ఈ స్టైల్‌లో రాగి దోశను చేసుకొని తిన్నారా..? ఉల్లిపాయ చట్నీతో నంచుకొని తింటే..ఆహా !

Posted By:

రాగితో ఏది చేసుకొని తిన్నా ఆరోగ్యానికి మంచితే. తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషకాలు కలిగినది బహుశా రాగి మాత్రమే కావచ్చు. మార్కెట్లో కూడా తక్కువ ధరకు లభించే రాగి పిండితో ఎన్నో రకాలైన రుచికరమైన వంటకాలను చేసుకోవచ్చు. రాగి సంగటి, రాగి జావ, రాగి దోశ, ఇలా ఎన్నో వెరైటీలు వున్నాయ్. రోజూ రాగిని ఆహారంలో భాగం చేసుకున్న వారికి అటు ప్రొటీన్లు, ఇటు క్యాల్షియం సంమృద్ధిగా అందుతాయ్. రాగి దోశ రెసిపీని మీ ముందుకు తీసుకొని వచ్చాము. రాగి దోశను ఎలా తయారు చేసుకోవాలి, దానికి ఉల్లిపాయ చట్నీని కూడా ఎలా రెడీ చేసుకోవాలో మీకు అందిస్తున్నాం.

రాగి దోశను తయారు చేయడానికి కావలసిన వంట సామాగ్రి

రాగిపిండి, బొంబాయ్ రవ్వ, బియ్యపుపిండి, ఉప్పు, పెరుగు, ఉల్లిపాయ, అల్లం, టమాట, చింతపండు, బెల్లం, జిలకర, ఎండిమిరపకాయలు, మినపప్పు, మంచి నూనె, కరివేపాకులు.

రాగి దోశను తయారు చేసే విధానం

ముందుగా మిక్సింగ్ బౌల్‌లోకి ఒక కప్పు రాగి పిండిని తీసుకోవాలి. ఇందులోనే పావు కప్పు బొంబాయ్ రవ్వను యాడ్ చేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ బియ్యపు పిండిని, రుచికి సరిపడ ఉప్పును వేసి పిండిని బాగా కలుపుకోవాలి. టేస్ట్ బాగా రావడానికి పావు కప్పు పెరుగును కూడా యాడ్ చేసుకోవాలి. అవసరానికి సరిపడా నీళ్లను పోసుకుంటూ రాగి పిండిని కలుపుకోవాలి.

ఇప్పుడు రాగి దోశలోకి చట్నీని చేయడానికి మిక్సింగ్ జార్ లోకి అరకప్పు కోసి ఉల్లిపాయ ముక్కలను, కట్ చేసిన రెండు టమాట ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి.ఒక చిన్న అల్లం ముక్క, 10 ఎల్లిపాయలను, రెండు రేకలు చింతపండును, అర టీస్పూన్ బెల్లంను యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపడ ఉప్పు, అరటీస్పూన్ జిలకరను తీసుకొని మెత్తగా గ్రైండ్ చేయాలి. అవసరానికి సరిపడ కొన్ని నీళ్లను పోసుకొని, ఏడు ఎండిమిరపకాయలను కూడా యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేయాలి.

గ్రైండ్ అయిన చట్నీకి పోప్ పెట్టడానికి ప్యాన్‌లో రెండు టేబుల్ స్పూన్ల నూనెను పోసుకోవాలి. నూనె వేడయిన తరువాత అర టీస్పూన్ మినపప్పును, అరటీస్పూన్ ఆవాలును, కొన్ని కరివేపాకులను కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పోప్ బాగా ఫ్రై అయిన తరువాత గ్రైండ్ అయిన పేస్ట్‌ను ఇందులో వేసుకొని కలుపుకోవాలి. ప్యాన్ పై మూతపెట్టి 3 నిమిశాలు ఉడకనిస్తే పచ్చివాసన మొత్తం పోతుంది.

ఇప్పుడు రాగిదోశ వేసే విధంగా పిండిలో నీళ్లను కలుపుకోవాలి. దోశలు వేయడానికి పెనంపై ఒక టీస్పూన్ ఆయిల్‌ను వేసుకొని ఉల్లిపాయతో పెనం మొత్తం స్ప్రెడ్ చేయాలి. లోఫ్లేమ్‌లో పెట్టుకొని దోశలు వేస్తే బాగా వస్తాయ్. లేదంటే మాడిపోతాయ్. రాగిదోశను పెనంపై వేసి జాగ్రత్తగా దోశను వేసుకోవాలి. దోశపై తగినంత ఆయిల్‌ను అప్లై చేసుకోవాలి.

ఇక దీంతో రాగి దోశ రెడీ అయినట్టే. ఉల్లిపాయ చట్నీతో ఆ రాగిదోశను తింటే టేస్ట్ మాత్రమే కాదు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మామూలు దోశకన్నా ఈ రాగి దోశను చేసుకొని తినండి. మామూలు దోశల వల్ల క్యాలరీలు పెరగడం, బరువు పెరగడం జరుగుతుంది. ఈ రాగి దోశ వల్ల లాభాలే కానీ నష్టాలు వుండవు. రాగి సంగటిని, రాగి జావను తాగలేని వారు ఈ రాగి దోశను చేసుకోవచ్చు.

[ of 5 - Users]
Desktop Bottom Promotion