మీరెప్పుడూ రుచి చూడని మటన్ గ్రేవీ..మాంసం కూరంటే నచ్చనివారు కూడా దీనికి ఫిదా!..ఎలా చేసుకోవాలంటే

Posted By:

సండే వచ్చిందంటే చాలు చాలా ఇళ్లలో ఘుమఘుమలాడే మాంసం కూర ఉండాల్సిందే. ముఖ్యంగా మటన్ అయితే ఆ రోజుకి ఓ ప్రత్యేకతే వేరు. అయితే ప్రతిసారీ అదే రొటీన్ పులుసు, అదే మసాలాతో బోర్ కొడుతోందా? మీ ఇంట్లో వాళ్ళు కూడా మళ్ళీ ఇదేనా? అని అంటున్నారా? అయితే ఈసారి కొత్త పద్ధతిలో మటన్ గ్రేవీని ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఈ గ్రేవీ రుచి చూస్తే కేవలం మీ కుటుంబ సభ్యులే కాదు, మీరు కూడా ఫిదా అయిపోతారు.

దూదిలా మెత్తగా ఉడికిన మటన్ ముక్కలు, నోట్లో కరిగిపోయే మసాలా గ్రేవీతో.. వేడివేడి అన్నంలో కలుపుకుని తింటుంటే ఉంటుంది అబ్బా ఆ స్వర్గం మాటల్లో వర్ణించలేం. ఇది కేవలం అన్నంలోకే కాదు, ఇడ్లీ, దోశ, చపాతీ, పులావ్‌ లలోకి కూడా అద్భుతంగా ఉంటుంది. ఒక్కసారి ఈ స్టైల్‌లో చేసిపెట్టారంటే ఇకపై ఎప్పుడు మటన్ వండినా ఇలాగే చేయమని పదేపదే అడుగుతారు. అంత రుచిగా, అంత ప్రత్యేకంగా ఉంటుంది ఈ వంటకం. అమోఘమైన మటన్ గ్రేవీ ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

The Ultimate Mutton Gravy A Taste You Won t Forget Recipe in Telugu

కావలసిన పదార్థాలు
మసాలా పేస్ట్ కోసం:
-నూనె- ఒకటిన్నర టేబుల్ స్పూన్
-దాల్చినచెక్క - 1 అంగుళం ముక్క
-లవంగాలు - 4
-యాలకులు - 2
-అనాసపువ్వు - సగం
-సోంపు - 1 టీస్పూన్
-మిరియాలు - అర టీస్పూన్
-గసగసాలు - 1 టీస్పూన్
-సాంబార్ ఉల్లిపాయలు - 25
-టమాటాలు - 2
-జీడిపప్పు - 6
-ఉప్పు - చిటికెడు
గ్రేవీ తయారీకి:
-నూనె - 2 టీస్పూన్లు
-బిర్యానీ ఆకు - 1
-రాతి పువ్వు - చిన్న ముక్క
-మటన్ - 1 కిలో
-పసుపు - పావు టీస్పూన్
-కారం - 1 టేబుల్ స్పూన్
-ధనియాల పొడి - ఒకటిన్నర టేబుల్ స్పూన్లు
-అల్లం వెల్లుల్లి పేస్ట్ - ఒకటిన్న టీస్పూన్లు
-గట్టి పెరుగు - 1 టేబుల్ స్పూన్
-గరం మసాలా - 1 టీస్పూన్
-బంగాళాదుంప - 1
-ఉప్పు - రుచికి సరిపడా
-నీళ్లు - అవసరమైనంత
తాళింపు కోసం:
-కొబ్బరి నూనె - 1 టేబుల్ స్పూన్
-కరివేపాకు - రెండు రెమ్మలు
-తరిగిన కొత్తిమీర - కొద్దిగా

The Ultimate Mutton Gravy A Taste You Won t Forget Recipe in Telugu

తయారీ విధానం

-ముందుగా మసాలా పేస్ట్ కోసం స్టవ్ మీద పాన్ పెట్టి అందులో నూనె వేయండి. నూనె వేడయ్యాక దాల్చినచెక్క, లవంగాలు, యాలకులు, అనాసపువ్వు, సోంపు, మిరియాలు, గసగసాలు వేసి మంచి సువాసన వచ్చేవరకు దోరగా వేయించండి.

-ఇప్పుడు చిన్న ఉల్లిపాయలు వేసి అవి బంగారు రంగులోకి మారే వరకు వేపాలి. ఆ తర్వాత తరిగిన టమాటాలు, చిటికెడు ఉప్పు వేసి, టమాటాలు మెత్తగా మగ్గిపోయే వరకు ఉడికించాలి. చివరగా జీడిపప్పు వేసి ఒక్క నిమిషం వేయించి, స్టవ్ ఆపేయండి. ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి.

-చల్లారిన తర్వాత మిక్సీ జార్‌ లో వేసి, అవసరమైతే కొద్దిగా నీళ్లు పోసి మెత్తని పేస్ట్‌ లా గ్రైండ్ పక్కన పెట్టుకోండి.

-ఇప్పుడు స్టవ్ మీద ప్రెషర్ కుక్కర్ పెట్టి, కొబ్బరి నూనె వేసి వేడిచేయాలి. బిర్యానీ ఆకు, రాతి పువ్వు వేసి చిటపటలాడనివ్వాలి. ఆ తర్వాత శుభ్రం చేసుకున్న మటన్ ముక్కలు వేసి, రెండు నిమిషాల పాటు పెద్ద మంటపై వేయించాలి.

-ఇప్పుడు పసుపు, కారం, ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు వేసి బాగా కలపాలి. మసాలాలన్నీ మటన్‌ కు బాగా పట్టేలా 5 నిమిషాలు మీడియం మంటపై వేయించాలి.

-ఆ తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న మసాలా పేస్ట్‌ ను అందులో వేసి పచ్చి వాసన పోయే దాకా 3-4 నిమిషాలు బాగా కలపాలి.

-ఇప్పుడు గ్రేవీకి కావలసినన్ని నీళ్లు పోసి, ఒకసారి మరిగిన తర్వాత గరం మసాలా కలపండి. ఇష్టమైతే ఈ దశలో తరిగిన బంగాళాదుంప ముక్కలు కూడా వేసుకోవచ్చు.

-కుక్కర్ మూత పెట్టి మీడియం మంటపై 5 విజిల్స్ రానివ్వండి. ఆవిరి మొత్తం పోయిన తర్వాత మూత తీయండి.

-ఇప్పుడు కుక్కర్‌ను మళ్ళీ స్టవ్ మీద పెట్టి, గ్రేవీని రెండు నిమిషాలు చిన్న మంటపై మరిగించండి. చివరగా చిన్న పాన్‌ లో నూనె వేడి చేసి, కరివేపాకు వేసి వేయించి, ఆ తాళింపును గ్రేవీలో కలపండి. పైన కొత్తిమీర చల్లితే, గుమగుమలాడే, రుచికరమైన మటన్ గ్రేవీ రెడీ.

[ of 5 - Users]
Story first published: Sunday, August 31, 2025, 10:18 [IST]
Desktop Bottom Promotion