పుల్లటి మజ్జిగతో ఆంధ్రా స్పెషల్ చల్ల ఉప్మా..టేస్ట్ మాత్రం సూపరో సూపర్!

Posted By:

తెలుగు వారి వంటగదిలో ఎప్పుడూ లభించే పదార్థాలతో, తక్కువ సమయంలో, అద్భుతమైన రుచితో చేసుకునే అల్పాహారాల్లో చల్ల ఉప్మా లేదా మజ్జిగ ఉప్మా ప్రత్యేకమైనది. సాధారణ ఉప్మా కంటే ఇది చాలా భిన్నంగా ఉంటుంది. పుల్లని మజ్జిగ లేదా పెరుగుతో చేయడం వల్ల దీనికి ఒక ప్రత్యేకమైన రుచి వస్తుంది. ఇది కేవలం రుచికరమైనది మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది.

ఎండాకాలంలో శరీరానికి చలువ చేయడానికి ఇది ఒక ఉత్తమమైన ఆహారం. ఈ ఉప్మాను బియ్యం రవ్వతో చేస్తారు. బియ్యం రవ్వతో చేయడం వల్ల ఇది పొడిపొడిగా, నోటికి రుచిగా తగులుతుంది. మీ ఇంట్లో పెరుగు మిగిలిపోయి పులిసిపోతే దానిని పారబోయకుండా, ఇలా రుచికరమైన చల్ల ఉప్మా చేసి మీ కుటుంబ సభ్యులకు ఆశ్చర్యపర్చవచ్చు. ఆంధ్రా స్టైల్ లో చల్ల ఉప్మా ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

Delicious Andhra Style Challa Upma Beat the Heat with this Traditional Cooling Majjiga Upma Recipe

తయారీకి కావాల్సిన పదార్థాలు

-పుల్లని మజ్జిగ లేదా పెరుగు
-పచ్చి శెనగపప్పు
-మినపప్పు
-ఆవాలు
-నూనె
-బియ్యం రవ్వ
-పచ్చిమిర్చి
-ఎండుమిర్చి
-జీలకర్ర
-కరివేపాకు
-ఉల్లిపాయ
-పసుపు
-ఉప్పు

తయారీ విధానం

-ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో 1 కప్పు కొంచెం పుల్లగా ఉండే పెరుగు వేసి, 2 కప్పుల నీళ్లు పోసి కాస్త పలుచగా చిలుక్కోండి.

-తర్వాత ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులో 1 గ్లాసు బియ్యం రవ్వ(250 గ్రా)వేసుకోండి.

-ఇప్పుడు స్టవ్ మీద మందపాటి కడాయి పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ పోసి వేడయ్యాక అందులో 1 టీస్పూన్ పచ్చి శెనగపప్పు, అర టీస్పూన్ మినపప్పు, అర టీస్పూన్ ఆవాలు, అర టీస్పూన్ జీలకర్ర, 2 పచ్చిమిరపకాయల ముక్కలు, 1 ఎండుమిర్చి ముక్కలు, కొంచెం కరివేపాకు వేసి వీటన్నింటిని వేయించాలి.

-తాలింపు దోరగా వేగిన తర్వాత అందులో 1 ఉల్లిపాయ మీడియం సైజు ముక్కలు వేసి లైట్ పింక్ కలర్ లోకి వచ్చేదాకా వేయిస్తే సరిపోతుంది..మరీ ఎక్కువ వేపనక్కర్లేదు.

-ఉల్లిపాయ ముక్కలు పింక్ కలర్ లోకి మారాక స్టవ్ ఆపేయండి. ఇప్పుడు కడాయిలో కలిపి పెట్టుకున్న మజ్జిగ రెండుబావు గ్లాసులు పోసి, ఇందులోనే పావు టీస్పూన్ పసుపు, సరిపడా ఉప్పు వేసి ఒకసారి బాగా కలుపుకోండి.

-ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయిలోని మజ్జిగ మిశ్రమాన్ని మరిగించాలి. మరుగుతున్నప్పుడు అందులో 1 గ్లాసు బియ్యం రవ్వ(250 గ్రా) వేసుకొని మెత్తం బాగా కలిసేలా కలుపుకోండి. కాస్త దగ్గరపడే వరకు కలుపుతూ ఉడికించుకోండి.

-మిశ్రమం కాస్త దగ్గరపడిన తర్వాత కడాయి మీద మూత పెట్టి ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉడికించాలి. కుక్కర్ మీద అయితే ఈ స్టేజ్ లో 3 విజిల్స్ రానిస్తే సరిపోతుంది.

-రవ్వ అంతా దగ్గరపడిన తర్వాత పట్టుకొని చూడండి. పలుకు లేకుండా ఉండే ఉప్మా రెడీ అయినట్లే.

[ of 5 - Users]
Story first published: Thursday, February 19, 2026, 16:48 [IST]
Desktop Bottom Promotion