కర్ణాటక స్పెషల్ తెల్ల పులిహోరా.. మిగిలిపోయిన అన్నంతో ఇది చేసుకోండి.. రుచి జన్మలో మర్చిపోరు!

ప్రతి ఇంట్లో ఎదో ఒకరోజు అన్నం మిగిలిపోతూ ఉంటుంది. ఇలా అన్నం మిగిలిపోయినప్పుడు పడేయడం కంటే ఆ అన్నంతో వేరే విధంగా వేరే ఏదైనా వంట చేసుకుంటే చాలా బాగుంటుంది. మన తెలుగు రాష్ట్రాల్లో మిగిలిపోయిన అన్నంతో పులిహోర లేదా ఎగ్ రైస్ చేసుకుంటూ ఉంటారు. అయితే ఈసారి ఈ కర్ణాటక స్పెషల్ తెల్ల పులిహోర ట్రై చేసి చూడండి. ఇది చాలా రుచికరంగా ఉంటుంది. అలాగే క్షణాల్లోనే సిద్ధమైపోతుంది. ఈ తెల్ల పులిహోరను ఎలా చేసుకోవాలి? దానికి కావాల్సిన పదార్థాలు ఏంటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

కర్ణాటక స్పెషల్ తెల్ల పులిహోరకు కావాల్సిన పదార్థాలు

  1. రెండు కప్పుల అన్నం
  2. గుప్పెడు జీడిపప్పు
  3. ఒక ఉల్లిపాయ
  4. రెండు ఎండుమిర్చి
  5. మూడు పచ్చిమిర్చి
  6. రెండు స్పూన్ మెంతి ఆకుల తురుము
  7. ఒక స్పూన్ నిమ్మరసం
  8. అరకప్పు కొబ్బరి తురుము
  9. గుప్పెడు వేరు శెనగ పలుకులు
  10. రుచికి సరిపడా ఉప్పు
  11. అయిదు మిరియాలు
  12. ఒక స్పూన్ మినపప్పు
  13. ఒక స్పూన్ పచ్చి శనగ పప్పు
  14. ఒక స్పూన్ జీలకర్ర
  15. ఒక స్పూన్ ఆవాలు
  16. రెండు స్పూన్ల నూనె

తెల్ల పులిహోర తయారీ విధానం

ముందుగా వండుకున్న అన్నం లేదా, మిగిలిపోయిన అన్నాన్ని పొడి పొడిగా వచ్చే విధంగా చేసుకొని ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి అందులో నూనె పోసుకోవాలి. అందులోనే గుప్పెడు జీడిపప్పు, వేరుశనగ పలుకులు వేసుకొని రంగు మారేంత వరకు వేయించుకోని పక్కన పెట్టుకోవాలి.

ఇప్పుడు అదే నూనెలో ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, శెనగపప్పు వేసుకొని వేయించుకోవాలి. మాడిపోకుండా మీడియం మంట మీదనే వీటిని వేయించుకోవాల్సి ఉంటుంది. మంట ఎక్కువైతే కచ్చితంగా మాడిపోతుంది. ఆ తరువాత అందులోనే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. అలాగే కొంచెం ఉప్పు కూడా వేసుకుంటే ఉల్లిపాయలు త్వరగా మగ్గిపోతాయి.

అలాగే అందులోనే తరిగిన మెంతి కూరను వేసుకొని రెండు నిమిషాల పాటు బాగా మెత్తగా అయ్యే విధంగా వేయించుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగిన కొబ్బరిని కూడా అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ముందుగా విడదీసుకొని పక్కనపెట్టుకున్న అన్నాన్ని అందులో వేసుకోవాలి. ఒక నిమ్మకాయను కోసి అందులో రసం పిండుకోవాలి. ఇప్పుడు పులిహోర కలిపినట్లు వాటినంతా బాగా కలుపుకోవాలి.

ఇప్పుడు ముందుగా వేయించిపెట్టుకున్న జీడిపప్పు, వేరుశెనగ పలుకులను పై నుంచి చల్లుకుంటే ఎంతో రుచికరమైన కర్ణాటక స్పెషల్ తెల్ల పులిహోర సిద్ధమైనట్లే. దీనిని ఉదయాన్నే టిఫిన్‌గా తినొచ్చు లేదా మధ్యాహ్నం లంచ్‌గా కూడా లాగించేయొచ్చు. ఎలా తిన్నా దీని రుచిమాత్రం అద్భుతంగా ఉంటుంది. మీరూ ఓసారి ట్రై చేయండి.

[ of 5 - Users]
Story first published: Thursday, December 19, 2024, 8:32 [IST]
Desktop Bottom Promotion