బయట క్రిస్పీ,లోపల సాఫ్ట్..సూపర్ టేస్టీ సగ్గుబియ్యం పకోడీ ఎలా చేసుకోవాలంటే..

Posted By:

భారతీయ వంటకాలలో స్నాక్స్‌ కు ఒక ప్రత్యేక స్థానం ఉంది. సాయంత్రం వేళ వేడి వేడి ఛాయ్‌ తో పాటు కరకరలాడే పకోడీలు తింటుంటే ఆ మజాయే వేరు. అలాంటి పకోడీలలో ఎంతో ప్రాచుర్యం పొందిన, ప్రత్యేకమైన రుచిని కలిగిన వంటకం సగ్గుబియ్యం పకోడీ. పైన కరకరలాడుతూ, లోపల మెత్తగా ఉండే ఈ పకోడీలు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. ముఖ్యంగా ఉపవాసాల సమయంలో దీనిని ఎక్కువగా తీసుకుంటారు. సగ్గుబియ్యం పకోడీ ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

సగ్గుబియ్యం పకోడీకి కావలసిన పదార్థాలు
సగ్గుబియ్యం: 1 కప్పు (పెద్దవి,200 గ్రాములు)
పొటాటో: 2 పెద్దవి
పల్లీలు: అర కప్పు
పచ్చిమిర్చి: 4-5
అల్లం: 1 అంగుళం
జీలకర్ర: 1 టీస్పూన్
కొత్తిమీర: 2 టేబుల్ స్పూన్లు
కరివేపాకు: రెండు రెబ్బలు
నిమ్మరసం: 1 టీస్పూన్
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: డీప్ ఫ్రైకి సరిపడా

Crispy Sabudana Pakoda Your New Favorite Tea Time Snack Recipe in Telugu

తయారీ విధానం

-ముందుగా ఒక గిన్నెలో సగ్గుబియ్యాన్ని తీసుకుని, నీళ్లు పోసి రెండు మూడు సార్లు శుభ్రంగా కడగాలి. తర్వాత సగ్గుబియ్యం మునిగేంత వరకు నీళ్లు పోసి, కనీసం 4-5 గంటల పాటు నానబెట్టాలి. రాత్రంతా నానబెడితే ఇంకా బెటర్.

-నానిన తర్వాత సగ్గుబియ్యంలోని నీటిని పూర్తిగా వంపేయాలి. ఒక క్లాత్ పై పరిచి ఒక 10-15 నిమిషాలు వదిలేస్తే అదనపు తేమ కూడా పోతుంది. సగ్గుబియ్యం పొడిపొడిగా ఉండటం చాలా ముఖ్యం.

-ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకుని అందులో నీరు లేకుండా పొడిగా ఉన్న నానబెట్టిన సగ్గుబియ్యాన్ని వేయాలి. ఇందులోనే ఉడికించి మెత్తగా చేసుకున్న బంగాళదుంప తురుమును వేయాలి.ఆ తర్వాత, కచ్చాపచ్చాగా దంచిన వేయించిన పల్లీల పొడిని వేయాలి. ఇది పకోడీలకు మంచి క్రంచీ రుచిని ఇస్తుంది.

-ఇప్పుడు అందులో సన్నగా తరిగిన పచ్చిమిర్చి, అల్లం తురుము, జీలకర్ర, కొత్తిమీర, కరివేపాకు, రుచికి సరిపడా ఉప్పు వేయాలి. ఈ మిశ్రమాన్ని చేతితో బాగా కలపాలి. నీళ్లు అస్సలు పోయకూడదు. సగ్గుబియ్యంలోని తేమ, బంగాళదుంపలోని తేమ మిశ్రమాన్ని ముద్దగా చేయడానికి సరిపోతుంది. చపాతీ పిండిలా గట్టిగా కలుపుకోవాలి.

-చివరగా కొద్దిగా నిమ్మరసం పిండితే పకోడీలకు మంచి రుచి వస్తుంది.

-స్టవ్ మీద ఒక లోతైన బాండీని పెట్టి అందులో డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి మీడియం మంట మీద వేడి చేయాలి. నూనె మరీ ఎక్కువగా వేడిగా ఉండకూడదు, అలాగని చల్లగా కూడా ఉండకూడదు.

-నూనె వేడెక్కేలోపు సిద్ధం చేసుకున్న మిశ్రమం నుంచి కొద్ది కొద్దిగా తీసుకుని చిన్న చిన్న పకోడీల్లాగా లేదా చిన్న వడల్లాగా ఒత్తుకోవాలి.

-నూనె సరైన వేడికి వచ్చాక మంటను మీడియంలోకి ఉంచి,తయారు చేసుకున్న పకోడీలను మెల్లగా నూనెలో వేయాలి. ఒకేసారి ఎక్కువగా వేయకూడదు, కొద్ది కొద్దిగా వేయించాలి. వాటిని వెంటనే గరిటెతో కదపకూడదు. ఒక నిమిషం పాటు వేగిన తర్వాత అవి కొద్దిగా గట్టిపడతాయి. అప్పుడు మెల్లగా గరిటెతో తిప్పుతూ అన్ని వైపులా బంగారు గోధుమ రంగులోకి, కరకరలాడేలా అయ్యేవరకు వేయించాలి.

-వేయించడానికి సుమారు 5-7 నిమిషాల సమయం పడుతుంది. వేయించిన పకోడీలను ఒక ప్లేట్‌లోని టిష్యూ పేపర్‌పైకి తీస్తే, అదనపు నూనె పీల్చుకుంటుంది. అంతే ఎంతో రుచికరమైన, కరకరలాడే సగ్గుబియ్యం పకోడీలు రెడీ.

[ of 5 - Users]
Story first published: Saturday, October 11, 2025, 22:05 [IST]
Desktop Bottom Promotion