Coriander avakaya: కొత్తిమీర ఆవకాయ.. ఇలా చేసుకొని తింటే ఫుడ్ లవర్స్‌కు స్వర్గమే! జీవితంలో వదలరు!

కొత్తిమీరను ఏ కూరలో అయినా కొలుపుకుంటే ఆ రుచి అద్భుతంగా ఉంటుంది. కూర కూడా మారిపోతుంది. సాధారణ కూర నుంచి బిర్యానీ వరకు, నాన్ వెజ్ వంటల వరకు ఈ కొత్తిమీరను వినియోగిస్తూ ఉంటారు. అయితే ఈ కొత్తిమీరతో ఆవకాయ పెట్టుకుంటే ఆ రుచి వేరే లెవెల్‌లో ఉంటుంది. ఒక్కసారి చేసుకుంటే మూడు నెలల పాటు వస్తుంది. దీని రుచి వర్ణనాతీతం. ఒక్కసారి తింటే మళ్ళీ జీవితంలో వదలరు అంత రుచిగా ఉంటుంది. అయితే ఈ కొత్తిమీర ఆవకాయను ఎలా చేసుకోవాలి? దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

కొత్తిమీర ఆవకాయ తయారీకి కావాల్సిన పదార్థాలు

  1. సన్నగా తరిగిన నాలుగు కప్పుల కొత్తిమీర
  2. ఒక పెద్ద నిమ్మకాయ సైజులో చింతపండు
  3. ఒక కప్పు వేడి నీళ్లు
  4. ఒక కప్పు నూనె
  5. ఒక స్పూన్ మెంతులు
  6. ఒకటిన్నర స్పూన్ ఆవాలు
  7. రెండు స్పూన్ల పచ్చి శనగ పప్పు
  8. రెండు స్పూన్ల మినపప్పు
  9. పది వెల్లుల్లి రెబ్బలు
  10. గుప్పెడు కరివేపాకు
  11. ఆరు ఎండుమిర్చి
  12. ఒక స్పూన్ జీలకర్ర
  13. అరకప్పు కారం

కొత్తిమీర ఆవకాయ తయారీ విధానం

కొత్తిమీరను సన్నగా తరిగి, శుభ్రంగా కడుక్కోవాలి. అలా కడుక్కున్న కొత్తిమీరను సన్నటి బట్ట మీద ఆరబెట్టుకోవాలి. అలాగే ఒక కప్పు వేడి నీళ్లలో చింతపండును నానబెట్టుకోవాలి. నీళ్లు వేడి తగ్గాకా చింతపండును పిసికి గింజలు, గుజ్జు తీసేయాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి, ఒక కడాయి పెట్టుకోవాలి. అందులో రెండు స్పూన్ల నూనె వేసుకోవాలి.

నూనె వేడయ్యాక అందులోనే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను వేసుకోవాలి. ఆ కొత్తిమీరను సన్నటి మంట మీద మెత్తగా అయ్యే వరకు వేయించుకోవాలి. వేయించిన కొత్తిమీరను తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో రెండు స్పూన్ నూనె వేసుకోవాలి. అలాగే చింతపండు గుజ్జును కూడా వేసి బాగా కలుపుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని ఓసారి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి.

ఇప్పుడు ఇంకో కడాయిలో మెంతులు, ఆవాలు వేసుకొని బాగా వేయించుకోవాలి. వాటిని పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తరువాత అదే కడాయిలో ఒక కప్పు నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక ఆ కడాయిలో వెల్లుల్లి రెబ్బలు, పచ్చి శనగ పప్పు, మినపప్పు, జీలకర్ర, ఒక స్పూన్ ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకులు వేయించి పక్కకు తీసుకోవాలి. అలాగే మిక్సీలో వేయించిన కొత్తిమీర, చింతపండు మిశ్రమాన్ని వేసుకొని కచ్చా పచ్చగా దంచుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి.

ఆ మిశ్రమంలో మెంతులు, ఆవాలు పొడి, కారం వేసి చేతితో బాగా కలుపుకోవాలి. ఆ తరువాత ఆ అవకాయలో తాలింపు వేసుకొని ఒక స్పూన్ తీసుకొని తాలింపు మొత్తం అవకాయకు పట్టుకునే విధంగా కలుపుకుంటే ఎంతో రుచికరమైన కొత్తిమీర ఆవకాయ సిద్ధమైనట్లే. దీనిని వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే ఆ రుచి స్వర్గం అనే చెప్పొచ్చు.

[ of 5 - Users]
Desktop Bottom Promotion