నోటికి ఏమీ రుచించట్లేదా? అయితే ఈ ఘాటైన వెల్లుల్లి చట్నీ ట్రై చేయండి!

Posted By:

ఇంట్లో ఎంత రుచికరమైన కూరలు ఉన్నా,ప్లేట్‌ లో కాస్త ఘాటైన చట్నీ ఉంటే ఆ భోజనానికి వచ్చే కిక్కే వేరు. నోటికి ఏదీ రుచించనప్పుడు లేదా జ్వరంగా ఉన్నప్పుడు కమ్మగా, ఘాటుగా ఏదైనా తినాలనిపిస్తే ముందుగా గుర్తొచ్చేది కారం వెల్లుల్లి చట్నీ.

దోశ,ఇడ్లీ,రోటీ, పరాఠా, వేడి వేడి అన్నం.. ఇలా దేనితో తిన్నా ఈ చట్నీ రుచి అమోఘంగా ఉంటుంది. మరి ఇంట్లో అందరూ లొట్టలేసుకుని తినే ఈ వెల్లుల్లి చట్నీని సులభంగా ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.

Spicy Garlic Chutney Recipe in Telugu Ultimate Side Dish for Dosa Idli and Rice Roti

స్పైసీ వెల్లుల్లి చట్నీ తయారీకి కావలసిన పదార్థాలు

తాజా వెల్లుల్లి రెబ్బలు: 200 గ్రాములు
పండిన టమాటో: 1
అల్లం ముక్క: 10 గ్రాములు
ఎండు మిరపకాయలు: 5
దాల్చిన చెక్క: చిన్న ముక్క
తాజా కొత్తిమీర ఆకులు: కొద్దిగా
ఆవ నూనె: 2 టేబుల్ స్పూన్లు
జీలకర్ర: 2 టీస్పూన్లు
మెంతులు: చిటికెడు
ధనియాల పొడి: 2 టేబుల్ స్పూన్లు
కశ్మీరీ ఎర్ర కారం: 3 టేబుల్ స్పూన్లు
వేయించిన జీలకర్ర పొడి: 1 టీస్పూన్
నిమ్మరసం: 1 టీస్పూన్
ఉప్పు: రుచికి సరిపడా
చక్కెర: చిటికెడు

స్పైసీ వెల్లుల్లి చట్నీ తయారీ విధానం

-ముందుగా వెల్లుల్లి రెబ్బల తొక్క తీసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఎండు మిరపకాయలను ఓ గిన్నెలో తీసుకుని, గోరువెచ్చని నీళ్లు పోసి 5 నుండి 10 నిమిషాల పాటు నానబెట్టాలి. ఇలా చేయడం వల్ల మిర్చి మెత్తబడి చట్నీకి మంచి ఆకృతి వస్తుంది.

-ఇప్పుడు ఒక మిక్సీ జార్ లో ముందుగా సిద్ధం చేసుకున్న వెల్లుల్లి రెబ్బలు, కట్ చేసిన టమాటా ముక్కలు, అల్లం, కొత్తిమీర, నానబెట్టిన ఎండు మిరపకాయలు, దాల్చినచెక్క, కొద్దిగా ఉప్పు, ఒక టీస్పూన్ నూనె, ఒక టీస్పూన్ జీలకర్ర వేసి మెత్తని పేస్ట్‌లాగా రుబ్బుకోవాలి. అవసరమైతే కొద్దిగా నీళ్లు చల్లవచ్చు.

-ఇప్పుడు స్టవ్ వెలిగించి, అడుగు మందంగా ఉన్న ఒక బాండీని పెట్టుకుని అందులో నూనె వేడి చేయాలి. నూనె వేడెక్కిన తర్వాత జీలకర్ర, చిటికెడు మెంతులు వేసి వేయించాలి. అవి వేగుతున్నప్పుడు మిక్సీ పట్టుకున్న వెల్లుల్లి పేస్ట్‌ ను అందులో వేసి బాగా కలపాలి. మంటను మీడియంలో ఉంచి, ఈ మిశ్రమాన్ని నెమ్మదిగా ఉడికించాలి.

-బాండీ అంచుల నుండి నూనె వేరుపడటం ప్రారంభమయ్యే వరకు వేయించాలి. ఆ తర్వాత అందులో ధనియాల పొడి, వేయించిన జీలకర్ర పొడి, కాశ్మీరీ కారం పొడి, రుచికి సరిపడా ఉప్పు, చిటికెడు పంచదార వేసి అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి.

-మసాలాలన్నీ పచ్చివాసన పోయి చక్కగా వేగిన తర్వాత స్టవ్ ఆపేయాలి. చివరగా అందులో ఒక టీస్పూన్ నిమ్మరసం పిండి, బాగా కలిపి పాత్రపై మూత పెట్టాలి.

-అంతే నోరూరించే ఘుమఘుమలాడే కారం వెల్లుల్లి చట్నీ రెడీ. దీనిని తయారు చేసిన అరగంట తర్వాత వడ్డిస్తే మసాలాల రుచులన్నీ చట్నీకి బాగా పడతాయి.

[ of 5 - Users]
Story first published: Wednesday, April 1, 2026, 21:17 [IST]
Desktop Bottom Promotion