బగారా రైస్‌, చపాతీ,రాగి సంగటిలోకి అదిరిపోయే మటన్ లెగ్ కర్రీ..రుచికి రుచి, బలానికి బలం!

Posted By:

నాన్‌ వెజ్ అనగానే చాలామందికి ముందుగా గుర్తొచ్చేది మటన్. ఆదివారం వచ్చిందంటే చాలు.. ఇంట్లో మటన్ కూర, కబాబ్ లేదా ఘుమఘుమలాడే బిర్యానీ ఉండాల్సిందే.

మటన్ తో ఎప్పుడూ చేసే కర్రీ కాకుండా ఈసారి అదిరిపోయే రుచితో మటన్ కాళ్ళ కూర ట్రై చేసి చూడండి. ఎముకల్లోని మూలుగ, మసాలా ఘాటు కలిస్తే అన్నం, రోటీ దేనిలోకైనా సరే అమృతంలా ఉంటుంది.

Mutton Leg Curry Recipe in Telugu Spicy Juicy Mutton Paya Curry at Home

మటన్ కాళ్ల కర్రీ తయారీకి కావలసిన పదార్థాలు

మటన్ కాళ్ళు - 4

ఉల్లిపాయలు - 2
టమాటాలు - 2
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 1 టీస్పూన్
గరం మసాలా - 1 టీస్పూన్
పసుపు - చిటికెడు
కారం - 2 టీస్పూన్లు
ధనియాల పొడి - అర టీస్పూన్
వంట నూనె - 3 టేబుల్ స్పూన్లు
ఉప్పు - రుచికి సరిపడా
కొత్తిమీర - కొద్దిగా
మిరియాలు - అర టీస్పూన్
ఏలకులు - 5
లవంగాలు -6
షాజీరా లేదా జీలకర్ర - అర టీస్పూన్
దాల్చిన చెక్క - ఒక అంగుళం ముక్క
సోంపు - 1 టీస్పూన్
వెల్లుల్లి రెబ్బలు - 8
ఎండు కొబ్బరి పొడి - 2 టీస్పూన్లు
తెల్ల నువ్వులు - అర టీస్పూన్

మటన్ లెగ్ కర్రీ తయారీ విధానం

-ముందుగా మటన్ కాళ్ళను వేడి నీటిలో కొద్దిగా ఉప్పు, పసుపు వేసి, మసి, వెంట్రుకలు పోయేలా చాలా శుభ్రంగా కడగాలి.

-మిక్సీ జార్ లో మిరియాలు, జీలకర్ర, సోంపు, లవంగాలు, వెల్లుల్లి, తెల్ల నువ్వులు, ఏలకులు, దాల్చిన చెక్క, ఎండు కొబ్బరి వేసుకోవాలి. అందులోనే సగం టమాటా, కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు వేసి, తగినన్ని నీళ్లు పోసి మెత్తటి పేస్ట్‌ లా రుబ్బుకోవాలి.

-స్టవ్ మీద కుక్కర్ పెట్టి, నూనె వేడి చేసి తరిగిన ఉల్లిపాయలు వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, పసుపు వేసి పచ్చివాసన పోయేలా కలపాలి.

-ఇప్పుడు మటన్ కాళ్ళ ముక్కలను వేసి మసాలాలు పట్టేలా 4 నిమిషాలు బాగా వేయించాలి.

-ముక్కలు మగ్గాక, ముందుగా రుబ్బి పెట్టుకున్న మసాలా పేస్ట్ వేసి కలపాలి. నూనె పైకి తేలుతున్న సమయంలో కారం, ధనియాల పొడి, మిగిలిన టమాటా ముక్కలు వేసి మరో రెండు నిమిషాలు ఉడికించాలి.

-కూర పచ్చివాసన పోయి ఘుమఘుమలాడుతున్నప్పుడు, సుమారు ఒకటిన్నర లీటర్ల వేడి నీరు, రుచికి సరిపడా ఉప్పు వేసి కలపాలి. (మటన్ కాళ్ళు ఉడకడానికి నీరు ఎక్కువగా పడుతుంది). కుక్కర్ మూత పెట్టి తక్కువ నుండి మీడియం మంట మీద 7 నుండి 8 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి.

-ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసి సన్నగా తరిగిన కొత్తిమీర చల్లుకొని కలుపుకుంటే మటన్ కాళ్ళ కర్రీ రెడీ.

-వేడి వేడి అన్నం, బగారా రైస్, చపాతీ లేదా రాగి సంగటిలోకి ఈ కూరను వడ్డించుకొని తింటే రుచి అద్భుతంగా ఉంటుంది.

[ of 5 - Users]
Story first published: Sunday, March 8, 2026, 7:39 [IST]
Desktop Bottom Promotion