కరివేపాకు పొంగల్..అమృతం అంటే నమ్మండి!..చేసుకోవడం చాలా ఈజీ

Posted By:

సాధారణంగా కూరల్లో రుచికి, సువాసనకు మాత్రమే వాడతామని చాలామంది భావించే కరివేపాకుతో టేస్టీ పొంగల్ చేసుకోవచ్చని మీకు తెలుసా? కరివేపాకు పొంగల్ రుచిలో అమోఘంగా ఉండటమే కాకుండా పోషకాలతో నిండిన సంపూర్ణ ఆహారం. కరివేపాకు పొంగల్ ఎలా చేసుకోవాలో ఇక్కడ చూడండి.

కావలసిన పదార్థాలు
బియ్యం - 1 కప్పు
పెసరపప్పు - అర కప్పు
నీళ్లు - నాలుగున్నర కప్పులు
ఉప్పు - రుచికి సరిపడా
పసుపు - పావు టీస్పూన్
తాజా కరివేపాకు - 2 కప్పులు
మిరియాలు - 1 టీస్పూన్
జీలకర్ర - 1 టీస్పూన్
పచ్చిమిర్చి - 2
చింతపండు - చిన్న నిమ్మకాయంత
నెయ్యి లేదా నూనె - 1 టీస్పూన్
నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు
ఆవాలు - అర టీస్పూన్
జీలకర్ర - అర టీస్పూన్
మిరియాలు - అర టీస్పూన్
ఇంగువ - చిటికెడు
జీడిపప్పు - 10-12
అల్లం తురుము - 1 అంగుళం ముక్క

Pongal Reimagined The Nutrient Packed Karivepaku Pongal Recipe in Telugu

తయారీ విధానం

-ముందుగా బియ్యం, పెసరపప్పును శుభ్రంగా కడిగి కనీసం 20-30 నిమిషాల పాటు నానబెట్టాలి.

-ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టి అందులో టీస్పూన్ నెయ్యి వేసి వేడి చేశాక మిరియాలు, జీలకర్ర వేసి అవి చిటపటలాడే వరకు తక్కువ మంట మీద వేయించాలి.

-ఇప్పుడు అందులో బాగా కడిగి ఆరబెట్టిన కరివేపాకు, పచ్చిమిర్చి వేయాలి. కరివేపాకులోని తేమ పోయి, కొద్దిగా కరకరలాడే వరకు 2-3 నిమిషాల పాటు వేయించి స్టవ్ ఆపేసి ఈ మిశ్రమాన్ని చల్లారనివ్వాలి.

-ఇప్పుడు మిక్సీ గిన్నెలో దీనికి చింతపండు, కొద్దిగా ఉప్పు, అవసరమైతే రెండు టేబుల్ స్పూన్ల నీళ్లు కలిపి మెత్తని పేస్ట్‌ లా గ్రైండ్ చేసుకోవాలి.

-ఇప్పుడు ప్రెషర్ కుక్కర్‌ లో నానబెట్టిన బియ్యం, పెసరపప్పు,నాలుగున్నర కప్పుల నీళ్లు, పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపి మూత పెట్టి మీడియం మంట మీద 4-5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి.

-ఆవిరి పూర్తిగా పోయిన తర్వాత మూత తీయాలి. పొంగల్ మెత్తగా, జారుడుగా ఉండాలి. అవసరమైతే కొద్దిగా వేడి నీళ్లు కలిపి సర్దుబాటు చేసుకోవచ్చు.

-ఉడికిన పొంగల్‌ లో మనం ముందుగా సిద్ధం చేసుకున్న కరివేపాకు పేస్ట్‌ ను వేసి ఉండలు లేకుండా బాగా కలపాలి. ఈ దశలో పొంగల్ ముదురు ఆకుపచ్చ రంగులోకి మారుతుంది.

-ఇప్పుడు ఒక చిన్న పాన్‌ లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి కరిగాక, ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడనివ్వాలి. ఇప్పుడు జీడిపప్పు వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి. ఆ తర్వాత దంచిన మిరియాలు, అల్లం తురుము, ఇంగువ వేసి ఒక నిమిషం పాటు వేయించాలి.

-రెడీ అయిన తాలింపుని పొంగల్‌ లో వేసి కలిపి మూత పెట్టి ఒక రెండు నిమిషాల పాటు దమ్మవనివ్వాలి. దీనివల్ల నెయ్యి, తాలింపు సువాసనలు పొంగల్‌ కు బాగా పడతాయి.

-అంతే ఘుమఘుమలాడే, ఆరోగ్యకరమైన కరివేపాకు పొంగల్ రెడీ. కొబ్బరి పచ్చడితో కరివేపాకు పొంగల్ తింటుంటే ఆ అనుభూతి మాటల్లో వర్ణించలేరు.

[ of 5 - Users]
Desktop Bottom Promotion