పండిన అరటిపండ్లతో సింపుల్ అండ్ సూపర్ స్వీట్..హెల్తీ బనానా బర్ఫీ ఎలా చేసుకోవాలంటే..

Posted By:

సాధారణంగా మన ఇళ్లలో అరటిపండ్లు కొంచెం ఎక్కువగా పండిపోతే, వాటి తొక్క నల్లగా మారిపోయిందని ఎవరూ తినడానికి ఇష్టపడరు. చివరికి వాటిని పనికిరావని చెత్తబుట్టలో పారేస్తుంటాం. కానీ అలా బాగా పండిన అరటిపండ్లలో పోషకాలు, తీపి శాతం చాలా ఎక్కువగా ఉంటాయని మీకు తెలుసా?

ఇకపై ఆ పండ్లను పారేయాల్సిన అవసరం లేదు. వాటితో నోట్లో వేసుకోగానే ఇట్టే కరిగిపోయే అద్భుతమైన అరటిపండు బర్ఫీ తయారు చేసుకోవచ్చు. దీనిలో మనం పంచదారకు బదులుగా బెల్లం ఉపయోగించి చేస్తే ఇది ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఈ స్వీట్‌ ను లొట్టలేసుకుంటూ తింటారు.

No Sugar Pure Health Super Tasty Banana Barfi Recipe in Telugu

బనానా బర్ఫీ తయారీకి కావలసిన పదార్థాలు

పండిన అరటిపండ్లు - 3
తురిమిన బెల్లం - 1 కప్పు
స్వచ్ఛమైన నెయ్యి - అర కప్పు
గోధుమ పిండి - అర కప్పు
బొంబాయి రవ్వ (ఉప్మా రవ్వ) - అర కప్పు కంటే కొంచెం తక్కువ
నీళ్లు - 1 కప్పు
యాలకుల పొడి - 1 టీస్పూన్
కుంకుమపువ్వు - కొద్దిగా
జీడిపప్పు, బాదం, పిస్తా - అర కప్పు

బనానా బర్ఫీ తయారీ విధానం

-ముందుగా పండిన మూడు అరటిపండ్ల తొక్క తీసి, ముక్కలుగా చేసుకోండి. వీటిని మిక్సీ జార్‌ లో వేసి ఎక్కడా ఉండలు లేకుండా మెత్తని పేస్ట్‌ లా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి.

-స్టవ్ వెలిగించి ఒక గిన్నెలో ఒక కప్పు తురిమిన బెల్లం, ఒక కప్పు నీళ్లు పోసి వేడి చేయండి. బెల్లం పూర్తిగా కరిగి, నీళ్లు కొద్దిగా చిక్కబడే వరకు మరిగించి పక్కన ఉంచండి. పాకం రావాల్సిన అవసరం లేదు.

-ఇప్పుడు మందంగా ఉన్న కడాయిని స్టవ్ మీద పెట్టి అందులో అరకప్పు నెయ్యి వేడి చేయండి. నెయ్యి కరిగాక గోధుమ పిండి, బొంబాయి రవ్వ వేసి మంటను సిమ్‌ లో ఉంచండి. పిండి పచ్చివాసన పోయి, మంచి బంగారు రంగులోకి వచ్చే వరకు గరిటెతో తిప్పుతూ వేయించాలి.

-పిండి బాగా వేగిన తర్వాత సిద్ధం చేసుకున్న అరటిపండు పేస్ట్‌ ను అందులో వేయాలి. అరటిపండులోని తేమ పోయి నెయ్యి పైకి తేలేవరకు బాగా ఉడికించాలి.

-అరటిపండు, పిండి మిశ్రమం బాగా ఉడికిన తర్వాత ముందుగా కరిగించి పెట్టుకున్న బెల్లం నీళ్లను వడకట్టి పోయాలి. దీనికి కుంకుమపువ్వు మిశ్రమాన్ని కూడా జతచేసి బాగా కలపాలి. ఇది పాన్‌ కు అంటుకోకుండా దగ్గరపడేవరకు ఉడికించాలి.

-మిశ్రమం బాగా గట్టిపడుతున్న సమయంలో మిగిలిన రెండు చెంచాల నెయ్యి, యాలకుల పొడి, సన్నగా తరిగిన డ్రై ఫ్రూట్స్ వేసి మరోసారి కలపండి. ముద్దలా ఫామ్ అయినప్పుడు స్టవ్ ఆఫ్ చేయండి.

-ఒక ట్రే లేదా పళ్ళెంకి కొద్దిగా నెయ్యి రాసి ఈ వేడి వేడి మిశ్రమాన్ని అందులో పోసి సమానంగా పరచాలి. పైన మరికొన్ని డ్రై ఫ్రూట్స్ చల్లుకోండి.

-ఈ మిశ్రమం పూర్తిగా చల్లారనివ్వాలి. తర్వాత మీకు ఇష్టమైన ఆకారంలో ముక్కలుగా కట్ చేసుకోండి. బనానా బర్ఫీ రెడీ.

[ of 5 - Users]
Story first published: Sunday, March 15, 2026, 21:30 [IST]
Desktop Bottom Promotion