చుక్క నూనె లేకుండా ..రెండేళ్ల పాటు నిల్వ ఉండే టేస్టీ మామిడికాయ పచ్చడి..ఎలా చేసుకోవాలంటే..

Posted By:

తెలుగు వారి భోజనం పచ్చడి లేకుండా అసలు పూర్తి కాదు. కానీ పచ్చడి అనగానే అందులో వాడే లీటర్ల కొద్దీ నూనె గుర్తుకొచ్చి, బరువు పెరుగుతామనో లేదా కొలెస్ట్రాల్ వస్తుందనో ఆరోగ్య స్పృహ ఉన్నవారు పచ్చళ్లకు దూరంగా ఉంటుంటారు. అయితే చుక్క నూనె లేకుండా, నోటికి పుల్లపుల్లగా, కారంకారంగా తగిలే జీరో ఆయిల్ మామిడికాయ పచ్చడి ఎప్పుడైనా తిన్నారా?

నూనె లేకుండా చేసే ఈ పచ్చడి పొట్టకు చాలా తేలికగా ఉంటుంది, మీ జీర్ణవ్యవస్థకు ఎంతో మేలు చేస్తుంది. పైగా ఏళ్ల తరబడి నిల్వ ఉంటుంది. చుక్క నూనె లేకుండా రెండేళ్ల పాటు నిల్వ ఉండే పచ్చి మామిడికాయ పచ్చడి ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

Zero Oil Mango Pickle How To Make Oil Free Raw Mango Pickle Recipe in Telugu

నూనె లేని పచ్చి మామిడికాయ పచ్చడి తయారీకి కావాల్సినవి

పచ్చి మామిడికాయలు - 5 కిలోలు
ఉప్పు - 200 గ్రాములు
కశ్మీరీ ఎర్ర కారం పొడి - 100 గ్రాములు
ఇంగువ - 10 గ్రాములు
పసుపు - 1 టీస్పూన్

నూనె లేని పచ్చి మామిడికాయ పచ్చడి తయారీ విధానం

-ముందుగా పచ్చి మామిడికాయలను నీళ్లలో శుభ్రంగా కడగాలి. వాటిపై తడి ఏమాత్రం లేకుండా పొడి వస్త్రంతో తుడిచి గాలికి పూర్తిగా ఆరబెట్టుకోవాలి.

-తడి ఆరిన మామిడికాయల చెక్కు తీసి, మీకు నచ్చిన సైజులో ముక్కలుగా కోసుకోవాలి. ఈ ముక్కల్లో 200 గ్రాముల ఉప్పు వేసి, ముక్కలన్నింటికీ ఉప్పు బాగా పట్టేలా కలపాలి. ఉప్పు కలిపిన మామిడి ముక్కలపై మూత పెట్టి, సుమారు 24 గంటల పాటు పక్కన ఉంచాలి. ఇలా చేయడం వల్ల మామిడికాయల్లోని సహజమైన నీరు (ఊట) బయటకు వస్తుంది.

-24 గంటల తర్వాత ముక్కల నుండి ఊరిన నీటిని ఒక పొడి గాజు సీసాలోకి వడకట్టి భద్రపరుచుకోవాలి. ఇప్పుడు మామిడి ముక్కలను మాత్రం ఎండలో 3 గంటల పాటు ఆరబెట్టాలి.

-పక్కన పెట్టుకున్న మామిడి ఊట (నీరు) నుండి ఒక కప్పు తీసుకుని, అందులో 10 గ్రాముల స్వచ్ఛమైన ఇంగువ వేసి పూర్తిగా కరిగేలా కలుపుకోవాలి.

-ఇప్పుడు కొద్దిగా ఎండిన మామిడి ముక్కలను ఒక పెద్ద బౌల్‌ లోకి తీసుకుని, అందులో పసుపు, కాశ్మీరీ కారం పొడి, ముందుగా రెడీ చేసుకున్న ఇంగువ ద్రావణాన్ని వేసి ముక్కలన్నింటికీ మసాలా బాగా పట్టేలా కలుపుకోవాలి.

-ఈ మిశ్రమాన్ని ఒక శుభ్రమైన, తడిలేని గాజు సీసాలో పెట్టుకోవాలి. ముందుగా మిగిలి ఉన్న మామిడికాయ ఊటను ఆ ముక్కల పైన పోయాలి.

-గాలి చొరబడకుండా సీసా మూతను గట్టిగా బిగించి, ఇంట్లో చల్లగా ఉండే ప్రదేశంలో భద్రపరుచుకోవాలి.
అంతే ఎంతో గుమగుమలాడే జీరో ఆయిల్ మామిడికాయ పచ్చడి రెడీ. ఇది మీ ప్రతి భోజనానికి అద్భుతమైన రుచిని జోడిస్తుంది.

-ఈ పచ్చడిని గాజు సీసాలో సరైన పద్ధతిలో భద్రపరుచుకుంటే, సుమారు 2 నుంచి 3 సంవత్సరాల పాటు ఏమాత్రం రుచి, రంగు చెడిపోకుండా ఫ్రెష్‌ గా ఉంటుంది.

[ of 5 - Users]
Story first published: Monday, April 6, 2026, 19:30 [IST]
Desktop Bottom Promotion