కేవలం 15 నిమిషాల్లో మహాశివరాత్రి ప్రసాదం.. పరమేశ్వరుడికి ఈ స్వీట్ నైవేద్యం పెట్టండి..పుణ్యం పొందండి!

Posted By:

మహాశివరాత్రి పర్వదినం హిందువులకు అత్యంత పవిత్రమైన రోజు. ఈ రోజున భక్తులు శివయ్యను ఆరాధిస్తూ, ఉపవాసం ఉండి, జాగారం చేస్తారు. రోజంతా ఉపవాసం ఉన్న తర్వాత దేవుడికి నైవేద్యం సమర్పించి, దానిని ప్రసాదంగా స్వీకరించడం ఆచారం. శివరాత్రి నాడు సమర్పించే నైవేద్యం సాత్విక ఆహారమై ఉండాలి. ఇది భక్తితో పాటు ఆరోగ్యాన్ని కూడా పెంపొందించేలా ఉండాలి.

గోధుమ హల్వా అనేది కేవలం రుచికరమైన తీపి పదార్థం మాత్రమే కాదు, ఇది ఆయుర్వేద పరంగా కూడా ఎంతో విశిష్టమైనది. ఈ మహాశివరాత్రికి పరమేశ్వరుడికి ఎంతో ఇష్టమైన, ఉపవాసం తర్వాత శరీరానికి తక్షణ శక్తినిచ్చే గోధుమ హల్వా నైవేద్యంగా ఎలా తయారు చేయాలో ఇక్కడ చూడండి.

కావాల్సిన పదార్థాలు
గోధుమ పిండి: 1 కప్పు
స్వచ్ఛమైన నెయ్యి : పావు కప్పు
బెల్లం తురుము: 1 కప్పు
నీళ్లు: 2 కప్పులు
యాలకుల పొడి: అర టీస్పూన్
మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్: సన్నగా తరిగినవి

తయారీ విధానం

-స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి అందులో 1 కప్పు బెల్లం, 2 కప్పుల నీళ్లు పోసి బెల్లం మొత్తం కరిగి ఒక పొంగు రాగానే స్టవ్ ఆపేయాలి.

-ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి అందులో పావు కప్పు నెయ్యిలో సగం వేసి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసి వేయించి వాటిని తీసి పక్కన పెట్టుకోండి.

-తర్వాత పాన్ లో మరికొంత నెయ్యి వేసి అందులో 1 కప్పు గోధుమ పిండి వేసి మంచి రంగు వచ్చేంతవరకు వేయించుకోవాలి. మొదట్లో పిండి నెయ్యిని పీల్చుకుని గట్టిగా అనిపించవచ్చు, కానీ వేయించే కొద్దీ అది పల్చబడుతుంది. పిండి పచ్చి వాసన పోయి, మంచి సువాసన వచ్చే వరకు, అలాగే రంగు లేత గోధుమ రంగు లోకి మారే వరకు వేయించాలి. ఇది సుమారు 10-15 నిమిషాలు పట్టవచ్చు. మాడిపోకుండా చూసుకోవడం చాలా ముఖ్యం.

-పిండి బాగా వేగి, మంచి రంగులోకి వచ్చాక ఇప్పుడు అందులో ముందుగా కరిగించి పెట్టుకున్న బెల్లం నీళ్లను పాన్ లో కొద్ది కొద్దిగా పిండిలో పోస్తూ కలుపుకుంటూ ఉండాలి. లేకుంటే ఉండలు కట్టే అవకాశం ఉంటుంది.

-5 నిమిషాల పాటు దీనిని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఈ మిశ్రమం చిక్కబడే వరకు కలుపుతూనే ఉండాలి. హల్వా పాన్ నుండి విడిపోయి, నెయ్యి బయటకు వస్తున్నట్లు అనిపించే వరకు ఉడికించాలి. దీనికి సుమారు 5-8 నిమిషాలు పట్టవచ్చు.

-హల్వా దగ్గర పడ్డాక, చివరిలో యాలకుల పొడి మరియు, వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ (జీడిపప్పు, కిస్మిస్) వేసి బాగా కలుపుకొని స్టవ్ ఆపేయాలి. కావాలంటే పైన మరో స్పూన్ నెయ్యి వేసుకోవచ్చు, ఇది హల్వాకు మంచి షైనింగ్ ఇస్తుంది.

-అంతే శివరాత్రి ప్రసాదం రెడీ. దీనిని దేవుడికి నైవేద్యంగా సమర్పించవచ్చు.

[ of 5 - Users]
Story first published: Sunday, February 15, 2026, 7:30 [IST]
Desktop Bottom Promotion