Natukodi Rasam: నాటుకోడి రసం.. చలికాలంలో తింటే రోగాలు మాయం.. ఎలా చేసుకోవాలంటే?

మనలో చాలా మంది చికెన్ కర్రీనే వండుకొని తింటుంటారు. దానివల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ కొని దుష్ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అయితే ఈసారి నాటుకోడితో రసం చేసుకొని తినండి. చలికాలంలో దీనిని తినడం వల్ల గొంతునొప్పి, జలుబు, దగ్గు వంటి రోగాలు రావు. అలాగే కడుపులో మాలీనం అంతా శుభ్రమైపోతుంది. ఈ నాటుకోడి రసం ఎలా చేసుకోవాలి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

నాటుకోడి రసం తయారీకి కావాల్సిన పదార్థాలు

  1. అరకిలో నాటుకోడి మాంసం
  2. ఆరు మీడియం సైజ్ టమోటాలు
  3. నాలుగు ఉల్లిపాయలు
  4. ఆరు పచ్చిమిర్చి
  5. గుప్పెడు కరివేపాకు
  6. కాస్త కొత్తిమీర
  7. ఒక చెంచా ధనియాలు
  8. ఒక చెంచా మిరియాలు
  9. ఒక చెంచా జీలకర్ర
  10. ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు
  11. చిన్న సైజ్ అల్లం ముక్క
  12. నూనె
  13. పసుపు
  14. రుచికి సరిపడా ఉప్పు
  15. రెండు లీటర్ల నీళ్లు

నాటుకోడి రసం తయారీ విధానం

ఈ నాటుకోడి రసం తయారు చేసుకోవడానికి ముందు తీసుకున్న అరకిలో చికెన్‌ను ఒక రోకలి బండతో పగలగొట్టుకోవాలి. అలా పగలగొట్టుకుంటేనే అందులో రసం ఊరి రుచి అద్భుతంగా ఉంటుంది. అలాగే ఆరు టమోటాలను చిన్న చిన్న ముక్కలుగా చేసి పక్కన పెట్టుకోవాలి. దీంతో పాటు నాలుగు ఉల్లిపాయలను రోటిలో వేసి దంచుకోవాలి.

తరువాత ధనియాలు, మిరియాలు, జీలకర్రను దోరగా వేయించుకొని ఒక రోటిలో వేసుకొని పొడిలాగా చేసుకోవాలి. దీంతోపాటు వెల్లుల్లి రెబ్బలు, అల్లం ముక్కను కూడా రోటిలో వేసుకొని దంచుకొని ఒక గిన్నిలోకి తీసుకోవాలి. ఇదంతా అయిపోయాక పొయ్యిపైన ఒక గిన్నె పెట్టుకోవాలి.

ఇప్పుడు అందులో రెండు చెంచాల నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక అందులో అరచెంచా జీలకర్ర వేసుకోవాలి. ఆ తరువాత కచ్చాపచ్చాగా దంచుకొని పక్కన పెట్టుకున్న ఉల్లిముద్దను కూడా వేసుకోవాలి. ఆ ఉల్లిపాయలను రెండు లేదా మూడు నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి. అనంతరం అందులో అల్లం వెల్లుల్లి ముద్దను కూడా వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి.

ఇప్పుడు ఆ మిశ్రమంలోనే గుప్పెడు కరివేపాకులు వేసుకొని ఓసారి కలుపుకోవాలి. అనంతరం ఆరు పచ్చిమిర్చిని చీల్చి అందులో వేసుకొని రెండు లేదా మూడు నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి. ఆ తరువాత టమాటోలను వేసుకొని బాగా మెత్తబడే వరకు మూత పెట్టి బాగా ఉడకనివ్వాలి. ఇప్పుడు అందులో ముందుగానే దంచి పెట్టుకున్న నాటుకోడి మాంసం వేసుకోవాలి.

ఆ తరువాత అందులో అరచెంచా పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని.. చికెన్‌కు మనం ముందుగా చేసుకున్న మిశ్రమం మొత్తం పట్టే విధంగా బాగా కలుపుకొని, మూత పెట్టుకొని ఒక అయిదు నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. అయిదు నిమిషాల తరువాత మూత తీసి ఓసారి కలుపుకొని అందులో రెండు లీటర్ల నీళ్లు పోసుకోవాలి. అనంతరం ఒక్క ఉడుకు వచ్చేంత వరకు దానిని బాగా ఉడికించుకోవాలి. ఆ తరువాత అందులో మనం దంచిపెట్టుకున్న ధనియాలు, మిరియాలు, జీలకర్రల రసం పొడి వేసుకొని కలుపుకోవాలి.

అనంతరం మూత పెట్టేసి మనం పోసుకున్న రెండున్నర లీటర్ల నీళ్లు ఒకటిన్నర లీటర్ అయ్యే విధంగా బాగా ఉడికించుకోవాలి. అనంతరం దానిపై కొత్తిమీర చల్లుకొని దించుకుంటే నాటుకోడి రసం సిద్ధమైనట్లే. దీనిని తింటే గొంతునొప్పి, దగ్గు, జలుబు వంటి రోగాలు అన్ని దూరమైపోతాయి.

[ of 5 - Users]
Story first published: Saturday, December 28, 2024, 17:29 [IST]
Desktop Bottom Promotion