ఇడ్లీ, దోసెల్లోకి బెస్ట్ కాంబినేషన్: నోరూరించే బెంగాలీ స్టైల్ టమాటా చట్నీ తయారీ ఇలా!

Posted By:

మన దక్షిణ భారతీయుల ఇళ్లల్లో ఉదయం బ్రేక్‌ ఫాస్ట్ అనగానే ఠక్కున గుర్తొచ్చేవి ఇడ్లీ, దోసెలే. అయితే, వేడి వేడి ఇడ్లీలు లేదా కరకరలాడే దోసెలు ఎంత రుచిగా ఉన్నా, వాటికి సరైన సైడ్ డిష్ లేకపోతే ఆ మజాయే ఉండదు. అయితే మీరు కచ్చితంగా ఈ సారి బెంగాలీ స్టైల్ టమాటా చట్నీని ట్రై చేయాల్సిందే.

టమాటా చట్నీ అంటే మీ ఇంట్లో వాళ్లకు ఇష్టమైతే, ఈ బెంగాలీ వెర్షన్ వారిని మరింతగా ఆకట్టుకుంటుంది. తీపి, పులుపు, కారం కలగలిసిన ఈ అద్భుతమైన చట్నీ రుచి ఒక్కసారి చూశారంటే వదిలిపెట్టరు. ముఖ్యంగా పిల్లలు దీనిని లొట్టలేసుకుంటూ తింటారు. ఈ చట్నీ ఇంట్లో ఉంటే, మామూలుగా తినేదానికంటే రెండు ఇడ్లీలు ఎక్కువే లాగించేస్తారు.

బెంగాలీ టమాటో చట్నీ తయారీకి వాల్సిన పదార్థాలు

ఎర్రగా పండిన టమాటాలు - 5
వంట నూనె - 2 టేబుల్ స్పూన్లు
ఆవాలు (లేదా ఆవాల పొడి) - 1 టేబుల్ స్పూన్
ఎండు మిరపకాయ - 1
ఉప్పు - రుచికి సరిపడా
చక్కెర - 3 టేబుల్ స్పూన్లు
సోంపు పొడి - ½ టీస్పూన్
పచ్చి మిరపకాయలు - 2
నీళ్లు - 1 కప్పు

బెంగాలీ స్టైల్ టమాటో చట్నీ తయారీ విధానం

-ముందుగా ఎర్రగా పండిన టమాటాలను తీసుకుని శుభ్రంగా కడగాలి. ఆ తర్వాత వాటిని నిలువుగా, సన్నని ముక్కలుగా కోసుకుని ఒక పక్కన పెట్టుకోండి. అలాగే పచ్చి మిరపకాయలను కూడా పొడవుగా చీలికలు చేసుకోండి.

-స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టిరెండు టేబుల్ స్పూన్ల నూనె వేయండి. మంటను మీడియంలో ఉంచండి. నూనె కొద్దిగా వేడెక్కాక అందులో ఆవాలు, ఎండు మిరపకాయను వేయండి. ఆవాలు చిటపటలాడుతూ మంచి సువాసన వస్తున్నప్పుడు, ముందుగా కోసి పెట్టుకున్న టమాటా ముక్కలను వేసి గరిటెతో బాగా కలపండి.

-టమాటాలు కాస్త మగ్గిన తర్వాత, మీ రుచికి సరిపడా ఉప్పు, అలాగే మూడు టేబుల్ స్పూన్ల చక్కెరను వేసి కలపండి. ఇప్పుడు బాండీపై మూత పెట్టి, సుమారు 5 నిమిషాల పాటు లేదా టమాటాలు పూర్తిగా మెత్తబడి, గుజ్జులా మారే వరకు ఉడికించండి.

-టమాటాలు బాగా ఉడికిన తర్వాత అందులో ఒక కప్పు నీళ్లు పోయండి. ఇప్పుడు సన్నగా తరిగిన పచ్చి మిరపకాయలు, సోంపు పొడి వేసి బాగా కలపండి. మీడియం మంట మీదే చట్నీని బాగా మరిగించండి. నీళ్లు ఇగిరిపోయి, చట్నీ కాస్త చిక్కబడి జామ్ లాంటి ఆకృతికి రాగానే పైన మరో చిటికెడు సోంపు పొడిని చల్లి, ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి.

-అంతే గుమగుమలాడే బెంగాలీ స్టైల్ టమాటా చట్నీ రెడీ. వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని ఈ చట్నీతో తిన్నా దీని రుచి అమోఘంగా ఉంటుంది.

[ of 5 - Users]
Desktop Bottom Promotion