For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Pongal Recipe 2021 : ఈ సంక్రాంతికి రుచికరమైన రెసిపీలు మీ కోసమే...!

|

మన దేశ సంప్రదాయాలు, ఆచారాలు, కట్టుబాట్లకు అద్దం పట్టే ప్రధాన పండుగల్లో సంక్రాంతి(Pongal)కూడా ఒకటి. ఈ పండుగ వేళ ఉదయాన్నే చాలా మంది తమ ఇళ్ల ఎదుట వేసే రంగు రంగుల ముగ్గులు..

పెద్ద తేడా లేకుండా గాల్లోకి ఎగురవేసే పతంగులతో వచ్చే ఉత్సాహం.. స్కూటీలో వచ్చే హరిదాసుల కీర్తనలు.. వీటన్నింటిని మించి ప్రతి ఒక్కరి ఇంట్లో ఘుమఘుమ లాడే పిండి వంటకాలు సువాసనలతో సంక్రాంతి సంబరాలు కన్నుల పండుగగా జరుగుతాయి.

అయితే పండుగ అంటే కేవలం ఇవే కాదు.. పిండి వంటకాలు, పండుగ పనుల నేపథ్యంలో అందరినీ ఒకే చోట చేర్చి కలిసిమెలసి పని చేసేలా చేయడం ద్వారా వారి మధ్య సఖ్యతను మరింత పెరిగేలా చేయడమే అసలైన పండుగ.

పిండి వంటకాలతో మనం ఆరోగ్యంగా ఉండేలా చేయడంతో పాటు.. వీటిని తయారు చేసే సమయంలో అందరూ కలిసి కష్టపడటం ద్వారా ఇంట్లో సమైక్యత కూడా పెరుగుతుందని చాలా మంది నమ్మకం. అందుకే ఇంతకుముందు రోజుల్లో ఈ పిండి వంటకాల తతంగం ఎంత సందడిగా సాగేది. ఆ వివరాలన్నీ ఇప్పుడు గుర్తు చేసుకుందా రండి...

Pongal Special Recipe : సంక్రాంతికి ఈ రెసిపీ చాలా స్పెషల్ అని మీకు తెలుసా...

పదిహేను రోజుల ముందు..

పదిహేను రోజుల ముందు..

అప్పట్లో సంక్రాంతి పండుగకు కనీసం పదిహేను రోజుల ముందు నుండే పిండి వంటల హడావుడి మొదలయ్యేది. బియ్యం నానబెట్టుకోవడం, వాటిని పిండిగా మార్చుకోవడం, కల్తీ లేని నాణ్యత గల నెయ్యి, బెల్లం వంటి వాటిని ముందుగానే సమకూర్చుకునే వారు. ఇవొక్కటే కాదండోయ్ పండగకు కావాల్సిన సరుకులన్నింటినీ కనీసం పదిహేను రోజులు ముందుగానే సమకూర్చుకునే వారు.

రవ్వలడ్డుతో ప్రారంభం..

రవ్వలడ్డుతో ప్రారంభం..

ముందుగా ఇంట్లో పనులన్నీ ముగించుకుని.. మొదటిరోజు తప్పకుండా రవ్వలడ్డుతో ప్రారంభించేవారు. వీటిని తయారీకి గోధుమ నూక, చక్కెరను వాడే వారు. వీటిని చిన్నపిల్లలు బాగా ఇష్టపడతారు. వీటిని తయారు చేయడం చాలా తేలిక. ముందుగా ఓ స్టవ్ పై బౌల్ పెట్టి అందులో రెండు స్పూన్ల నెయ్యి వేసి కాస్త వేడి అయిన తర్వాత దానిలో కొన్ని కిస్ మిస్, జీడిపప్పు వేసి దోరగా వేయించుకోవాలి. తర్వాత వీటిని ఓ ప్లేటులోకి తీసుకోవాలి. ఆ తర్వాత అదే బౌల్లో ఇంకొంచెం నెయ్యి వేసుకుని.. ఆ తర్వాత పావుకిలో గోధుమ నూక వేసి ఉండలు కట్టకుండా జాగ్రత్తగా సుమారు ఐదు నిమిషాల పాటు వేయించుకోవాలి. తర్వాత దీనిని ప్లేటులోకి తీసుకుని చల్లారనివ్వాలి. ఈలోపు రెండు కప్పుల చక్కెర తీసుకుని, మిక్సీ పట్టి పొడిగా మార్చుకోవాలి. ఆ తర్వాత గోధుమ నూక చల్లారిన తర్వాత ఈ చక్కెర పౌడర్ ని అందులోని రెండు స్పూన్ల నెయ్యి వేసి బాగా కలపాలి. ఆ తర్వాత పిండిలో గోరువెచ్చగా వేడి చేసిన నెయ్యి లేదా పాలు వేస్తూ ఉండలు చుట్టుకునేందుకు వీలుగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఉండలు చుట్టుకుని ఒక అరగంట పాటు గాలి వీచేలా ఉంచాలి. దీంతో అవి గట్టిపడతాయి. అంతే మీకు కావాల్సిన రవ్వలడ్డూ రెడీ అయిపోయినట్టే. ఇవి 8 నుండి 15 రోజుల వరకు పాడవకుండా నిల్వ ఉంటాయి.

Happy Makar Sankranti 2021 : సంక్రాంతి సంబరాల వేళ మీ బంధుమిత్రులను హత్తుకునేలా విషెస్ చెప్పండి...!

అరిసెలు..

అరిసెలు..

సంక్రాంతి సమయంలో మన తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది ఇంట్లో అరిసెలు కచ్చితంగా తయారు చేస్తారు. వీటి తయారీకి మాత్రం కొంత సమయం ఎక్కువే పడుతుంది. వీటి తయారీకి ముందుగా బియ్యం శుభ్రంగా కడిగి సుమారు ఆరు గంటలు నానబెట్టాలి. ఆ తర్వాత పొడి చేసుకుని.. దానికి ఒక కప్పు తురిమిన బెల్లం, ఐదు స్పూన్ల నువ్వులు, కొద్దిగా నూనె, నెయ్యి రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై గిన్నె పెట్టుకుని అందులో కొంచెం నీళ్లు పోసి తురిమిన బెల్లం వేయాలి. ముదురుపాకం వచ్చే వరకు దానిని మరగించాలి. ఆ తర్వాత అందులో మనం ముందుగా సిద్ధం చేసుకున్న పిండి వేసి ఉండలు కట్టకుండా బాగా కలపాలి.

ఆ తర్వాత రెండు స్పూన్ల నెయ్యి వేసుకుంటే, పిండి స్మూత్ గా ఉంటుంది. ఆ తర్వాత ఆ పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసుకుని ఒక్కో ఉండను చేత్తో మందంగా పూరి సైజులో వచ్చేలా ప్రెస్ చేయాలి. దానిపైనే అక్కడక్కడా నువ్వులు చల్లుకోవాలి. ఆ తర్వాత బాగా కాగిన నూనెలో వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. అంతే మీరు ఇష్టపడే అరిసెలు రెడీ అయిపోతాయి.

సున్నుండలు..

సున్నుండలు..

సంక్రాంతి వేళ తయారు చేసే పిండి వంటల్లో సున్నుండలకు ప్రత్యేక స్థానమే ఉంది. వీటిని ఎలా తయారు చేయాలంటే.. ముందుగా మినప్పప్పుని వేయించుకుని సిద్ధం చేసుకోవాలి. ఇది చల్లారిన తర్వాత పప్పులపొడితో కలిపి మిక్సీలో వేయాలి. మరోవైపు బెల్లాన్ని కూడా మెత్తగా చేసుకోవాలి. ఆ తర్వాత రెండు పొడులను ఒక పాత్రలో వేసి బాగా కలపాలి. ఇందులో కొంచెం నెయ్యి వేసి బాగా మిక్స్ చేయాలి. చేతి వేళ్లకు కొంచెం నూనె లేదా నెయ్యి రాసుకుని ఈ పొడిని ఉండల్లా చుట్టుకుంటే చాలు. మీరు కోరుకున్న సున్నుండలు రెడీ అయిపోతాయ్.

జంతికలు..

జంతికలు..

సంక్రాంతి పండుగ వేళ కేవలం పిండి వంటలే కాదు.. కొన్ని కారంతో కలిపిన వంటలు కూడా ఉన్నాయి. అందులో ప్రధానమైనవి జంతికలే. వీటిని చాలా మంది స్నాక్స్ గా కూడా వాడతారు. వీటిని తయారు చేసేందుకు వరిపిండి, శనగపిండి వంటివి వాడుతుంటారు. అయితే మినప్పప్పుతో చేసే జంతికలు అన్నింటికంటే రుచికరంగా ఉంటాయి. ఇవి మన ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి. ఇంతకీ వీటిని ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఒక బౌల్ లో దోరగా వేయించిన మినపప్పును ఒక గ్లాసు తీసుకోవాలి. అదే సమయంలో మూడు గ్లాసుల బియ్యం తీసుకుని మెత్తని పిండిలా మిక్సీకి వేసుకోవాలి. ఆ తర్వాత దానిలో కొంచెం నూనె వేడి చేసి పోయాలి. అనంతరం దానిలో ఒక స్పూన్ కారం, నువ్వులు లేదా వాము, కొద్దిగా ఉప్పు వేసి అన్నింటినీ కలిపాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీళ్లు దీనిలోకి వేస్తూ జంతికల పిండిని సిద్ధం చేసుకోవాలి. దీనిని సుమారు 10 నిమిషాల పాటు నాననివ్వాలి. ఈలోపే జంతికలు వేసే గొట్టం లేదా పుడకకు నెయ్యి లేదా నూనె రాసి కొద్దిగా పిండి తీసుకుని వేడి వేడి నూనెలో జంతికలు వేయించాలి. అంతే అందరూ ఎంతగానో ఎదురుచూసే మినప్పప్పు జంతికలు రెఢీ అయినట్టే...

English summary

Dishes which are Popular for Pongal in Telugu

Here we talking about the dishes which are popular for pongal in Telugu. Read on,
Story first published: Tuesday, January 12, 2021, 17:16 [IST]