సాధారణ గర్భం పొందడం సాధ్యమే. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ సర్జరీలో ఒక ఫెలోపియన్ ట్యూబ్ తీసివేసినా మరో ఫెలోపియన్ ట్యూబ్ ద్వారా గర్భం పొందవచ్చు. రెండు ట్యూబ్‌లను తొలగించిన కేసుల్లో మాత్రం IVF పద్ధతిని ఎంచుకోవాల్సి ఉంటుంది.

శారీరక రికవరీ

ప్రతి స్త్రీ యొక్క వ్యక్తిగత ఆరోగ్య చరిత్రపై ఆధారపడి వైద్యులు కొంత సమయం గర్భం కోసం వేచి ఉండాలని సిఫార్సు చేస్తారు. కానీ చాలా మంది వైద్యులు మాత్రం ఎక్టోపిక్ గర్భం తర్వాత కనీసం మూడు నెలలు వేచి ఉండాలని సూచిస్తుంటారు.

* గాడితప్పిన రుతుచక్రం:

గర్భధారణ సమయంలో రుతుక్రమం ఆగిపోతుంది. గర్భం ముగిసిన తర్వాత పునఃప్రారంభించటానికి కొన్ని వారాలు లేదా నెలలు పట్టవచ్చు. రుతుచక్రం నియంత్రించే హార్మోన్లు గర్భధారణకు ముందు స్థాయికి తిరిగి వచ్చిన తర్వాత, రుతుచక్రం పునఃప్రారంభం అవుతుంది.

* ఫెలోపియన్ ట్యూబ్‌లోని స్కార్ టిష్యూ:

ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ తర్వాత ఫెలోపియన్ ట్యూబ్ దెబ్బతినవచ్చు. అది గర్భం యొక్క పెరుగుదల, దానిని తొలగించే ప్రక్రియ లేదా చికిత్స చేయని STD వంటి ఎక్టోపిక్ గర్భధారణకు దోహదపడిన వాటి నుండి కావచ్చు. ఫెలోపియన్ ట్యూబ్‌లో స్కార్స్ భవిష్యత్తులో గర్భధారణ ప్రయత్నాలకు ఆటంకం కలిగిస్తాయి. కాబట్టి మళ్లీ గర్భం కోసం ప్రయత్నించే ముందు ఇవి నయం కావడం చాలా ముఖ్యం.

మానసిక పునరుద్ధరణ

గర్భం ధరించగానే ఎన్నో ఆశలు చిగురిస్తాయి. తాను ఓ బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు చాలా కోరికలు కంటుంది మహిళ. ఇంటిల్లిపాది ఆనందం వ్యక్తం చేస్తుంటారు. అలాంటి సమయంలో ఆ గర్భం పోతే కలిగే బాధ వర్ణనాతీతం. ఈ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ తర్వాత కొందరు మహిళలు మానసికంగా కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది. మళ్లీ గర్భం వస్తే మళ్లీ పోతే ఎలా అన్న భయం వారిని వెంటాడుతుంది. వాటిని కాలమే పరిష్కరిస్తుంది. కానీ వ్యక్తులను బట్టి ఎంత సమయం అవసరం అనేది ఆధారపడి ఉంటుంది.

మరోసారి గర్భం దాల్చలనుకునే ముందు..

మరోసారి గర్భం దాల్చలనుకునే ముందు..

భవిష్యత్తులో సాధారణ గర్భం దాల్చడం అనేది ఎక్టోపిక్ గర్భానికి గల కారణం, అలాగే మీ వైద్య చరిత్రపై ఆధారపడి ఉంటుంది. మీరు మళ్లీ గర్భం కోసం ప్రయత్నించే ముందు వైద్యుడిని సంప్రదించడం ముఖ్యం. డాక్టర్లు కొన్ని పరీక్షలు చేసి మీరు మరొక గర్భానికి సిద్ధంగా ఉన్నారో, లేదో చెబుతారు.

అలాగే మీరు సహజంగా గర్భం ధరించడానికి ప్రయత్నించమని వైద్యులు సలహా ఇవ్వవచ్చు. లేదా మీరు ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ (IVF) లేదా మరో రకంగా గర్భం దాల్చమని సిఫార్సు చేయవచ్చు. ప్రత్యేకించి మీకు ట్యూబల్ డ్యామేజ్ అయినట్లయితే లేదా బహుళ ఎక్టోపిక్ గర్భాలను అనుభవించినట్లయితే.. ఇతర మార్గాల్లో గర్భం దాల్చమని చెప్పవచ్చు. ఒకవేళ మీ ఫెలోపియన్ ట్యూబ్‌లు దెబ్బతినకుండా మరియు మీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీకి ముందుగానే చికిత్స అందించినట్లయితే మీరు విజయవంతంగా సాధారణ గర్భం దాల్చవచ్చు.

తరచూ అడిగే ప్రశ్నలు(Frequently Asked Questions):

తరచూ అడిగే ప్రశ్నలు(Frequently Asked Questions):

1. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటే ఏంటి?

గర్భసంచిలో కాకుండా ఫెలోపియన్ ట్యూబుల్లో లేదా అండవాహికలో గర్భం ఏర్పడటాన్ని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటారు.

2. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఎందుకు వస్తుంది?

కచ్చితమైన కారణం తెలియదు. అయితే ఫెలోపియన్ ట్యూబులకు ఇన్ఫెక్షన్ సోకడం, వాపు, ఫెలోపియన్ ట్యూబులకు జరిగిన శస్త్రచికిత్సలు, ఫెలోపియన్ ట్యూబుల నిర్మాణంలో లోపాలు, ధూమపానం లాంటి వాటి వల్ల వస్తుందని వైద్యులు భావిస్తున్నారు.

3. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ లక్షణాలు

అసాధారణంగా యోని నుండి రక్తం కారడం, వీపు కింద నొప్పి, పొత్తికడుపులో నొప్పి, పెల్విస్ ఒక వైపున తిమ్మిరి, భుజం నొప్పి, అలసట, మైకము, మూర్ఛ వంటి లక్షణాలు కనిపిస్తాయి.

4. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ నిర్ధారించడం

కటి పరీక్ష, గర్భం ఎక్కడ అభివృద్ధి చెందుతుందో తెలుసుకోవడానికి అల్ట్రాసౌండ్ పరీక్ష, హ్యూమన్ కోరియోనిక్ గోనడోట్రోపిన్ (హెచ్‌సిజి) అనే గర్భధారణ హార్మోన్ కోసం రక్తాన్ని పరీక్షించడం ద్వారా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ నిర్ధారించవచ్చు.

5. ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ చికిత్స

ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీని మందుల ద్వారా పరిష్కరించవచ్చు. లేదా శస్త్రచికిత్స చేయాల్సి రావొచ్చు.

6. ఏ శస్త్రచికిత్స చేస్తారు

ఎక్టోపిక్ గర్భం ట్యూబ్ పగిలితే, అత్యవసర శస్త్రచికిత్స అవసరం. ఫెలోపియన్ ట్యూబ్ పగిలిపోకపోయినా కొన్నిసార్లు శస్త్రచికిత్స అవసరమవుతుంది. ఈ సందర్భాలలో, ఎక్టోపిక్ గర్భం ట్యూబ్ నుండి తీసివేయబడుతుంది లేదా గర్భంతో ఉన్న మొత్తం ట్యూబ్ని తొలగించవచ్చు.

7. భవిష్యత్తులో గర్భం దాల్చవచ్చా

ఒకసారి మీరు ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీని కలిగి ఉన్నట్లయితే, మీకు మరొకసారి ఎక్టోపిక్ గర్భం వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. భవిష్యత్ గర్భధారణ సమయంలో, వైద్యులను సంప్రదించాలి. వారు పరీక్షలు చేసిన అనంతరం సాధారణం గర్భం దాల్చవచ్చో లేదో చెబుతారు. ఒకవేళ సాధారణ గర్భం కుదరకపోతే ఐవీఎఫ్, ఇతర గర్భాధారణ పద్ధతులు సూచిస్తారు. అయితే చాలా మందికి ఐవీఎఫ్ ద్వారా గర్భం దాల్చాలని వైద్యులు సిఫార్సు చేస్తారు.

Reference:

https://advancedfertility.com/patient-education/causes-of-infertility/ectopic-pregnancy/

https://www.oviahealth.com/guide/102439/pregnancy-loss-conceive-after-ectopic/

https://www.acog.org/womens-health/faqs/ectopic-pregnancy

https://alabamafertility.com/successful-pregnancy-after-an-ectopic-pregnancy/

English summary

Pregnancy after Ectopic pregnancy; Know Possible Complications in Telugu

read on to know Pregnancy after Ectopic pregnancy; Know Possible Complications in Telugu
Story first published:Friday, November 11, 2022, 14:46 [IST]
Desktop Bottom Promotion