రోటీ నుండి రైస్ వరకు.. అన్నింటికీ సెట్ అయ్యే ఆల్ రౌండర్..ఇలా క్యాప్సికమ్ గ్రేవీ వండితే లొట్టలేసుకుని తింటారు!

Posted By:

రోజూ అవే కూరలు, పచ్చళ్లు తిని విసుగొచ్చిందా? ఉరుకుల పరుగుల జీవితంలో వంట గదిలో గంటల తరబడి గడిపే సమయం దొరకడం లేదా? అయితే రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం అందించే అద్భుతమైన వంటకం క్యాప్సికమ్ గ్రేవీ. ఇది చాలా తక్కువ సమయంలోనే రెడీ చేసుకోవచ్చు. ఇది అన్నం, చపాతీ, పూరీ, దోశ.. ఇలా మీరు దేనితో తిన్నా అద్భుతంగా సరిపోతుంది.

వంకాయ లేదా బంగాళదుంపలతో చేసే సాధారణ గ్రేవీల కంటే ఇది చాలా భిన్నంగా ఉంటుంది. క్యాప్సికమ్‌ ను ఇలా వండటం వల్ల, అచ్చం రెస్టారెంట్లో దొరికే స్మోకీ ఫ్లేవర్ మీ ఇంట్లోనే ఆస్వాదించవచ్చు. పైగా ఇందులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి కాబట్టి ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. క్యాప్సికమ్ గ్రేవీ ఎలా తయారుయేసుకోవాలో ఇక్కడ చూడండి.

Restaurant Style Capsicum Gravy Healthy and Creamy Recipe in Telugu

కావలసిన పదార్థాలు

-క్యాప్సికమ్ ముక్కలు
-ఉల్లిపాయ
-టమాటో పేస్ట్
-అల్లంవెల్లుల్లి పేస్ట్
-కారం
-ధనియాల పొడి
-గరం మసాలా
-పసుపు
-నూనె
-సోంపు
-కసూరి మేతి
-పెరుగు
-ఉప్పు
-తాజా కొత్తిమీర

తయారీ విధానం

-ముందుగా స్టవ్ వెలిగించి ప్రెషర్ కుక్కర్ పెట్టుకుని తగినంత నూనె వేడి చేయండి. నూనె వేడెక్కాక అర టీస్పూన్ సోంపు, కొద్దిగా కసూరి మేతి వేసి వేయించాలి.

-ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి, అవి లేత బంగారు వర్ణంలోకి మారే వరకు రెండు నిమిషాల పాటు వేయించాలి. ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేలా వేపాలి.

-ఇందులో కొంచెం పెద్దగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలు, రుచికి సరిపడా ఉప్పు వేసి నాలుగు నిమిషాల పాటు నూనెలో మగ్గనివ్వాలి. ఇలా మగ్గడం వల్లే గ్రేవీకి చక్కటి ఆకృతి వస్తుంది.

-క్యాప్సికమ్ కొద్దిగా మెత్తబడ్డాక.. కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా వేసి మంటను సిమ్‌ లో పెట్టి మసాలాలు అడుగంటకుండా బాగా కలపాలి.

-ఇప్పుడు మిక్సీ పట్టిన టమాటో పేస్ట్ (4 టేబుల్ స్పూన్లు), గిలకొట్టిన పెరుగు (2 టేబుల్ స్పూన్లు) వేసి కలపాలి. పెరుగు వల్ల గ్రేవీకి హోటల్ స్టైల్ క్రీమీ టెక్స్చర్ వస్తుంది.

-చివరగా గ్రేవీకి తగినన్ని నీళ్లు పోసి, కుక్కర్ మూత పెట్టి పది నిమిషాలు ఉడికించండి. గ్రేవీ చిక్కబడి, నూనె పైకి తేలుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి, సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకుంటే వేడివేడి క్యాప్సికమ్ కర్రీ రెడీ.

-చపాతీ లేదా పూరీలతో ఈ గ్రేవీని తింటే ఆ మజాయే వేరు. అలాగే దోశలోకి రొటీన్ చట్నీలకు బదులుగా దీన్ని ట్రై చేయండి, భలే రుచిగా ఉంటుంది. ఇక మధ్యాహ్నం వేడివేడి అన్నంలో ఈ గ్రేవీ వేసుకుని, పైన కొద్దిగా నెయ్యి కలుపుకుని తింటే అమృతంలా ఉంటుంది.

[ of 5 - Users]
Story first published: Wednesday, February 25, 2026, 13:00 [IST]
Desktop Bottom Promotion