రెస్టారెంట్ స్టైల్ చికెన్ నూడిల్ సూప్.. ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి

Posted By:

చలికాలం వచ్చిందంటే చాలు..చల్లటి గాలులతో పాటు జలుబు, దగ్గు, జ్వరం వంటి అనారోగ్య సమస్యలు కూడా మన తలుపు తడతాయి. ఈ వాతావరణంలో రోగనిరోధక శక్తి తగ్గిపోవడం, శరీరం నిస్సత్తువగా అనిపించడం, నోటికి రుచి తెలియకపోవడం చాలా సహజం. ఇలాంటి సమయంలో ఘాటుగా, వేడివేడిగా ఏదైనా తాగాలనిపిస్తుంటే బెస్ట్ ఆప్షన్ చికెన్ నూడిల్ సూప్.

ఇది కేవలం ఆకలిని తీర్చడమే కాదు, వణుకుతున్న శరీరానికి వెచ్చదనాన్ని ఇచ్చే ఒక దివ్యౌషధం. ఇందులో ఉండే పోషకాలు, మసాలా దినుసులు గొంతు నొప్పికి, జలుబుకి తక్షణ ఉపశమనాన్ని కలిగిస్తాయి. రెస్టారెంట్ స్టైల్‌లో రుచికరమైన, ఆరోగ్యకరమైన చికెన్ నూడిల్ సూప్‌ ను ఇంట్లోనే సులభంగా ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.

Step by Step Guide to Making the Best Chicken Noodle Soup for Winter

కావలసిన పదార్థాలు
-చికెన్
-నూడుల్స్
-ఉల్లిపాయ
-క్యారెట్
-క్యాబేజీ
-బీన్స్
-అల్లం
-వెల్లుల్లి
-మిరియాల పొడి
-ఉప్పు
-సోయా సాస్
-వెనిగర్
-నూనె లేదా వెన్న
-స్ప్రింగ్ ఆనియన్స్ (పచ్చి ఉల్లికాడలు)

తయారీ విధానం

-ముందుగా ఒక కుక్కర్ లేదా మందపాటి గిన్నెలో చికెన్, కొద్దిగా ఉప్పు, దంచిన అల్లం వేసి, ముక్కలు మునిగేలా పుష్కలంగా నీళ్లు పోయాలి. చికెన్ మెత్తగా ఉడికేవరకు ఉడికించుకోవాలి. ఆ తర్వాత చికెన్ ముక్కలను వేరు చేసి, చిన్న చిన్న ముక్కలుగా విడదీసి పక్కన పెట్టుకోవాలి.

-చికెన్ ఉడికించిన నీటిని వడకట్టి పక్కన ఉంచుకోవాలి.

-ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక పాన్‌ పెట్టి అందులో వెన్న లేదా నూనె వేడి చేయాలి. అందులో సన్నగా తరిగిన వెల్లుల్లి, ఉల్లిపాయ ముక్కలు వేసి బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి.

-ఇప్పుడు అందులో క్యారెట్, క్యాబేజీ, బీన్స్ ముక్కలు వేసి అధిక మంటపై 2-3 నిమిషాలు వేయించాలి. కూరగాయలు మరీ మెత్తగా కాకుండా, కొంచెం కరకరలాడుతూ ఉంటేనే సూప్‌ లో తినేటప్పుడు రుచిగా ఉంటాయి

-వేయించిన కూరగాయలలో ముందుగా పక్కన ఉంచిన చికెన్ నీరు పోయాలి. నీరు మరుగుతుండగా, విడదీసిన చికెన్ ముక్కలు, నూడుల్స్ వేయాలి. నూడుల్స్ మెత్తబడే వరకు సన్నని మంటపై ఉడికించాలి.

-చివరగా రుచికి సరిపడా ఉప్పు, ఘాటు కోసం మిరియాల పొడి, సోయా సాస్, వెనిగర్ వేసి బాగా కలపాలి. మరో రెండు నిమిషాలు మరిగించి స్టవ్ ఆఫ్ చేయాలి.

-మీకు సూప్ చిక్కగా కావాలంటే ఒక చిన్న గిన్నెలో చెంచా కార్న్‌ఫ్లోర్‌ను నీటిలో కలిపి, సూప్ దించే ముందు అందులో పోసి ఒక నిమిషం మరిగించండి.

-అంతే వేడి వేడి చికెన్ నూడిల్ సూప్ రెడీ. దీనిపై సన్నగా తరిగిన పచ్చి ఉల్లికాడలుచల్లుకుని, వేడిగా సర్వ్ చేసుకోండి. ఈ శీతాకాలంలో జలుబును తరిమికొట్టడానికి ఇంతకంటే మంచి ఔషధం మరొకటి లేదు.

[ of 5 - Users]
Story first published: Sunday, December 21, 2025, 17:04 [IST]
Desktop Bottom Promotion