చలి కాలంలో ఉదయాన్నే ఈ సూప్ తాగితే చలి వేయదు.. దగ్గు, జలుబు కూడా మాయం! ఎలా చేసుకోవాలంటే?

చలికాలం రోజు రోజుకూ తీవ్రంగా మారుతోంది. చలి తీవ్రత కూడా పెరిగిపోతుంది. ఈ చల్లటి వాతావరణంలో శరీరాన్ని వేడిగా ఉంచుకునేందుకు ఏదైనా వెచ్చగా తాగాలి లేదా తినాలి అని అనిపిస్తుంటుంది. అలాంటి వారికి ఈ చలికాలంలో సూప్ చాలా బెస్ట్. ఇవి శరీరానికి కావాల్సిన వెచ్చదనాన్ని అందిస్తాయి. అలాగే శరీరానికి కావాల్సిన పోషకాలను కూడా అందజేస్తాయి.

అయితే ఈరోజు అలాంటి సూప్ గురించి మీకు చెప్తాము. అదే 'క్యారెట్ అల్లం సూప్'. దీనిని సులభంగా ఇంట్లోనే చేసుకోవచ్చు. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటి? ఏ విధంగా దీనిని తయారు చేసుకోవాలి అనేది ఈ స్టోరీలో క్లియర్‌గా తెలుసుకుందాం.

క్యారెట్ అల్లం సూప్ తయారీకి కావాల్సిన పదార్థాలు

  1. 400 గ్రాముల క్యారెట్(సన్నగా తరుక్కోవాలి)
  2. సన్నగా తరిగిన ఒక ఇంచ్ అల్లం
  3. ఆరు వెల్లుల్లి రెబ్బలు
  4. ఒక బిర్యాని ఆకు
  5. ఒక టీస్పూన్ మిరియాలు
  6. ఓ ఉల్లిపాయ తరుగు
  7. ఒక టేబుల్ స్పూన్ వంటనూనె
  8. రుచికి తగినంత ఉప్పు
  9. ఒక లీటర్ నీరు

క్యారెట్ అల్లం సూప్ తయారీ విధానం

ముందుగా స్టవ్ వెలిగించి దానిపై ప్యాన్ పెట్టుకోవాలి. అందులో కొంచెం నూనె పోసుకోవాలి. నూనె వేడయ్యాక అందులో బిర్యానీ ఆకు, వెల్లులి, మిరియాలు, అల్లం ముక్కలు వేసుకోవాలి. తరువాత ప్యాన్‌పై మూత పెట్టి సుమారు రెండు నిమిషాల పాటు వాటిని మగ్గనివ్వాలి. ఆ తరువాత అందులోనే క్యారెట్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు వేసుకొని కలుపుకోవాలి.

ఇప్పుడు ఆ మిశ్రమంలో ఒక అర లీటర్ నీరు పోసుకోవాలి. ఆ తరువాత ప్యాన్‌పై మూతపెట్టి అల్లం, క్యారెట్, ఉల్లిపాయ ముక్కలు మెత్తగా ఉడికేవరకు మీడియం మంట మీద ఉడకబెట్టుకోవాలి. మధ్య మధ్యలో ఆ మిశ్రమాన్ని కలుపుతూ ఉండాలి. క్యారెట్ ముక్కలు, అల్లం, ఉల్లిపాయ ముక్కలు బాగా ఉడికిపోయిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి.. ఆ మిశ్రమాన్ని మిక్సీలో వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి.

ఇప్పుడు ఆ మిశ్రమాన్ని స్టెయినర్‌లో తీసుకొని, ఒక అర లీటరు నీరు పోసి, పైనుంచి ఒత్తాలి. ఇలా చేయడం ద్వారా ఆ మిశ్రమంలో రసం కింద గిన్నెలోకి వెళ్తుంది. పిప్పి పైనే ఉండిపోతుంది. ఇలా క్యారెట్, అల్లం రసం గిన్నెలోకి జారీ సూప్ తయారవుతుంది. తయారైన ఆ సూప్‌ను మరొక్కసారి వేడి చేసుకోవాలి. అప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కొంచెంసేపు మరగనిచ్చి కిందకు దించుకుంటే క్యారెట్ అల్లం సూప్ సిద్ధమైనట్లే.

కాస్త తియ్యగా, కాస్తా ఘాటుగా ఉండే ఈ సూప్ అదిరిపోతుంది. చలికాలంలో దగ్గు, జలుబు సమస్యలను దూరం చేయడానికి కూడా ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. వేడి వేడిగా ఈ సూప్ తాగితే శరీరానికి కావాల్సిన వెచ్చదనం దొరకడంతో పాటు రుచి అద్భుతంగా ఉంటుంది.

గమనిక: ఈ కథనంలో మేము పొందుపరిచిన అంశాలు పలు అధ్యయనాలు, ఇంటర్నెట్‌లో మాకు దొరికిన సమాచారం ఆధారంగా అందించబడింది. వీటి శాస్త్రీయతను మేము నిర్ధారించడం లేదు. మేము కేవలం సమాచారం అందించడానికి మాత్రమే ప్రయత్నిస్తున్నాము. వీటిని ఎంతవరకు విశ్వసించడం అనేది పూర్తిగా మీ బాధ్యత. దీనికి బోల్డ్ స్కై తెలుగు ఎటువంటి బాధ్యత వహించదు.

[ of 5 - Users]
Desktop Bottom Promotion