చుక్క నీరు పోయకుండా..మట్టి కుండలో నోట్లో వెన్నలా కరిగిపోయే చంపారన్ మటన్

Posted By:

చంపారన్ మటన్ అనేది బీహార్ రాష్ట్రంలోని చంపారన్ జిల్లా నుండి ఉద్భవించిన అత్యంత ప్రసిద్ధ, రుచికరమైన వంటకం. దీనిని అహునా మటన్ లేదా హండీ మటన్ అని కూడా పిలుస్తారు.

ఈ వంటకం ప్రత్యేకత ఏమిటంటే దీనిని గరిటతో కలపరు. కుండను కదుపుతూ వండుతారు. అందుకే దీనిని అహునా (కదపడం) అని పిలుస్తారు. ఇందులో నీరు అస్సలు పోయరు. చంపారన్ మటన్ మీ ఇంట్లోనే ఈజీగా ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

Taste of Bihar Authentic Champaran Mutton Recipe in Telugu

కావలసిన పదార్థాలు

మటన్ (మేక మాంసం) - 1 కిలో
ఉల్లిపాయలు - 750 గ్రాములు
ఆవనూనె- 200 నుండి 250 మి.లీ
వెల్లుల్లి గడ్డలు- 3
అల్లం వెల్లుల్లి పేస్ట్ - 3 టీస్పూన్లు
పెరుగు - 3 టేబుల్ స్పూన్లు
గోధుమ పిండి - కుండ అంచులను సీల్ చేయడానికి తగినంత.
బిర్యానీ ఆకు - 2
ఎండు మిరపకాయలు - 5
దాల్చిన చెక్క - 2 అంగుళాల ముక్క
లవంగాలు - 5
యాలకులు - 4
నల్ల యాలకులు- 2
మిరియాలు - 1 టీస్పూన్
సాజీర - అర టీస్పూన్
జీలకర్ర పొడి - 1 టీస్పూన్
ధనియాల పొడి - 2 టీస్పూన్లు
కశ్మీరీ కారం పొడి - 2 టీస్పూన్లు
సాధారణ కారం పొడి - 1 టీస్పూన్
పసుపు -అర టీస్పూన్
గరం మసాలా- 1 టీస్పూన్
ఉప్పు - రుచికి సరిపడా.
మట్టి కుండ- 1

Taste of Bihar Authentic Champaran Mutton Recipe in Telugu

తయారీ విధానం

-ముందుగా స్టవ్ మీద ఒక పాన్‌ పెట్టి అందులో ఆవనూనె వేసి బాగా పొగలు వచ్చేవరకు వేడి చేయాలి. ఆవనూనెకు ఉండే ఘాటైన వాసన పోవడానికి ఇది చాలా ముఖ్యం.

-నూనె వేడెక్కిన తర్వాత స్టవ్ ఆపి దానిని గోరువెచ్చగా అయ్యేంత వరకు చల్లార్చాలి.

-మటన్ ముక్కలను బాగా కడిగి నీరు పూర్తిగా పోయేలా జల్లెడలో ఉంచాలి.

-ఒక పెద్ద గిన్నెలో శుభ్రం చేసిన మటన్ ముక్కలను, తరిగిన ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పెరుగు, కారం, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు, గరం మసాలా, బిర్యానీ ఆకు, ఎండు మిర్చి, దాల్చిన చెక్క,3 పూర్తి వెల్లుల్లి గడ్డలు,ముందుగా కాచి చల్లార్చిన ఆవనూనెను కూడా ఇందులో పోయాలి.

-చేతులతో మటన్ ముక్కలకు మసాలా, నూనె బాగా పట్టేలా కనీసం 5-10 నిమిషాలు కలపాలి. దీనిని 15 నిమిషాల పాటు పక్కన పెట్టండి.

-ఇప్పుడు మట్టి కుండను తీసుకుని దాని లోపల కొద్దిగా నూనె రాయండి. ఇప్పుడు మ్యారినేట్ చేసిన మటన్ మిశ్రమాన్ని కుండలో వేయాలి. కుండ పైభాగంలో కొంచెం ఖాళీ ఉండేలా చూసుకోవాలి.

-గోధుమ పిండిని చపాతీ పిండిలా కలుపుకుని, దానిని పొడవుగా చేసి కుండ అంచులకు అతికించాలి. ఇప్పుడు కుండపై మట్టి మూతను గట్టిగా పెట్టి ఆవిరి బయటకు పోకుండా పిండితో సీల్ చేయాలి.

-నిజమైన చంపారన్ మటన్‌ను బొగ్గుల కుంపటిపై వండుతారు. కానీ ఇంట్లో గ్యాస్ స్టవ్ మీద వండాలంటే మంటను పూర్తిగా సిమ్ లో ఉంచాలి. కుండను స్టవ్ మీద పెట్టి సుమారు గంట పాటు వండాలి.

-ప్రతి 10-15 నిమిషాలకు ఒకసారి బట్టతో కుండను పట్టుకుని నెమ్మదిగా కుదుపుతూ ఉండాలి. ఇలా చేయడం వల్ల లోపల ఉన్న మటన్, మసాలాలు మాడిపోకుండా బాగా కలుస్తాయి.

-సుమారు గంట తర్వాత స్టవ్ ఆపివేయండి. వెంటనే మూత తీయకుండా, మరో 10-15 నిమిషాలు అలాగే వదిలేయండి. ఆ తర్వాత నెమ్మదిగా సీల్ తీసి వేడివేడిగా అన్నం, రోటీ లేదా పుల్కాతో వడ్డించుకోండి. ఆవిరితో ఉడికిన మటన్ మెత్తగా, జ్యూసీగా ఉంటుంది.

[ of 5 - Users]
Story first published: Friday, January 2, 2026, 22:03 [IST]
Desktop Bottom Promotion