For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వీగిపోతున్న వివాహ బంధాలు.. పెరిగిపోతున్న వివాహేతర సంబంధాలు..

|

మన దేశంలో పురాణాల కాలం నాటి నుండి నేటి వరకు కుటుంబ వ్యవస్థకు మూలం ఏదైనా ఉందంటే అది పెళ్లి.. అందుకే పెళ్లి అంటే అందరూ నూరేళ్ల పంట అన్నారు. భారతదేశ వివాహ బంధాన్ని చూసి ప్రపంచమే ఆశ్చర్యపోతుంది. అంతటి గొప్ప ప్రాధాన్యత ఉన్న వివాహ బంధానికి ప్రస్తుత తరం యువతీ యువకులు వీడ్కోలు చెప్పేస్తున్నారు. పెద్దలు కుదర్చిన పెళ్లి అయినా, ప్రేమించి పెళ్లి చేసుకున్నా వారి బంధం ఎక్కువ రోజులు సాగటం లేదు.

అనేక మందికి సంబంధంలో ఏవేవో సమస్యలు ఏర్పడటం వల్ల వారి బంధం మున్నాళ్ల ముచ్చటగా మారిపోతోంది. దీంతో కాలానికి అనుగుణంగా, పరిస్థితులకు తగ్గట్టుగా మన భారతీయ వివాహ వ్యవస్థకు కూడా అనేక ఆటుపోట్లు ఎదురవుతున్నాయి. వివాహం విషయంలో ఒకప్పుడు ప్రపంచం మనల్ని ఆదర్శంగా తీసుకుని, ఈ పద్ధతినే అనుసరించాలి అనుకుంటే, ప్రస్తుతం మన జనరేషన్ వారు వారి వైపు వడివడిగా అడుగులు వేస్తోంది. వివాహ బంధంలో ఒకరినొకరు అర్థం చేసుకోకుండా, అవగాహన లోపంతోనో, విపరీతమైన ఇగోతోనో, ఒకరిపై ఒకరు డామినేట్ చేసుకుంటూ చిన్న చిన్న కారణాలకే కోర్టు దాకా వెళ్తున్నారు. పచ్చని కాపురాలను చేతులారా కూల్చుకుంటున్నారు. ఇటీవల ఈ ట్రెండ్ మరింత ఎక్కువైందని చెప్పొచ్చు. ఎందుకంటే సెలబ్రిటీలు, సినిమా హీరోలు మరియు హీరోయిన్లు తమ వివాహ బంధానికి వీడ్కోలు చెబుతున్నట్లు బహిరంగంగా చెప్పేస్తున్నారు లేదా సోషల్ మీడియా ద్వారా అందరితో షేర్ చేసుకుంటున్నారు.

లక్షల సంఖ్యలో విడిపోతున్న జంటలు...

లక్షల సంఖ్యలో విడిపోతున్న జంటలు...

మన దేశంలో విడాకుల గురించి ఓ సర్వే జరిగింది. ఈ సర్వే ప్రకారం ఆశ్చర్యకరమైన వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ప్రతి సంవత్సరం మన భారతదేశంలో 13 లక్షల మందికి పైగా విడిపోతున్నారట. ఈ సర్వే ద్వారా తెలిసిన మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఇలా విడిపోయేందుకు మహిళలే ఎక్కువ ఆసక్తి చూపుతున్నారట. అందుకే ఇలాంటి విషయాల్లో మహిళల సంఖ్య అధికంగా ఉంటోందట. ఈశాన్య రాష్ట్రాల్లో విడిపోయే వారి సంఖ్య భారీగా ఉందని ఆ సర్వే ద్వారా తెలిసింది. మిజోరం వంటి ప్రాంతాల్లో ఎక్కువ మంది విడాకులు తీసుకుని విడిగా ఉంటున్నారట. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే కులాంతర వివాహాలు అక్కడే ఎక్కువగా జరుగుతున్నాయంట.

ఆధిపత్యమే అసలు కారణం..!

ఆధిపత్యమే అసలు కారణం..!

వివాహం చేసుకున్న జంటల మధ్య తమ మాటే నెగ్గాలని, తామే ఆధిపత్యం చెలాయించాలని పట్టుదలకు పోవడంతో సమస్యలు మొదలవుతున్నాయి. కొందరు పురుషులు తమ భార్య ఉద్యోగం చేయకూడదని భావిస్తారు. మరికొందరు భార్య ఉద్యోగం చేసినా తమ కనుసన్నల్లోనే నడుచుకోవాలని ఆశిస్తారు. తాము చెప్పిన దానికి ఎదురు ప్రశ్నించకూడదని భావిస్తారు. అయితే చాలా మంది మహిళలు కూడా ఇలాంటి ధోరణినే కనబరడంతో గొడవలు మొదలై విడిపోవడానికి దారి తీస్తోంది. కానీ ఇలాంటి విషయాల పట్ల సర్దుకుపోయేతత్వం ఉంటే ఇలా సమస్యలే రావని మానసిక నిపుణులు చెబుతున్నారు.

అవగాహన పెరగడానికి సమయం..

అవగాహన పెరగడానికి సమయం..

నూతన వధూవరులకు వారి మధ్య అవగాహన పెరగడానికి కొంత సమయం పడుతుంది. అంతవరకు వారు ఎదుటి వారి వ్యక్తిత్వాన్ని గౌరవించడం, సర్దుకుపోయేతత్వాన్ని అలవరచుకోవడం జరిగితే ఎలాంటి తగాదాలు అనేవే ఉండవు. కానీ నూతన ఆలుమగల మధ్య అవగాహన పెరగాలంటే సమన్వయంతో మెలగడం అనేది చాలా అవసరం.

ఇతరులతో పోల్చుకోవడం..

ఇతరులతో పోల్చుకోవడం..

చాలా మంది జంటలు చేసే అతిపెద్ద పొరపాటు. దీనికి సంబంధించి మన తెలుగులో ఓ సామెత కూడా ఉంది. ‘పొరుగింటి పుల్లకూరకు రుచి ఎక్కువ‘ అన్న చందాన అనేక మంది తమ జీవిత భాగస్వామిని పోల్చి చూసుకుంటారు. తాము ఆశించినట్టు తమ భర్త లేడనో, సంసార సుఖం విషయం గురించి పట్టించుకోవడం లేదని వంటి కారణాలతో తమను తాము బలహీనం చేసుకుంటున్నారు. ఈ కారణాల వల్లే వివాహేతర సంబంధాల ఉచ్చులో పడిపోతున్నారు. ఇటీవల కాలంలో ఈ విషయం బయటపడి అనేకమంది కాపురాలు కూలిపోయాయి. కూలిపోతున్నాయి. వివాహేతర సంబంధాలు విభేదాలకు కారణమై చివరికి విడాకుల వరకు వెళ్తున్నాయి.

చిన్న చిన్న విషయాలకే..

చిన్న చిన్న విషయాలకే..

కాపురం అన్నాక చిన్న చిన్న అలకలు, గొడవలు అత్యంత సహజం. మన దేశంలో పురాణాల నాటి నుండి నేటి వరకు పెళ్లి అంటే పవిత్రమైన బంధమే కాదు. బలమైన సంబంధం. కోట్ల, లక్షలు, వేలాది రూపాయలు ఖర్చు చేసి ఎంతో ఆర్భాటంగా పెళ్లి చేస్తే.. పచ్చని పెళ్లి పందిరి తోరణాలు ఆరకముందే చాలా కోర్టు మెట్లు ఎక్కేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుత జనరేషన్ లో ఓర్పు, సహనం వంటివి కరువవ్వడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.

తమ కాళ్లపై తాము నిలబడతామన్న ధీమా..

తమ కాళ్లపై తాము నిలబడతామన్న ధీమా..

వివాహ బంధానికి ప్రస్తుత జనరేషన్ ఎందుకు విలువ ఇవ్వడం లేదంటే చాలా మంది తమకు ఏ తోడు లేకపోయినా తమ కాళ్లపై తాము నిలబడతామన్న ధీమా, ధైర్యం పెరగడమే. దీంతో వీరు వివాహ బంధానికి విలువ అనేదే ఇవ్వడం లేదు. ప్రతి చిన్న విషయాన్నీ భూతద్దంలో చూడటం పరిపాటిగా మారిపోయింది. అంతేకాకుండా ఈ తరం వారు స్వేచ్ఛ, సౌకర్యాలు, విలాసవంతం వంటివి ఎక్కువగా కోరుకుంటున్నారు. వీటిలో ఏ చిన్నదానికి భంగం కలిగినా తట్టుకోలేకపోతున్నారు. వెంటనే తాము కలసి ఉండటం కంటే విడిపోవడమే మేలు అనే నిర్ణయానికి వచ్చేస్తున్నారు.

సమాజం పట్ల భయం పోవడం..

సమాజం పట్ల భయం పోవడం..

ఒకప్పుడు విడాకులు తీసుకుంటే సమాజంలో చిన్నచూపు చూస్తారనే భయం ఉండేది. ప్రస్తుత సమాజంలో అలాంటి భయం అనేది పూర్తిగా పోయినట్టు కనిపిస్తుంది. విడాకులు తీసుకున్న వారిని సమాజం కూడా అంగీకరిస్తోంది. దంపతుల మధ్య సఖ్యత కుదరనప్పుడు కలిసి ఉండాల్సిన అవసరం లేదు అనే భావన తల్లిదండ్రులకూ పాకింది. దీంతో కూతురికి సర్ది చెప్పి అత్త వారింటికి పంపాల్సిన తల్లిదండ్రుల సంఖ్య కూడా తగ్గిపోయింది.

ఇష్టం లేని పెళ్లి వల్ల..

ఇష్టం లేని పెళ్లి వల్ల..

ఈ కాలంలో పెద్దలు కుదిర్చిన పెళ్లిళ్లలో ఏదో ఒక అవగాహన లోపం ఉంటోంది. పెద్దలు తమ పిల్లల ఇష్టాయిష్టాలను పట్టించుకోకుండా పెళ్లి చేస్తున్నారు. ఇంకా కొంత మంది పెద్దలు తమ పిల్లలకు 18 ఏళ్ల వయస్సు లోపే పెళ్లి చేసేస్తున్నారు. దీని వల్ల వారి మానసిక స్థితిపై తీవ్ర ప్రభావం పడుతోంది. అలాగే ఇద్దరిలో ఎవరైనా కాపురానికి పనికి రాడని తెలుసుకోవడం వల్ల వెంటనే విడిపోవడానికి ఇష్టపడుతున్నారు.

ఆర్థిక బంధంగా..

ఆర్థిక బంధంగా..

ప్రస్తుత తరం వారు పెళ్లి అనే పవిత్ర బంధాన్ని ఆర్థిక బంధంగా మార్చేస్తున్నారు. ఇందులోనూ ఉన్నత చదువులు చదువుకున్న వారి అధికంగా ఉండటం కారణం. ఆలుమగలు చదువుకుని ఉద్యోగాలు చేస్తున్న యువతుల్లో ఆర్థికంగా పురుషుడి మీద ఆధారపడాల్సిన పరిస్థితి లేకపోవడంతో వారి సంబంధంలో ఏ మాత్రం తేడాలు వచ్చినా వెంటనే విడిపోయేందుకు సిద్ధమవుతున్నారు.

ఎన్నో కారణాలు..

ఎన్నో కారణాలు..

పెళ్లికి ముందు.. తర్వాత వారి కుటుంబ నేపథ్యం, వారి వ్యక్తిత్వం, ఉద్యోగ కారణాలు, అత్తగారింట్లో వివాదాలు, ఆర్థిక విషయాలు, అనుమానం, తాగుడు, శృంగార సంబంధిత కారణాలతో చాలా మంది విడిపోతున్నారు. వీరందరికీ ఉమ్మడి కుటుంబాలు లేక ఈ బంధం విలువలు తెలియడం లేదు.

దంపతులు విడిపోకూడదంటే..

దంపతులు విడిపోకూడదంటే..

పెళ్లి చేసుకున్న వారు ఎప్పటికీ విడిపోకూడదంటే వారి మధ్య ఎలాంటి దాపరికం ఉండకూడదు. తమ భాగస్వామి కోసం తమ అలవాట్లు, ఇష్టాలు మార్చుకోవాల్సిన అవసరం లేదని కూడా గుర్తించాలి. ఏవైనా సమస్యలు ఎదురైతే వాటిని ధైర్యవంతంగా ఎదుర్కొని పరిష్కారం కనుగొనేందుకు ఇద్దరు కృషి చేయాలి. ఒకవేళ సమస్య పెద్దదిగా ఉంటే కౌన్సెలింగ్ ద్వారా పరిష్కరించుకోవాలి. అందుకే పెళ్లికి ముందే (ప్రీ మెరిటల్) కౌన్సెలింగ్ వల్ల భవిష్యత్తు, బంధం, వివాహం, విలువ వంటి వాటితో జీవిత భాగస్వామిని అర్థం చేసుకోవడం వంటి విషయాలపై అవగాహన కలగొచ్చు. దీని ద్వారా ప్రయోజనం ఉండొచ్చు అని మానసిక నిపుణులు చెబుతున్నారు.

English summary

Couples who are going to take through divorce for minor reasons

Here we talking Couples who are going to take divorce for minor reasons. Read on