Chicken Tikka: హోటల్ స్టైల్ చికెన్ టిక్కా ఇంట్లోనే.. ఎలా చేసుకోవాలంటే?

వీకెండ్‌లో చాలా మంది రెస్టారెంట్లకు వెళ్ళడానికి ఇష్టపడుతుంటారు. అలా రెస్టారెంట్లకు వెళ్ళినప్పుడు చాలా మంది చికెన్ స్నాక్స్, చికెన్ స్టార్టర్స్ తినడానికి ఇష్టపడుతుంటారు. అందులో మొదటి వరుసలో ఉండేది చికెన్ టిక్కా. ఈ చికెన్ టిక్కా ఎంతో రుచికరంగా నోట్లో పెట్టుకుంటేనే కరిగిపోయే విధంగా ఉంటుంది. దీనిని మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. చాలా సులభమైన పద్దతిలో క్షణాల్లోనే దీనిని సిద్ధం చేసుకోవచ్చు. అయితే దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటి? ఏ విధంగా దీనిని చేసుకోవాలి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

చికెన్ టిక్కా తయారీకి కావాల్సిన పదార్థాలు

బోన్‌లెస్ చికెన్
పెరుగు
కారం
ఉప్పు
పసుపు
అల్లం వెల్లుల్లి పేస్ట్
గరం మసాలా
నిమ్మరసం
ధనియాల పొడి
కసూరి మేథీ
బిర్యానీ మసాలా
మిరియాల పొడి
శనగ పిండి
నూనె

చికెన్ టిక్కా తయారీ విధానం

ఈ చికెన్ టిక్కాను ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు. మ్యారినేట్ సరిగ్గా చేసుకుంటే ఇంట్లో చేసుకునే చికెన్ టిక్కా హోటల్‌లో వాటికంటే మరింత రుచికరంగా ఉంటుంది. అలా చేసుకోవడానికి ముందుగా.. చికెన్‌ను శుభ్రంగా కడుక్కొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. అందులో ఇప్పుడు పెరుగు, కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, నిమ్మరసం, ధనియాల పొడి, కసూరి మేథీ, శనగ పిండి, మిరియాల పొడి, బిర్యానీ మసాలా వేసుకోవాలి.

ఇప్పుడు మనం వేసుకున్న మసాలాలు అన్నీ ఆ చికెన్‌కు పట్టుకునే విధంగా బాగా కలుపుకోవాలి. ఆ మసాలాలు మొత్తం చికెన్‌కు పట్టుకోవడానికి ఒక గంట పాటు మ్యారినేట్ చేసుకున్న చికెన్‌ను పక్కన పెట్టుకోవాలి. సాధారణంగా ఈ చికెన్ టిక్కాను కట్టెల పొయ్యి మీద చేసుకుంటేనే రుచి అద్భుతంగా ఉంటుంది. వీలైతే కట్టెల పొయ్యి మీదే చేసుకోవడానికి ప్రయత్నించండి. లేని యెడల గ్యాస్‌పైన కూడా చేసుకోవచ్చు.

అలా ఒక గంట పాటు మ్యారినేట్ అయిన చికెన్‌ను తీసుకొని ఇనుప చువ్వల్లో గుచ్చుకోవాలి. ఆ తరువాత బొగ్గుల మంట మీద ఆ చికెన్ ముక్కలను రెండు వైపులా బాగా కాలే విధంగా నూనె పూసుకుంటూ కాల్చుకోవాలి. రెండు వైపులా సరిగ్గా కాలే వారకు కాల్చుకోవాలి. అప్పుడే ముక్క బాగా ఉడుకుతుంది. రుచి అద్భుతంగా ఉంటుంది.

గ్యాస్‌పైన చేసుకోవాలని అనుకునే వ్యక్తులు పెనం పెట్టి, కొద్దిగా ఆయిల్ రాసి, ఆ తరువాత చికెన్ ముక్కలను దానిపై ఉంచి బాగా కాల్చుకోవాలి. చికెన్ ముక్కలను కొంచెం కొంచెం నూనె రాస్తూ రెండు వైపులా బాగా కాల్చుకుంటే ఎంతో రుచికరమైన చికెన్ టిక్కా సిద్ధమైనట్లే.

[ of 5 - Users]
Story first published: Saturday, December 28, 2024, 9:45 [IST]
Desktop Bottom Promotion