కరలాడే టమాటా మురుకులు.. ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు!

Posted By:

సాధారణంగా స్నాక్స్ అనగానే అందరికీ ఇష్టమైనవి క్రంచీగా ఉండే చక్లీలే. ఇప్పుడు మార్కెట్లో ఎన్నో రకాల ఫ్లేవర్లలో చక్లీలు దొరుకుతున్నాయి. కానీ ఎప్పుడూ ఒకే రకమైన చక్లీ తిని బోరు కొట్టిందా? అయితే కొంచెం వెరైటీగా, ఎంతో రుచికరంగా ఉండే టమాటా చక్లీని(టమాటో మురుకు) ఎప్పుడైనా ట్రై చేశారా?

టమాటాల పులుపు, ఎండుమిర్చి కారం కలగలిసిన చక్లీ రుచి అద్భుతంగా ఉంటుంది. దీన్ని తయారు చేయడం కూడా చాలా సులభం. కరకరలాడే టమాటా చక్లీని ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.

Tomato Chakli Recipe in Telugu Quick and Easy Snack Tomato Murukku at Home

టమాటా చక్లీ తయారీకి కావలసిన పదార్థాలు

బియ్యం పిండి - 3 కప్పులు
శనగ పిండి - అర కప్పు
ఎర్రటి టమాటాలు - 3 (మీడియం సైజు)
ఎండు మిర్చి - మీ కారానికి తగినన్ని
జీలకర్ర - 1 టీస్పూన్
వాము - అర టీస్పూన్
ఇంగువ - చిటికెడు
తెల్ల నువ్వులు - 2 టీస్పూన్లు
కరిగించిన వెన్న - 2 టేబుల్ స్పూన్లు
ఉప్పు - రుచికి సరిపడా
నూనె - డీప్ ఫ్రైకి సరిపడా

టమాటా చక్లీ తయారు చేసే విధానం

-ముందుగా టమాటాలను కడిగి, మధ్యలోకి 4 భాగాలుగా కట్ చేసుకోవాలి. ఒక కుక్కర్ తీసుకుని అందులో కట్ చేసిన టమాటాలు, ఎండు మిర్చి,కొద్దిగా నీళ్లు పోసి మూతపెట్టాలి. మీడియం మంట మీద 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి.

-ఉడికిన టమాటాలను ఒక ప్లేట్‌లోకి తీసుకుని చల్లారనివ్వాలి. చల్లారాక పైనున్న తొక్కను తీసేయాలి. ఇప్పుడు టమాటాలు, ఎండుమిర్చిని మిక్సీ జార్‌ లో వేసి నీళ్లు కలపకుండా మెత్తని పేస్ట్‌ లా రుబ్బుకోవాలి.

-ఒక వెడల్పాటి ప్లేట్ తీసుకుని, అందులో బియ్యం పిండి, శనగ పిండి వేసుకోవాలి. ఇందులో వాము, జీలకర్ర, తెల్ల నువ్వులు, ఇంగువ, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపాలి. కరకరలాడటం కోసం కరిగించిన వెన్నను వేసి పిండిని చేతితో బాగా మిక్స్ చేయాలి. పిండిని చేతితో పట్టుకుంటే ముద్దలా అయ్యేంత సాఫ్ట్‌ గా ఉండాలి.

-ఇప్పుడు ముందుగా మిక్సీ పట్టుకున్న టమాటా పేస్ట్‌ను ఒక జల్లెడ సహాయంతో వడకట్టి ఆ పిండిలో వేసుకోవాలి. టమాటాలు ఉడికించిన నీటిని కూడా కొద్దికొద్దిగా పోస్తూ పిండిని మృదువుగా కలుపుకోవాలి. ఈ పిండి చపాతీ పిండి కంటే కొంచెం సాఫ్ట్ గా ఉండాలి.

-స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి సరిపడా నూనె పెట్టి వేడి చేయాలి. చక్లీల అచ్చు తీసుకుని, అందులో ఈ పిండిని పెట్టుకోవాలి. నూనె కాగిన తర్వాత, మంటను మీడియం ఫ్లేమ్‌ లో ఉంచి, పిండిని నేరుగా నూనెలో లేదా ఒక ప్లేట్ మీద ఒత్తుకుని నెమ్మదిగా నూనెలో వేసుకోవాలి. రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చి, కరకరలాడే వరకు వేయించి తీసుకోవాలి.

-అంతే ఎంతో రుచికరమైన టమాటా చక్లీ రెడీ. పూర్తిగా చల్లారాక గాలి చొరబడని డబ్బాలో నిల్వ చేసుకుంటే పదిహేను రోజుల వరకు ఫ్రెష్‌ గా ఉంటాయి

[ of 5 - Users]
Story first published: Sunday, March 8, 2026, 17:33 [IST]
Desktop Bottom Promotion