డీప్ ఫ్రై లేని హెల్దీ చికెన్ రెసిపీ..పంజాబీ లెమన్ చికెన్ సూపర్ టేస్ట్!

Posted By:

పంజాబీ వంటకాలు అంటేనే ఘాటైన మసాలాలు, వెన్న, అద్భుతమైన రుచుల సమ్మేళనం. అందులోనూ పంజాబీ స్టైల్ లెమన్ చికెన్ అనేది చాలా ప్రత్యేకమైన వంటకం. ఇది సాధారణ చికెన్ కర్రీలా కాకుండా పుల్లపుల్లగా, కారంగా,క్రీమీగా ఉంటూ భోజన ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.

చాలామంది లెమన్ చికెన్ అనగానే చైనీస్ వంటకం అనుకుంటారు. కానీ పంజాబీ స్టైల్ లెమన్ చికెన్ పూర్తిగా భిన్నమైనది. ఇది పెరుగు, నిమ్మరసం, భారతీయ మసాలాలతో నెమ్మదిగా ఉడికించే వంటకం. ఇది అన్నం, రోటీ, నాన్ లేదా స్టార్టర్‌ గా తినడానికి అద్భుతంగా ఉంటుంది. పంజాబీ స్టైల్ లెమన్ చికెన్ ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

Tangy Spicy Creamy The Ultimate Punjabi Lemon Chicken Recipe in Telugu

తయారీకి కావాల్సిన పదార్థాలు

చికెన్: 500 గ్రాములు
గట్టి పెరుగు: అర కప్పు
అల్లం వెల్లుల్లి పేస్ట్: 1 టేబుల్ స్పూన్
నిమ్మరసం: 2 టేబుల్ స్పూన్లు
ఉప్పు: రుచికి సరిపడా
పసుపు: పావు టీస్పూన్
మిరియాల పొడి: 1 టీస్పూన్
నూనె లేదా వెన్న: 2 టేబుల్ స్పూన్లు
బిర్యానీ ఆకు: 1
దాల్చిన చెక్క: చిన్న ముక్క
లవంగాలు: 3-4
యాలకులు: 2
పచ్చిమిర్చి: 3-4
అల్లం తరుగు: 1 టీస్పూన్
వెల్లుల్లి తరుగు: 1 టీస్పూన్
ధనియాల పొడి: 1 టీస్పూన్
గరం మసాలా: అర టీస్పూన్
కసూరి మేతి: 1 టీస్పూన్
కొత్తిమీర: గార్నిష్ కోసం
ఫ్రెష్ క్రీమ్: 2 స్పూన్లు

తయారీ విధానం

-ముందుగా చికెన్‌ ముక్కలను ఉప్పు,నిమ్మరసం కలిపిన నీటితో శుభ్రంగా కడగాలి. దీనివల్ల చికెన్‌ లోని నీచు వాసన పోతుంది.

-ఒక పెద్ద గిన్నెలో చికెన్ ముక్కలు, పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నిమ్మరసం, ఉప్పు, పసుపు, మిరియాల పొడి వేసి మొత్తం అన్నీ బాగా కలిసేలా కలిపి ఈ మిశ్రమాన్ని కనీసం 30 నిమిషాల నుండి 1 గంట వరకు ఫ్రిజ్‌లో లేదా పక్కన పెట్టండి. ఎంత ఎక్కువ సేపు నానితే ముక్క అంత జ్యూసీగా వస్తుంది.

-తర్వాత స్టవ్ వెలిగించి, మందపాటి కడాయి పెట్టండి. అందులో నూనె, వెన్న వేసి వేడి చేయండి.

-నూనె వేడెక్కాక బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు వేసి వేయించండి. తర్వాత సన్నగా తరిగిన అల్లం, వెల్లుల్లి, చీల్చిన పచ్చిమిర్చి వేసి, పచ్చి వాసన పోయే వరకు వేయించండి.

-ఇప్పుడు మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్‌ ను మసాలాతో సహా కడాయిలో వేయండి. మంటను హై ఫ్లేమ్ లో ఉంచి 3-4 నిమిషాల పాటు చికెన్‌ ను వేయించండి. తర్వాత మంటను తగ్గించి మూత పెట్టి చికెన్‌ ను సుమారు 15-20 నిమిషాల పాటు ఉడికించండి.

-నీరు ఆవిరైపోయి, నూనె పైకి తేలుతున్నప్పుడు అందులో ధనియాల పొడి, గరం మసాలా వేసి కలపండి. మీకు గ్రేవీ ఎక్కువగా కావాలంటే కొద్దిగా వేడి నీళ్లు పోయవచ్చు. డ్రైగా కావాలంటే నీళ్లు మొత్తం ఇంకిపోయేలా వేయించండి.

-చికెన్ మెత్తగా ఉడికిన తర్వాత, కసూరి మేతిని చేత్తో నలిపి వేయండి. ఇది పంజాబీ వంటకాలకు ప్రాణం. చివరగా స్టవ్ ఆపేసి పైనుంచి మరో చెంచా నిమ్మరసం పిండండి..కొత్తిమీరను చల్లుకోండి. అంతే వేడివేడి పంజాబీ లెమన్ చికెన్ రెడీ.

[ of 5 - Users]
Story first published: Saturday, January 3, 2026, 7:50 [IST]
Desktop Bottom Promotion