ముంబై స్పెషల్ బటాటా పోహా.. ఉదయం పూట నోరూరించే, కడుపు నింపే అద్భుతమైన బ్రేక్‌ ఫాస్ట్!

Posted By:

ఉదయం బ్రేక్ ఫాస్ట్ లోకి రోజూ తినే ఇడ్లీ, దోశ, ఉప్మా వంటివి తిని మీకు బోర్ కొట్టిందా? అయితే మీ రుచి మొగ్గలకు కొత్త అనుభూతిని ఇవ్వడానికి ముంబై వీధుల్లో అత్యంత ఆదరణ పొందిన స్ట్రీట్ ఫుడ్ బటాటా పోహా ఓ సారి ట్రై చేయండి. కేవలం 10-15 నిమిషాల్లో తయారయ్యే ఈ బ్రేక్ ఫాస్ట్..రుచికి రుచిని, ఆరోగ్యానికి ఆరోగ్యాన్ని ఇస్తుంది.

బటాటా (అంటే బంగాళదుంప), పోహా (అటుకులు) కలయికతో చేసే ఈ వంటకంలో మసాలాలు చాలా తక్కువగా వాడతారు. అయినా దీని రుచి అమృతంలా ఉంటుంది. తేలికగా జీర్ణమవ్వడంతో పాటు, ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉంచడం దీని ప్రత్యేకత.

Bored of Idli Dosa Try This Healthy Tasty Breakfast Mumbai Famous Batata Poha Recipe in Just 10 Mins

బటాటా పోహా తయారీకి కావలసిన పదార్థాలు

మందపాటి అటుకులు - 1 కప్పు
బంగాళదుంపలు - 2
ఉల్లిపాయ - 1
ఆవాలు - అర టీస్పూన్
జీలకర్ర - అర టీస్పూన్
కరివేపాకు - 10 ఆకులు
నూనె - 2 టీస్పూన్లు
ఉప్పు - రుచికి సరిపడా
చక్కెర - అర టీస్పూన్
కొత్తిమీర - కొద్దిగా
నిమ్మకాయ, సన్న కారప్పూస- వడ్డించడానికి

బటాటా పోహా తయారీ విధానం

-ముందుగా ఒక జల్లెడలో అటుకులను తీసుకుని గోరువెచ్చని నీటితో శుభ్రంగా కడగాలి. నీరంతా వంపేసి, అటుకులు కాస్త మెత్తగా అయ్యే వరకు 2-3 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి.

-బంగాళదుంపల తొక్క తీసి త్వరగా ఉడికేలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అలాగే ఉల్లిపాయను కూడా వీలైనంత సన్నగా తరిగి పెట్టుకోవాలి.

-స్టవ్ మీద ఒక కడాయి పెట్టి రెండు టీస్పూన్ల నూనె వేడి చేయాలి. నూనె వేడెక్కగానే ఆవాలు, జీలకర్ర వేయాలి. అవి చిటపటలాడుతున్నప్పుడు తాజా కరివేపాకు,తరిగిన ఉల్లిపాయ ముక్కలను వేసి, లేత గులాబీ రంగులోకి మారే వరకు వేయించాలి. ఆ వెంటనే బంగాళదుంప ముక్కలను వేసి, అవి మెత్తగా ఉడికే వరకు సుమారు 4-5 నిమిషాల పాటు వేయించుకోవాలి.

-బంగాళదుంపలు మెత్తబడ్డాక మీ రుచికి సరిపడా ఉప్పు, అర టీస్పూన్ చక్కెర వేసి నెమ్మదిగా కలపాలి. (పంచదార వేయడం వల్ల పోహాకు మహారాష్ట్ర వంటకాలకు ఉండే ఒక ప్రత్యేకమైన రుచి వస్తుంది).

-ఇప్పుడు అందులో ముందుగా నానబెట్టుకున్న అటుకులను వేసి, అన్నీ బాగా కలిసేలా సున్నితంగా కలపాలి. పోహాకు అన్ని రుచులు పర్ఫెక్ట్ గా పట్టడానికి, స్టవ్ మంటను పూర్తిగా తగ్గించి, మూత పెట్టి మరో 2-3 నిమిషాల పాటు అలాగే మగ్గనివ్వాలి.

-చివరగా సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేయాలి. వేడి వేడిగా ప్లేట్‌లోకి తీసుకుని, పైన కొద్దిగా నిమ్మరసం పిండి, కరకరలాడే సన్న కారప్పూస(సేవ్) చల్లుకుని వడ్డించండి.

[ of 5 - Users]
Story first published: Saturday, March 28, 2026, 7:05 [IST]
Desktop Bottom Promotion