For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మోహినీ ఏకాదశి -26 ఏప్రిల్

|

విష్ణువు, తన స్త్రీ అవతారమైన మోహినీ రూపాన్ని ధరించిన రోజును పురస్కరించుకుని ఈ మోహినీ ఏకాదశిని హిందువులు జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం వైశాఖ మాసం శుక్ల పక్షాన, 11వ రోజున ఈ పండుగ జరుపబడుతుంది. తద్వారా గ్రెగోరియన్ కాలండర్ ప్రకారం ఈ నెల 26 వ తేదీన మోహినీ ఏకాదశి రానుంది.

ఈరోజు ఉపవాసం ఉండడం అత్యంత ముఖ్యమైన చర్యగా పెద్దలు సూచిస్తుంటారు . రోజంతా నిష్ఠతో దేవుని భక్తి శ్రద్దలతో పూజించి ఉపవాసం ఉండడం ద్వారా ఆర్ధిక నష్టాలకు స్వస్తి పలికి ఆరోగ్యకర, లాభదాయక జీవనానికి మార్గం సుగమం అవుతుందని భక్తుల ప్రఘాడ నమ్మకం. ఈ సంవత్సరం రానున్న మోహినీ ఏకాదశి విష్ణువుకు కేటాయించిన గురువారం నాడే వస్తుండడం వలన ప్రాముఖ్యత సంతరించుకుంది. ఈరోజు విష్ణు దేవాలయాలు అన్నీ భక్తులతో కళకళలాడుతూ యజ్ఞ యాగాలతో పూజా పునస్కారాలతో నూతన వైభోగాన్ని సంతరించుకుంటాయి. కేవలం విష్ణు దేవాలయాలే కాకుండా, విష్ణువు దశావతారాలకు సంబంధించిన దేవాలయాల్లో కూడా ఈ పండుగ ప్రత్యేకంగా జరుపబడుతుంది.

Mohini Ekadashi - 26th April

వ్రత విధివిధానాలు :

అన్ని పండుగల వలె ఉపవాసం పండుగ రోజున సూర్యోదయంతో ప్రారంభమవదు. మోహినీ ఏకాదశి ముందురోజు దశమి నాడు సూర్యాస్తమయం నుండి ఉపవాస దీక్ష ప్రారంభమవుతుంది. ఆఖరికి నిద్రకు కూడా శుభ్రపరచిన నేల మీదునే పవళించవలసి ఉంటుంది. బ్రహ్మ ముహూర్తానే నిద్రలేచి అభ్యంగనం ఆచరించిన పిదప, దేవుని పూజకు ఉపక్రమించవలసి ఉంటుంది. సూర్యోదయానికి ముందు సమయం (ఉదయం 4 నుండి 6 గంటల వరకు మోస్తరుగా) బ్రహ్మ ముహూర్తంగా పిలవబడుతుంది. ఈ సమయాన చేసే అభ్యంగన స్నానం హిందువుల పండుగలలో అత్యంత వైసిష్టాన్ని కలిగి ఉంటుంది. నిజానికి ఈ సమయాలలో చేయు అభ్యాస పఠనం ద్వారా ఎక్కువ ఫలితాలను పొందవచ్చని కూడా పెద్దలు సూచిస్తుంటారు.

ఉపవాస దీక్షలో భాగంగా భక్తులు, రోజంతా ఎటువంటి ఆహార పదార్ధాలను తీసుకోకుండా ఉండవలసి వస్తుంది. మరుసటి రోజు ద్వాదశి నాడు సూర్యోదయం తర్వాత పాలను సేవించడం ద్వారా ఉపవాస దీక్షను విరమించవచ్చు. అనగా దశమి సాయంత్రం నుండి ద్వాదశి సూర్యోదయం వరకు ఉపవాస దీక్షను చేయవలసి ఉంటుంది. ఏకాదశి రోజున అనగా పండుగ రోజున ధాన్యాలు, ముఖ్యంగా బియ్యం తీసుకోకూడదు అని సూచించబడినది.

ఇలా ఎక్కువ సేపు ఉపవాస దీక్ష చేయలేని వారు, రోజులో ఒకసారి ఏదైనా పండును స్వీకరించవచ్చు అని పెద్దలు సూచిస్తుంటారు. ఉపవాసం ఆరోగ్య ప్రణాళికలో భాగంగా మరియు దైవకార్యానికి కేటాయించబడినది . ఆరోగ్యం సరిగ్గా లేని వారు, వయసు పైబడిన వారు ఉపవాస దీక్షలలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవడం లేదా విరమించుకోవడమే అన్ని విధాలా శ్రేయస్కరం. మధుమేహ వ్యాధిగ్రస్తులు, జీర్ణ సంబంధ సమస్యలు మొదలైనవి ఉన్నవారు ఉపవాసాల విషయంలో మెళకువలు తీసుకోవడమే మంచిది.

ఉపవాస దీక్ష చేయు వ్యక్తి కాని, లేదా వ్యక్తి కుటుంబం కానీ రాత్రి వేళ జాగరణతో దైవ ప్రార్ధనలు చేయడం ద్వారా, ఆ దేవుని కృపకు పాత్రులవగలరని భక్తుల విశ్వాసం. ముఖ్యంగా కుటుంబమంతా కలిసి జాగరణ చేయడo ద్వారా ఎక్కువ పూజా ఫలాన్ని పొందవచ్చు. తద్వారా అనేకులు జాగరణకు సిద్దమవుతూ ఉంటారు. ముఖ్యంగా ఏకాదశి మరియు ద్వాదశి మద్య రాత్రి సమయంలో జాగరణ సూచించబడినది.

దాన ధర్మాలు చేయకుండా ఏకాదశి వ్రతం పూర్తి కాదు. కావున పేదలకు లేదా అవసరమైన వారికి దాన ధర్మాలు చేయడం విధిగా సూచించబడినది. తద్వారా అన్నదానాలు, గోవుల పంపిణీ, నిత్యావసర వస్తువుల పంపిణీ వంటివి చేయడం ద్వారా ఉపవాస దీక్షను విరమించవచ్చు.

పూజా విధివిధానాలు :

ఇంటిని శుభ్రపరచుకున్నాక, బ్రహ్మ ముహూర్తాన అభ్యంగన స్నానమాచరించి విష్ణువు ప్రతిమను సిద్దపరచుకుని, పూజకు కేటాయించబడిన స్థానంలో ఉంచాలి. పూజా సామాగ్రిని ఉంచు పాత్రని శుభ్రపరచి దానిపై గంగా జలాన్ని చిలకరించి, పూజకు సంబంధించిన వస్తువులను అందులో ఉంచాలి. తర్వాత, దేవుని విగ్రహాన్ని పసుపు పూలతో మరియు మరికొన్ని ఇతర పూలతో అలంకరించి, నువ్వులు, గంధం, ధూప దీప నైవేధ్యాలు, మిఠాయిలు, పంచామృతం, కొబ్బరి కాయను సమర్పించవలసి ఉంటుంది. విష్ణువుకు తులసి మాల అంటే బహు ప్రీతి, కావున తులసిని జతచేయడం ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోరాదు. అన్నిటినీ సిద్దపరచుకున్నాక, విష్ణు సహస్రనామం , మంత్రం పఠనం చేయవలసి ఉంటుంది.

పెళ్లి ఆలస్యమవుతున్న యువతీ యువకులు, విష్ణువును పసుపు పూలతో పూజించుట ద్వారా , మరియు విష్ణు సహస్ర నామం పఠిoచడం, భజనల్లో పాల్గొనడం, దేవాలయాలకు వెళ్ళడం, మరియు హారతిని సమర్పించి భక్తులకు ప్రసాదాన్ని పంచిపెట్టడం ద్వారా ఉత్తమ ఫలితాలను పొందగలరు. పూజకి సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకొనుటకు ఆలయ పూజారిని సంప్రదించుట మేలు.

ఉపవాస దీక్ష వలన కలిగే ప్రయోజనాలు:

ఈ ఉపవాస దీక్ష ఫలితాలను గురించి వశిష్టుడు రామునికి మరియు కృష్ణుడు, పాండవాగ్రజుడైన ధర్మరాజునకు వివరించారు. మరియు ఈ ఫలితాల గురించి సూర్య పురాణం లో కూడా తెలుపబడినది.

ఈ వ్రతం ఆచరించడం ద్వారా, యజ్ఞ, యాగాదులలో పాలు పంచుకోవడం కన్నా, తీర్ధయాత్రలకు వెళ్ళడం కన్నా ఉత్తమ ఫలితాలను పొందవచ్చని, మరియు జనన మరణాల భాధలు లేకుండా కైవల్యాన్ని పొందగలరని చెప్పబడినది.

మోహినీ ఏకాదశి వెనుక ఉన్న కథ:

దేవ దానవుల క్షీర సాగర మధనంలో , అమరత్వాన్ని ఇవ్వగలిగిన అమృత భాండo ఉద్భవించింది. కానీ ఈ అమృత భాండం తమకే సొంతం కావాలని భావించిన ఇరు వర్గాల మద్య జరిగిన పోరులో, దానవుల చేతికి అమృత భాండం చిక్కితే వారు అమరులవడం వలన లోకాలు అల్లకల్లోలమవుతాయని భావించిన దేవతలు, తెలివైన విష్ణువే సమస్యకు పరిష్కారాన్ని చూపగలడని తెలుసుకుని ఆశ్రయించారు. దానవులతో భౌతికంగా యుద్దానికి దిగడం కన్నా, తెలివితో జయించవచ్చని భావించిన విష్ణువు, అప్సరస వంటి మోహినీ అవతారానికి సిద్దమయ్యాడు. మోహినీ అనగా ఆకర్షణ అని అర్ధం కూడా. అప్సరసను తలపించే అందంతో దానవుల దృష్టిని తనవైపు తిప్పుకోగలిగిన మోహినీ , దానవులకు అనుమానం రాకుండా వారికి నీటిని, దేవతలకు అమృతాన్ని అందివ్వడంలో సఫలీకృతమైంది. ఈ కారణం చేతనే దేవతలు అమరులయ్యారు.

ఈ విధంగా లోక కల్యాణం కొరకు విష్ణువు దాల్చిన అవతారమైన మోహినీ రూపానికి ప్రతీకగా ప్రతి ఏటా వైశాఖ శుక్ల పక్ష 11వ రోజున ఈ మోహినీ ఏకాదశి జరుపబడుతుంది.

English summary

Mohini Ekadashi - 26th April

Mohini Ekadashi falls on the eleventh day of Shukla Paksh in the Vaishakh month. Lord Vishnu appeared in his only female form, named Mohini, on this day. During the Samudra Manthan, Mohini took away the attention of the Demons and helped the Gods in drinking the Amrit and become immortal. This year Mohini Ekadashi falls on 26th April, Thursday.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more