నోరూరించే గోలి ఇడ్లీలు.. ఒక్కసారి తింటే అస్సలు వదలరు..నిమిషాల్లో ఎలా చేసుకోవాలంటే..

Posted By:

దక్షిణ భారతదేశంలో బ్రేక్ ఫాస్ట్ అనగానే మనకు వెంటనే గుర్తొచ్చేది ఇడ్లీ, దోశ. ఇవి ఆరోగ్యానికి ఎంత మంచివో, రుచికి కూడా అంతే అద్భుతంగా ఉంటాయి. అయితే ప్రతిరోజూ తినే రొటీన్ ఇడ్లీ కాకుండా, కొంచెం కొత్తగా, ఇంకాస్త రుచిగా ఏదైనా చేయాలనుకుంటున్నారా? అయితే గోలి ఇడ్లీ ట్రై చేయండి.

ముఖ్యంగా పిల్లలు రోజువారీ టిఫిన్ తినడానికి మారాం చేస్తుంటే, ఆకర్షణీయమైన ఆకృతిలో ఉండే చిట్టి చిట్టి గోలి ఇడ్లీలను చేసి పెట్టండి..ఒక్కటి కూడా వదిలిపెట్టకుండా ప్లేట్ ఖాళీ చేసేస్తారు. నిమిషాల్లో వేడి వేడి,కమ్మని గోలి ఇడ్లీ ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.

No Batter No Problem Make Instant Goli Idli in Minutes

కావలసిన పదార్థాలు
బియ్యం పిండి - 1 కప్పు
నీళ్లు - ఒకటిన్నర కప్పులు
నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు
ఉప్పు - రుచికి సరిపడా
నూనె - 2 స్పూన్లు
ఆవాలు - అర టీస్పూన్
శనగ పప్పు - 1 టీస్పూన్
మినపప్పు - 1 టీస్పూన్
తెల్ల నువ్వులు - 1 టీస్పూన్
పచ్చిమిర్చి - 2
అల్లం తురుము - 1 టీస్పూన్
కరివేపాకు - రెండు రెమ్మలు
ఇంగువ - చిటికెడు
కొత్తిమీర - గార్నిష్ కోసం

తయారీ విధానం

-ముందుగా స్టవ్ వెలిగించి ఒక మందపాటి గిన్నెలో నీటిని పోసి మరిగించాలి. నీరు మరుగుతున్నప్పుడు అందులో కొంచెం నెయ్యి, రుచికి సరిపడా ఉప్పు వేయాలి.

-నీరు బాగా మరిగిన తర్వాత మంటను తగ్గించి అందులో బియ్యం పిండిని కొద్దికొద్దిగా వేస్తూ ఉండలు కట్టకుండా గరిటెతో కలుపుతూ ఉండాలి. పిండి మొత్తం నీటిని పీల్చుకుని దగ్గరపడి, మెత్తటి ముద్దలా మారిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు పక్కన పెట్టాలి.

-పిండి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే చేతులకు కొంచెం నెయ్యి లేదా నూనె రాసుకుని పిండిని బాగా మర్దన చేయాలి. పిండి ఎంత బాగా పిసికితే ఇడ్లీలు అంత మృదువుగా వస్తాయి.

-ఇప్పుడు ఆ పిండిని చిన్న చిన్న బంతులుగా గోలీల సైజులో చేసుకోవాలి.

-ఇడ్లీ పాత్రలో నీళ్లు పోసి వేడి చేయాలి. ఇడ్లీ ప్లేట్లకు నెయ్యి రాసి, మనం సిద్ధం చేసుకున్న పిండి బంతులను అందులో పెట్టి, సుమారు 10 నుండి 12 నిమిషాల పాటు ఆవిరి మీద మీడియం మంటపై ఉడికించాలి. ఉడికిన తర్వాత వాటిని బయటకు తీసి పక్కన పెట్టుకోవాలి.

ఈ ఇడ్లీలకు అసలైన రుచి తాలింపుతోనే వస్తుంది. తాలింపు కోసం స్టవ్ మీద పాన్ పెట్టి 2 స్పూన్ల నెయ్యి లేదా నూనె వేడి చేయాలి.

-నూనె కాగాక ఆవాలు, శనగపప్పు, మినపప్పు వేసి దోరగా వేయించాలి. పప్పులు ఎర్రగా అయ్యాక పచ్చిమిర్చి ముక్కలు, అల్లం తురుము, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. చివరగా తెల్ల నువ్వులు వేసి చిటపటలాడించాలి.

-తాలింపు సిద్ధమయ్యాక, ఆవిరిలో ఉడికించిన గోలి ఇడ్లీలను పాన్ లో వేయాలి. తాలింపు మొత్తం ఇడ్లీలకు పట్టేలా నెమ్మదిగా టాస్ చేయాలి. చివరగా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లితే, గుమగుమలాడే గోలి ఇడ్లీ రెడీ.

[ of 5 - Users]
Story first published: Monday, December 15, 2025, 21:24 [IST]
Desktop Bottom Promotion