రెండు తినేవాళ్లు నాలుగు ఇడ్లీలు లాగించేస్తారు.. ఈ స్పైసీ చెట్టినాడ్ టమాటో చట్నీ రుచికి ఫిదా అవ్వాల్సిందే!

Posted By:

టిఫిన్ ఎంత రుచిగా ఉన్నా దానికి నంచుకోవడానికి సరైన సైడ్ డిష్ లేకపోతే ఆ మజాయే ఉండదు. రోజూ ఒకే రకమైన పల్లీ చట్నీ, రొటీన్ కొబ్బరి చట్నీ, లేదా మామూలు టమాటా చట్నీ తిని మీకు బోర్ కొట్టిందా? కాస్త స్పైసీగా, కారంగా, ఘాటుగా ఉంటే ఇష్టమా? అయితే ఈసారి చెట్టినాడ్ స్టైల్ టమాటా కారపు చట్నీని తయారు చేసి చూడండి.

చెట్టినాడ్ వంటకాలు అనగానే ముందుగా వాటి ఘుమఘుమలు, అద్భుతమైన మసాలా రుచులు మనకు గుర్తుకొస్తాయి. ఈ చట్నీ రుచికి మీ ఇంట్లో వాళ్ళు ఖచ్చితంగా ఫిదా అయిపోతారు. ఈ సూపర్ టేస్టీ చట్నీ ఎలా తయారుచేసుకోవాలో ఇక్కడ చూడండి.

Chettinad Style Tomato Kara Chutney Recipe in Telugu Perfect Side Dish for Idli and Dosa

కావాల్సిన పదార్థాలు
ఉల్లిపాయ ముక్కలు - అర కప్పు
ఎర్రగా పండిన టమాటాలు - 4
ఎండు మిర్చి - 4
కశ్మీరీ ఎండు మిర్చి - 3
వెల్లుల్లి రెబ్బలు - 5
చింతపండు - కొద్దిగా
పల్లీలు - 4 టేబుల్ స్పూన్లు
బెల్లం తురుము - 1 టీస్పూన్
ఉప్పు - మీ రుచికి సరిపడా
నూనె - 2 టేబుల్ స్పూన్లు
ఆవాలు - 1 టీస్పూన్
మినపప్పు - అర టీస్పూన్
కరివేపాకు - 1 రెమ్మ
నూనె - 1 టీస్పూన్

తయారీ విధానం

-ముందుగా స్టవ్ వెలిగించి ఒక పాన్ పెట్టుకుని అందులో రెండు చెంచాల నూనె వేడి చేయండి. నూనె వేడెక్కాక పల్లీలు, ఎండు మిర్చి, కాశ్మీరీ ఎండు మిర్చి, 2 అంగుళాల చింతపండు వేసి మంటను సిమ్‌ లో ఉంచి దోరగా వేయించండి.

-పల్లీలు మంచి బంగారు రంగులోకి మారి, కమ్మటి వాసన వస్తున్నప్పుడు వాటిని తీసి ఒక ప్లేట్‌ లో పక్కన పెట్టుకోవాలి.

-ఇప్పుడు అదే పాన్‌ లో మిగిలిన నూనెలో తరిగిన ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించండి. ఉల్లిపాయలు మారుతున్న సమయంలో రుచికి సరిపడా ఉప్పు వేయాలి. ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఎర్రటి టమాటా ముక్కలు వేసి బాగా కలపాలి.

-టమాటాలు బాగా మగ్గి, మెత్తబడే వరకు మూతపెట్టి ఉడికించండి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి.

-ఇప్పుడు ఒక మిక్సీ గిన్నెలో ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలు, ఎండుమిర్చి, చింతపండు మిశ్రమాన్ని వేసి కాస్త బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఆ తర్వాత అందులో చల్లారిన ఉల్లిపాయ, వెల్లుల్లి మిశ్రమాన్ని కూడా వేసి ఓసారి రుబ్బాలి. చివరగా ఉడికించిన టమాటా గుజ్జు, ఒక స్పూన్ బెల్లం తరుగు వేసి, అవసరమైతే కొద్దిగా నీళ్లు పోసి మెత్తని పేస్ట్‌ లా రుబ్బుకోవాలి.

-చట్నీకి పోపు కోసం చిన్న కడాయిలో నూనె వేడి చేసి, ఆవాలు వేయండి. అవి చిటపటలాడాక మినపప్పు, కరివేపాకు వేసి దోరగా వేయించండి. ఈ పోపును చట్నీలో వేసి బాగా కలపండి.

-అంతే ఎంతో రుచికరమైన చెట్టినాడ్ టమాటా స్పైసీ చట్నీ రెడీ.

[ of 5 - Users]
Story first published: Friday, February 20, 2026, 17:09 [IST]
Desktop Bottom Promotion