వేసవి తాపాన్ని క్షణాల్లో తగ్గించే అద్భుతమైన సోంపు షర్బత్..ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి!

Posted By:

వేసవి కాలం స్టార్ట్ అవగానే సూర్యుని ప్రతాపం వల్ల వాతావరణం వేడెక్కడం సర్వసాధారణం. బయట ఎండ వేడిమి పెరిగే కొద్దీ మన శరీరంలోని ఉష్ణోగ్రత కూడా పెరుగుతుంది. దీనివల్ల డీహైడ్రేషన్, వడదెబ్బ, కడుపులో మంట, చర్మ సమస్యలు, అలసట, నీరసం వంటి ఎన్నో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఇలాంటి సమయంలో మార్కెట్లో దొరికే కృత్రిమ శీతల పానీయాల వైపు మొగ్గుచూపడం కంటే మన వంటింట్లో దొరికే సహజసిద్ధమైన పదార్థాలతో తయారు చేసుకునే కూల్ డ్రింక్స్ ఎంతో మేలు చేస్తాయి.

అలాంటి అద్భుతమైన, సహజసిద్ధమైన పానీయాలలో సోంపు షర్బత్ ముందు వరుసలో ఉంటుంది. భోజనం చేసిన తర్వాత నోటి దుర్వాసనను పోగొట్టడానికి, ఆహారం సులభంగా జీర్ణం కావడానికి మనం సాధారణంగా సోంపును నములుతుంటాము. అయితే సోంపులో అద్భుతమైన కూలింగ్ లక్షణాలు ఉన్నాయి. ఇది శరీరంలోని అదనపు వేడిని లాగేసి, తక్షణ ఉపశమనాన్ని ఇస్తుంది. హెల్దీ, టేస్టీ సోంపు షర్బత్‌ ను ఇంట్లోనే ఎలా సులభంగా తయారు చేసుకోవాలో ఇక్కడ చూడండి.

Refreshing Sompu Sharbat Recipe in Telugu Traditional Cooling Drink for Summer

కావలసిన పదార్థాలు
-సోంపు
-పటిక బెల్లం
-యాలకులు
-నిమ్మ ఉప్పు
-సబ్జా గింజలు
-నీళ్లు
-ఐస్ ముక్కలు

సోంపు షర్బత్ తయారీ విధానం

-ముందుగా 1 కప్పు సోంపు గింజలను గిన్నెలో వేసి, నీళ్లు పోసి శుభ్రంగా కడగాలి. తర్వాత అందులో 3 కప్పుల నీళ్లు(750 ml)పోసి రాత్రంతా నానబెట్టుకోవాలి.

-తర్వాత మిక్సీ జార్ లో రాత్రంతా నానబెట్టిన సోంపు వేసి, ఇందులోనే నానబెట్టిన నీళ్లు కొన్ని పోసి మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి.

-ఇప్పుడు ఒక క్లాత్ లో సోంపు పేస్ట్ వేసి ఒక గిన్నెలోకి గట్టిగా పిండుకోండి..దీంతో సోంపులోని సారం అంతా దిగుతుంది. సోంపు పిప్పిని పడేయండి.

-ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి అందులో పిండగా వచ్చిన సోంపు సారాన్ని వేసి,ఇందులోనే అరకిలో పటిక బెల్లం ముక్కలు వేసి లేత తీగ పాకం వచ్చే వరకు కలుపుతూ మరిగించాలి. మరుగుతున్న సమయంలో పైన తేటలా వస్తుంది..గరిటతో దాన్ని తీసేయండి.

-మిశ్రమం మరుగుతూ చిక్కబడుతున్నప్పుడే అందులో అర టీస్పూన్ యాలకల గింజల పొడి వేసుకోండి.

-సుమారు 20 నిమిషాలు మరిగించిన తర్వాత గరిటను మిశ్రమంలో పెట్టి తీసి గరిట వెనుక భాగంలో ఒక గీతలాగే వేలితో గీయండి. గీత అంటకుండా వస్తే పర్ఫెక్ట్ గా మరిగినట్లే.

-దించే ముందు అందులో చిటికెడు నిమ్మ ఉప్పు వేసి కలుపుకొని స్టవ్ ఆపేయండి. పాకం పూర్తిగా చల్లారనివ్వాలి.

-తర్వాత ఒక గ్లాసు బాటిల్ లో పోసుకుంటే కనీసం 2 నెలల వరకు నిల్వ ఉంటుంది.

-మీకు కావాలి అనుకుంటే షోంపు షర్బత్ లో నాలుగైదు బొట్ల గ్రీన్ కలర్ కూడా వేసుకోవచ్చు.

-మీరు తాగాలి అనుకున్నప్పుడు ఒక గ్లాసులో 2 టేబుల్ స్పూన్ల సోంపు పాకం వేసి,ఇందులోనే 1 టేబుల్ స్పూన్ నానబెట్టిన సబ్జా, పావు లీటరు చల్లని నీరు పోయండి. పైన కొన్ని ఐస్ క్యూబ్స్ వేసి కలుపుకోండి. అంతే సోంపు షర్బత్ రెడీ.

[ of 5 - Users]
Story first published: Monday, March 2, 2026, 15:10 [IST]
Desktop Bottom Promotion