For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పూజారి లేకుండా మీ ఇంట్లోనే వరలక్ష్మి వ్రతాన్ని ఇలా చేసుకోండి

|

శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాలు మహిళలకు అత్యంత విశిష్టమైనవి. ఎందుకంటే ఈ నెలలో శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం చేయడం వల్ల స్త్రీలకు ఐదోతనాన్ని, అష్ట ఐశ్వర్యాలను తెచ్చిపెడతాయని వారి నమ్మకం.

వరలక్ష్మి వ్రతానికి కావాల్సిన వస్తువులు

పసుపు 100 గ్రాములు, కుంకుమ100 గ్రాములు. ఒక డబ్బా గంధం విడిపూలు, పూల దండలు, ఆరు తమలపాకులు, 30 వక్కలు, వంద గ్రాముల ఖర్జూరాలు, 50 గ్రాముల అగరవత్తులు, 50 గ్రాముల కర్పూరం, ౩౦ రూపాయి నాణాలు, ఒక తెల్లటవల్, జాకెట్ పీసులు, మామిడాకులు, ఒక డజన్ అరటిపండ్లు ఇతర ఐదు రకాల పండ్లు, లక్ష్మిదేవి చిత్రపటం, కలశం, కొబ్బరికాయలు, తెల్లదారం లేదా పసుపు రాసిన కంకణాలు -2, స్వీట్లు, 2 కిలోల బియ్యం, కొంచెం పంచామృతం లేదా ఆవుపాలు, దీపాలు, గంట హారతి, ప్లేటు స్పూన్స్, ట్రేలు, ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె, వత్తులు, అగ్గిపెట్టె, గ్లాసులు, బౌల్స్.

వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించే రోజున ఉదయాన్నే లేచి తలస్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ముందుగా లక్ష్మిదేవి చిత్రపటాన్ని లేదా విగ్రహాన్ని పూజ చేసే గదిలో పెట్టుకోవాలి. కలశం ఆచారం ఉండేవారు బియ్యపు పిండితో ముగ్గు వేసి వస్త్రం పరిచి, దానిపై బియ్యం పోసి తమలపాకు పెట్టి కలశాన్ని పెట్టాలి. అంతకంటే ముందు తోరణాలు సిద్ధంగా ఉంచుకోవాలి. అక్షింతలు, పసుపు గణపతిని కూడా సిద్ధంగా ఉంచుకోవాలి.

మరిన్ని వస్తువులు

పసుపు, కుంకుమ, వాయనం ఇవ్వడానికి అవసరమైన వస్తువులు, ఎర్రటి రవికె వస్త్రం, గంధము, పూలు, పండ్లు, ఆకులు, వక్కలు, కంకణం కట్టుకోవడానికి దారం, టెంకాయలు, దీపపు కుందులు, ఐదు వత్తులతో హారతి ఇవ్వడానికి అవసరమైన పంచహారతి దీపారాధనకునెయ్యి, కర్పూరం, అగరువత్తులు, బియ్యం,శనగలు మొదలైనవి సిద్ధంగా ఉంచుకోవాలి.

కంకణం ఇలా తయారు చేసుకోవాలి

తెల్లటి దారాన్ని ఐదు లేక తొమ్మిది పోగులు తీసుకుని దానికి పసుపు రాసుకోవాలి. ఆ దారానికి ఐదు లేక తొమ్మిది పూలు కట్టి ముడులు వేయాలి. అంటే ఐదు లేక తొమ్మిది పోగుల దారాన్ని ఉపయోగించి ఐదు లేక తొమ్మిదో పువ్వులతో ఐదులేక తొమ్మిది ముడులతో తయారు చేసుకుని పీఠం వద్ద ఉంచి పుష్పాలు, పసుపు, కుంకుమ, అక్షతలు వేసి,కంకణాన్ని పూజించి ఉంచుకోవాలి. ఆ విధంగా కంకణాన్ని తయారు చేసుకున్న తరువాత పూజకు సిద్ధంకావాలి.

తొలుత గణనాథుడిని పూజించాలి

పసుపుతో తయారు చేసిన గణనాథుడిని అమ్మవారి దగ్గర ఉంచి దీపారాధన చేయాలి. అక్షింతలు వేసి స్వామికి నమస్కారం చేయాలి. తర్వాత ఆచమనం చేయాలి. కొన్ని అక్షింతలు చేతిలోకి తీసుకుని

ఉత్తిష్టంతు భూతపిశాచా: ఏతే భూమి కారకా:

ఏతేషా మవిరోధేన బ్రహ్మ కర్మ సమారభే

అని చెప్పి వాసన చూసి వెనక్కి వేసుకోవాలి. తర్వాత ముక్కు పట్టుకుని మూడుసార్లు ప్రాణాయామం చేయాలి. తర్వాత తమ గోత్రనామాలు చెప్పుకుని సంకల్పం చెప్పుకోవాలి. తర్వాత నీరు ముట్టుకుని వినాయకుడికి షోడషోపచార పూజ చేయాలి. పువ్వులు, అక్షింతలు తీసుకుని గణపతిని ఈ విధంగా పూజించాలి.

ఓం సుముఖాయ నమః , ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః , ఓం గజకర్ణికాయ నమః , ఓంలంబోదరాయ నమః , ఓం వికటాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం గణాధిపాయ నమః, ఓంధూమకేతవే నమః, ఓం వక్రతుండాయ నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం ఫాలచంద్రాయ నమః, ఓం గజాననాయ నమః, ఓం శూర్పకర్ణాయ నమః, ఓం హేరంబాయ నమః, ఓం స్కందపూర్వజాయనమః, ఓం శ్రీ మహాగణాధిపతయే నమః నానావిధ పరిమళపుత్ర పుష్పాణి సమర్పయామి అంటూస్వామిపై పుష్పాలు ఉంచాలి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః ధూపం ఆఘ్రాపయామి ఓం శ్రీ మహాగణాధిపతయే నమః దీపం దర్శయామి. స్వామివారి ముందు పళ్ళుగానీ బెల్లాన్ని గానీ నైవేద్యంగా పెట్టాలి. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వర్యేణ్యం, భర్గోదేవస్య ధీమహి ధియోయోనః ప్రచోదయాత్!! నీటిని నివేదన చుట్టూ జల్లుతూ ... సత్యం త్వర్తేన పరిషించామి, అమృతమస్తు, అమృతో పస్తరణమసి... ఓం ప్రాణాయ స్వాహా, ఓం ఆపానాయ స్వాహా, ఓంవ్యానాయస్వాహా, ఓం ఉదానాయ స్వాహా, ఓం సమానాయ స్వాహా, ఓం బ్రహ్మేణ్యే స్వాహాగుడ సహితఫల నివేదనం సమర్పయామి, మధ్యే మధ్యే పానీయం సమర్పయామి (నీటిని వదలాలి).

తర్వాత సిద్ధం చేసుకున్న విగ్రహం లేదా పటాన్ని పట్టుకుని వరలక్ష్మి అమ్మవారిని ఆవహనం చేయడానికి ఇలా చెప్పాలి.

శ్రీ వరలక్ష్మి దేవతాభ్యోనమః

పాదయో: పాద్యం సమర్పయామి

శ్రీ వరలక్ష్మి దేవతాభ్యో నమః

హస్తయో: అర్ఘ్యం సమర్పయామి

శ్రీ వరలక్ష్మి దేవతాభ్యో నమః

ముఖేహ: ఆచమనీయం

సమర్పయామి

తర్వాత అమ్మవారి రూపుకు కూడా కుంకుమ పెట్టి కలశం దగ్గర పెట్టాలి. అనంతరం తొమ్మిది సూత్రములు కలిగిన తోరమును వరలక్ష్మి అమ్మవారి దగ్గర పెట్టాలి. అక్షింతలు, పూలు పట్టుకుని అమ్మవారి స్త్రోత్రమును చదవాలి.

నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే..

శంఖ చక్రగదాహస్తే మహాలక్ష్మీ నమో స్తుతే..

నమస్తే గరుడారుఢే డోలాసురభయంకరి

సర్వపాపహరే దేవి మహాలక్ష్మీ నమో స్తుతే..

సర్వజే సర్వవరదే సర్వదుష్టభయంకరి

సర్వదు:ఖహరే దేవి మహాలక్ష్మీ నమోస్తుతే

సిద్ధిబుద్ధి ప్రదే దేవి భుక్తి ముక్తి ప్రదాయిని

మంత్రమూర్తే సదా దేవి మహాలక్ష్మీ నమో స్తుతే

ఆద్యంతరహితే దేవి ఆద్యశక్తి మహేశ్వరి

యోగజే యోగసంభూతే మహాలక్ష్మీ నమో స్తుతే

స్థూల సూక్ష్మ మహారౌద్రే మహాశక్తి మహొదరే

మహాపాప హరే దేవి మహాలక్ష్మీ నమో స్తుతే

పద్మాసనస్థితే దేవి పరబ్రహ్మ స్వరూపిణి

పరమేశీ జగన్మాతర మహాలక్ష్మీ నమో స్తుతే

శ్వేతాంబరధరే దేవి నానాలంకారభూషితే

జగత్సితే జగన్మాతర మహాలక్ష్మీ నమో స్తుతే

మహాలక్ష్మ్యష్టకం స్తోత్రం య: పఠేద్భక్షిమాన్నర:

సర్వసిద్ధి మవాప్నోతి రాజ్యం పరాప్నోతి సర్వదా

ఏకకాలం పఠేన్నిత్యం మహాపాపవినాశనం

ద్వికాలం య: పఠేన్నిత్యం ధనధాన్యసమన్విత:

తరికాలం య: పఠేన్నిత్యం మహాశత్రువినాశనం

మహాలక్ష్మీర్బవేన్నిత్యం ప్రసన్నా వరదా శుభా..

తర్వాత చేతిలో పట్టుకున్న అక్షింతలు అమ్మవారి వద్ద వేయాలి. అనంతరం అమ్మవారికి పుష్పాలతో, అక్షతలతో అధంగ పూజ చేయాలి. మనసులో ఓం శ్రీ వరలక్ష్మీ దేవియే నమ: అనుకుంటూ..

చంచలాయై నమః - పాదౌ పూజయామి, చపలాయై నమః - జానునీ పూజయామి, పీతాంబరాయైనమః - ఉరుం పూజయామి, మలవాసిన్యైనమః - కటిం పూజయామి, పద్మాలయాయైనమః -నాభిం పూజయామి, మదనమాత్రేనమః - స్తనౌ పూజయామి, కంబుకంఠ్యై నమః- కంఠంపూజయామి, సుముఖాయైనమః - ముఖంపూజయామి, సునేత్రాయైనమః - నేత్రౌపూజయామి, రమాయైనమః - కర్ణౌ పూజయామి, కమలాయైనమః - శిరః పూజయామి, శ్రీవరలక్ష్య్మైనమః - సర్వాణ్యంగాని పూజయామి.

తర్వాత తోరాల మీద పసుపు, కుంకుమ, అక్షింతలు తీసుకుని 9 సార్లు పూజ చేయాలి. మనసులో ఓం శ్రీ వరలక్ష్మీ దేవియే నమ: అనుకుంటూ..

కమలాయైనమః - ప్రథమగ్రంథిం పూజయామి, రమాయైనమః - ద్వితీయ గ్రంథింపూజయామి, లోకమాత్రేనమః - తృతీయ గ్రంథింపూజయామి, విశ్వజనన్యైనమః - చతుర్థగ్రంథింపూజయామి, మహాలక్ష్మ్యై నమః - పంచమగ్రంథిం పూజయామి, క్షీరాబ్ది తనయాయై నమః - షష్ఠమ గ్రంథిం పూజయామి, విశ్వసాక్షిణ్యై నమః - సప్తమగ్రంథిం పూజయామి, చంద్రసోదర్యైనమః - అష్టమగ్రంథిం పూజయామి, శ్రీ వరలక్ష్మీయై నమః - నవమగ్రంథిం పూజయామి.

తరువాత పుష్పాలతో అమ్మవారిని అష్టోత్తర శతనామాలతో పూజించాలి.

అమ్మవారి రూపు మీద, చిత్రపటం మీద పంచామతం చల్లాలి. తర్వాత శుద్ధోతకం(శుద్ధమైన నీరు) చల్లాలి. తర్వాత అమ్మవారికి వస్ర్తం, కుంకుమ, పసుపు, గంధం సమర్పించాలి. సర్వాభరణార్థం పుష్పమాల్యం అని చెప్పి అమ్మవారికి పూలు వేయాలి. మనతో ఏవైనా పూజా సామాగ్రి లేకపోతే వాటికి బదులుగా పుష్పం సమర్పయామి అని లేదా అక్షితామ్ సమర్పయాం అని చెప్పాలి. తర్వాత అమ్మవారికి దూపం దీపం పెట్టాలి. తర్వాత అమ్మవారి దగ్గర ఉన్న తోరములను కట్టి మరొకటి మన చేతికి కట్టుకోవాలి. ఇంకొకటి ముత్తైదువులకు కట్టాలి. తర్వాత చేతిలో కొన్ని పూలు, అక్షింతలు తీసుకుని వరలక్ష్మీ వ్రత కథను చదవాలి.

ఆ కథేంటంటే..

శౌనకాది మహర్షులను ఉద్దేశించి సూత మహాముని ఇలా చెప్పారు. మునులారా! స్త్రీలకు సౌభాగ్యదాయకమైన వ్రతమును ఒక దానిని పరమ శివుడు పార్వతికి చెప్పారు. లోకోపకారం కోరి ఆ వ్రతాన్ని గురించి మీకు తెలియజేస్తాను.శ్రద్ధగా వినండి. పరమేశ్వరుడు ఒకనాడు తన భస్మసింహాసనముపై కూర్చుని ఉండగా నారదమహర్షి ఇంద్రాది దిక్పాలకులు స్తుతి స్తోత్రములతో పరమశివుడ్ని కీర్తిస్తు న్నారు. ఆమహత్తర ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుడ్ని ఉద్దేశించి నాథా! స్త్రీలు సర్వ సౌఖ్యములు పొంది పుత్ర పౌత్రాభివృద్ధిగా తరించుటకు తగిన వ్రతం ఒకదానిని చెప్పండి అని అడిగింది. అందుకా త్రినేత్రుడు దేవీ! నీవు కోరిన విధంగా స్త్రీలకు సకల శుభాలు కలిగించే వ్రతం ఒకటి ఉన్నది.అది వరలక్ష్మీవ్రతం.దానిని శ్రావణమాసంలో రెండవ శుక్రవారం నాడు ఆచరించాలని చెప్పాడు. అప్పుడు పార్వతీదేవి...దేవా! ఈ వరలక్ష్మీ వ్రతాన్ని ఆదిదేవతలు ఎవరుచేశారు?ఈ వ్రతాన్ని ఎలా చేయాలో వివరంగా చెప్పండని కోరింది.కాత్యాయనీ...పూర్వకాలంలో మగధ దేశంలో కుండినము అనే పట్టణం ఒకటి ఉండేది. ఆపట్టణం బంగారు కుడ్యములతో రమణీయంగా ఉండేది. ఆ పట్టణంలో చారుమతి అనే ఒకబ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె సుగుణవతి. వినయ విధేయతలు, భక్తిగౌరవాలు గలయోగ్యురాలు. ప్రతిరోజూ ప్రాతఃకాలాన నిద్రలేచి భర్త పాదాలకు నమస్కరించు కునిప్రాతఃకాల గృహకృత్యాలు పూర్తిచేసుకుని అత్తమామలను సేవించు కుని మితంగాసంభాషిస్తూ జీవిస్తూ ఉండేది.

వరలక్ష్మీ సాక్షాత్కారం :- వరలక్ష్మీ వ్రతానికి ఆదిదేవతయైన వరలక్ష్మీదేవి ఒకనాటి రాత్రి సమయంలో చారుమతికి కలలో సాక్షాత్కరించింది. ఓ చారుమతీ...ఈ శ్రావణపౌర్ణమి నాటికి ముందువచ్చే శుక్రవారం నాడు నన్ను పూజించు. నీవు కోరిన వరాలు, కానుకలనుఇస్తానని చెప్పి అంతర్థానమైంది. చారుమతి సంతోషించి. "హే జననీ! నీకృపా కటాక్షములు కలిగినవారు ధన్యులు. వారు సంపన్నులుగా, విద్వాంసులుగా మన్ననలు పొందుతారు. ఓ పావనీ! నా పూర్వజన్మ సుకృతం వల్ల నీ దర్శనం నాకు కలిగింది అని పరిపరివిధాల వరలక్ష్మీదేవిని స్తుతించింది. అంతలోనే చారుమతి మేల్కొని అదంతా కలగా గుర్తించి తన కలను భర్తకు అత్తమామలకు తెలియజేసింది. వారు చాలా సంతోషించి చారుమతిని వరలక్ష్మీవ్రతాన్ని చేసుకోమని చెప్పారు. ఊరిలోని ముత్తైదువలు చారుమతి కలను గురించి విని వారు కూడా పౌర్ణమి ముందు రాబోయే శ్రావణ శుక్రవారం కోసం ఎదురు చూడసాగారు.

శ్రావణ శుక్రవారం రోజున పట్టణంలోని స్త్రీలందరూ ఉదయాన్నే లేచి తలస్నానం చేసి పట్టువస్త్రాలు ధరించి చారుమతి గృహానికి చేరుకున్నారు. చారుమతి తన గృహంలో మండపం ఏర్పాటు చేసి ఆ మండపంపై బియ్యంపోసి పంచ పల్లవాలైన రావి, జువ్వి, మర్రి, మామిడి, ఉత్తరేణి మొదలైన ఆకులతో కలశం ఏర్పాటు చేసి వరలక్ష్మీదేవిని సంకల్ప విధులతో సర్వమాంగళ మాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవీ నారాయణి నమోస్తుతే !! అంటూ ఆహ్వానించి ప్రతిష్టించింది. అమ్మవారిని షోడశోపచారాలతో పూజించారు. భక్ష్య, భోజ్యాలను నివేదించారు. తొమ్మిది పోగుల కంకణాన్ని చేతికి కట్టుకున్నారు. ప్రదక్షిణ నమస్కారాలు చేశారు.

మొదటి ప్రదక్షిణ చేయగానే కాలి గజ్జేలు ఘల్లు ఘల్లున మ్రోగాయి. రెండవ ప్రదక్షిణ చేయగానే చేతులకు నవరత్న ఖచిత కంకణాలు ధగధగా మెరవసాగాయి.మూడవ ప్రదక్షిణ చేయగా అందరూ సర్వా భరణ భూషితులయ్యారు. వారు చేసిన వరలక్ష్మీ వ్రతం ఫలితంగా చారుమతి గృహంతో పాటు ఆపట్టణంలో ఇతర స్త్రీల ఇళ్లు కూడా ధన, కనక, వస్తు వాహనాలతో నిండిపోయాయి.ఆయా స్త్రీల ఇళ్ల నుండి గజతరగరథ వాహనములతో వచ్చి వారిని ఇళ్లకుతీసుకెళ్లారు. వారంతా మార్గమధ్యంలో చారుమతిని ఎంతగానో పొగుడుతూ ఆమెకు వరలక్ష్మీ దేవి కలలో సాక్షాత్కరించి అనుగ్రహించగా ఆమె వరలక్ష్మీ వ్రతంతో మనల్ని కూడా భాగ్యవంతులను చేసిందని ప్రశంసించారు. వారంతా ప్రతీ సంవత్సరం వరలక్ష్మీ వ్రతం చేసి సకల సౌభాగ్యాలతో సిరిసంపదలు కలిగి సుఖ జీవనంతో గడిపి ముక్తిని పొందారు. మునులారా శివుడు పార్వతికి ఉపదేశించిన ఈ వరలక్ష్మీవ్రత విధానాన్ని సవివరంగా మీకు వివరించాను. ఈ కథ విన్నాను ఈ వ్రతం చేసినను ఈ వ్రతం చేసినప్పుడు చూసినా కూడా సకల సౌభాగ్యాలు, సిరిసంపదలు, ఆయురారోగ్వైశ్వర్యాలు కలిగుతాయని సూత మహాముని శౌనకాది మహర్షులకు చెప్పారు.

ఈ కథ విని అక్షతలు శిరసుపై వేసుకోవాలి. ఆ తరువాత ముత్తైదువులకు తాంబూలాలు పసుపు బొట్టు ఇవ్వాలి. అందరికీ తీర్థప్రసాదాలు ఇచ్చి పూజ చేసిన వారు కూడా తీర్థ ప్రసాదాలు తీసుకోవాలి.అమ్మవారికి పెట్టిన నైవేద్యాన్ని తినేయాలి,రాత్రి ఉపవాసం ఉండాలి. భక్తితో వేడుకొంటే వరాలందించే తల్లి వరలక్ష్మీ దేవి. ఈ వ్రతాన్నిఆచరించడానికి ఏ నిష్ఠలు, నియమాలు, మడులు అవసరం లేదు. నిశ్చలమైన భక్తి, ఏకాగ్రచిత్తం ఉంటే చాలు. వరలక్ష్మీవ్రతం ఎంతో మంగళకరమైంది. ఈ వ్రతాన్నిచేయడంవల్ల లక్ష్మీదేవి కృప కలిగి సకల శుభాలుకలుగుతాయి.సంపదలంటే కేవలం ధనం మాత్రమేకాదు. ధాన్య సంపద, పశు సంపద, గుణ సంపద, జ్ఞాన సంపద మొదలైనవి ఎన్నో ఉన్నాయి. 'వర' అంటే శ్రేష్ఠమైన అర్థం కూడా ఉంది.

ఇదంతా పూర్తయ్యాక మన చేతిలో ఉన్న అక్షింతలు అమ్మవారిపై వేసి మన మీద కూడా వేసుకోవాలి. తర్వాత మనం చేసుకున్న పదార్థాలను మహానివేదన చేసి మంగళనీరాజనం ఇవ్వాలి. తర్వాత తీర్థప్రసాదాలు తీసుకోవాలి.

Read more about: festival pooja
English summary

Varamahalakshmi 2019 : Significance of Varalakshmi Vrat and Fasting ritualsVaramahalakshmi 2019 : Significance of Varalakshmi Vrat and Fasting rituals

Fridays in the month of Shravan are the most special for women. It is believed that the worship of Varalakshmi on Fridays of this month will bring women a fifth life and an octave. All the Muttadars rise early in the morning, bathe cleanly, decorate the beautiful house of worship and observe the Vrata.The details of the Varalakshmi Vratam Pooja procedure are for you on this Friday.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more