ఉదయం ఇడ్లీలు మిగిలాయా? పడేయకండి.. సాయంత్రానికి ఇలా కరకరలాడే వడలు చేయండి!

Posted By:

మన ఇళ్లల్లో ఇడ్లీలు మిగిలిపోతే మనకు ముందుగా గుర్తొచ్చే ఆప్షన్ ఇడ్లీ ఉప్మా. కానీ ప్రతిసారీ అదే ఇడ్లీ ఉప్మాను తిని బోర్ కొట్టిందా? అయితే ఈసారి మిగిలిపోయిన ఇడ్లీలతో వడలు చేసుకోండి. సాధారణంగా వడలు చేయాలంటే మినపప్పు నానబెట్టాలి, రుబ్బాలి.. కానీ ఈ మిగిలిపోయిన ఇడ్లీలతో అచ్చం మినప వడల్లాగే కరకరలాడే వడలను తయారు చేసుకోవచ్చు.

బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా ఉండే ఈ వడలను ఒక్కసారి రుచి చూశారంటే ఇకపై సాయంత్రం స్నాక్స్ కోసం కావాలనే ఉదయం ఇడ్లీలను మిగుల్చుకుంటారు. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ లొట్టలేసుకుని తినే ఈ ఇడ్లీ వడ ఎలా తయారు చేయాలో ఇక్కడ చూడండి.

కరకరలాడే వడలు కావాల్సిన పదార్థాలు

ఇడ్లీలు - 6
బియ్యం పిండి - 2 టేబుల్ స్పూన్లు
ఉల్లిపాయ - 1
పచ్చిమిర్చి - 1
అల్లం - చిన్న ముక్క
కరివేపాకు - 1 రెమ్మ
కొత్తిమీర తరుగు - కొద్దిగా
ఉప్పు - పావు టీస్పూన్
నీళ్లు - పిండి కలపడానికి తగినంత
నూనె - డీప్ ఫ్రై చేయడానికి సరిపడా

కరకరలాడే వడలు తయారీ విధానం

-ముందుగా ఒక వెడల్పాటి గిన్నెలో మిగిలిపోయిన ఆరు ఇడ్లీలను వేసి చేతులతో మెదుపుకోవాలి.

-పొడి చేసుకున్న ఇడ్లీ మిశ్రమంలో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, అల్లం తురుము, కరివేపాకు, కొత్తిమీర తరుగు వేయాలి. అల్లం, ఉల్లిపాయల ఫ్లేవర్ ఇడ్లీకి పట్టేలా చేత్తో బాగా మిక్స్ చేయాలి.

-ఇప్పుడు ఆ మిశ్రమంలోనే రెండు టేబుల్ స్పూన్ల బియ్యం పిండి, సరిపడా ఉప్పు వేసి కలపాలి. ఆ తర్వాత కొద్దికొద్దిగా నీళ్లు చల్లుకుంటూ, చపాతీ పిండి కంటే కొంచెం మెత్తగా, ముద్దలా కలుపుకోవాలి. నీళ్లు మరీ ఎక్కువైతే వడలు నూనె పీల్చేస్తాయి.

-ఇప్పుడు మీ రెండు చేతులకు కొద్దిగా నూనె రాసుకుని తయారుచేసుకున్న పిండి నుండి చిన్న చిన్న ముద్దలను తీసుకోండి. వాటిని అరచేతిలో పెట్టి గుండ్రంగా, కొద్దిగా మందంగా అదుముకుని, మధ్యలో మన సాంప్రదాయ వడకు పెట్టినట్లుగా రంధ్రం చేయండి. ఇలాగే పిండి అంతటినీ వడల్లా చేసుకుని ఒక ప్లేట్‌ లో సిద్ధంగా పెట్టుకోండి.

-స్టవ్ వెలిగించి మందపాటి కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోయాలి. నూనె బాగా వేడెక్కిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్‌ లో ఉంచి ముందుగా సిద్ధం చేసుకున్న వడలను ఒక్కొక్కటిగా నూనెలో వేయాలి.

-వడలను నూనెలో వేసిన వెంటనే కదపకుండా, ఒకవైపు కొద్దిగా వేగాక గరిటెతో రెండో వైపుకు తిప్పుకోవాలి. ఇలా రెండు వైపులా మంచి బంగారు గోధుమ రంగు వచ్చి, కరకరలాడే వరకు వేయించి, నూనె లేకుండా తీసి ఒక ప్లేట్‌ లోకి మార్చుకోవాలి.

-అంతే ఎంతో రుచికరమైన, కరకరలాడే ఇడ్లీ వడలు రెడీ. వీటిని పల్లీల చట్నీతో గానీ, కొబ్బరి చట్నీతో గానీ నంజుకుని తింటుంటే ఆ మజాయే వేరు.

[ of 5 - Users]
Desktop Bottom Promotion