కోడి ఉలవకాయల పకోడీ.. ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ చేసుకోవాల్సిందే!

మన దేశంలో ఎన్నో రకాల వంటలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో వంటలకు కొదువే లేదు. కేవలం చికెన్‌తోనే డజన్‌కు పైగా వంటలను చేసేస్తారు మనోళ్లు. అవన్నీ కూడా ఎంతో రుచికరంగా ఉంటాయి కూడా. ఒక్కసారి తింటే జన్మలో మర్చిపోలేని రుచి వాటి సొంతం. అందులో భాగంగానే కోడి ఉలవకాయలతో పకోడీ చేసుకుంటే ఆ రుచి వేరే లెవెల్‌లో ఉంటుంది. ఒక్కసారి తింటే ప్రతిసారి వాటినే చేసుకునే తినాలనుకుంటారు. అసలు కోడి ఉలవకాయలతో పకోడీ ఎలా చేసుకోవాలి? దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

కోడి ఉలవకాయల పకోడికి కావాల్సిన పదార్థాలు

కోడి ఉలవకాయలు
నిమ్మకాయ
కొత్తిమీర
పుదీనా
పసుపు
రుచికి సరిపడా ఉప్పు
గరం మసాలా
నూనె
కారం
ధనియాల పొడి
జీలకర్ర పొడి
కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్
కోడి గుడ్డు
బియ్యం పిండి
శెనగ పిండి
పచ్చిమిర్చి
కరివేపాకులు

కోడి ఉలవకాయల పకోడీ విధానం

ముందుగా కోడి ఉలవకాయలను సగానికి కోసుకొని శుభ్రంగా కడుక్కొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అందులో ఒక నిమ్మకాయ బద్దను పిండుకోవాలి. అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. దీంతో పాటు చిటికెడు పసుపు, రుచికి సరిపడా ఉప్పు, గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి అన్నీ చిటికెడు చిటికెడు వేసుకోవాలి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక చిన్న స్పూన్ నూనె కూడా వేసుకోవాలి. దీంతో పటు ఒక కోడి గుడ్డును అందులో పగలగొట్టుకోవాలి. వాటన్నిటినీ పూర్తిగా కలుపుకోవాలి. అనంతరం ఓ అరగంట పాటు పక్కన పెట్టేయాలి.

అరగంట తరువాత ఆ ఉలవకాయల మిశ్రమంలో ఒక కప్పు బియ్యం పిండి, ఒక కప్పు శెనగ పిండి వేసుకోవాలి. అలాగే కొంచెం నీళ్లు పోసుకొని పిండి ఉలవకాయలకు బాగా పట్టుకునే విధంగా కలుపుకొని ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి. అనంతరం ఒక పాన్ మీద నూనె పోసుకొని దానిపై ఉలవకాయలను బాగా ఫ్రై చేసుకోవాలి. సిమ్‌లోనే ఒక ఇరవై నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి.

అనంతరం వాటిపైన ఒక మూడు పచ్చిమిర్చి చీలికలు, కరేపాకులు వేసుకొని చిటపటలాడే వరకు ఉంచుకొని దించుకుంటే కోడి ఉలవకాయల పకోడీ సిద్ధమైనట్లే. దానిపైన పెరిపేరీ మసాలా, నిమ్మకాయ రసం పిండుకొని తింటే ఆ రుచి అమోఘం అంతే. మీరూ ఓసారి ట్రై చేయండి.

[ of 5 - Users]
Story first published: Sunday, January 5, 2025, 18:32 [IST]
Desktop Bottom Promotion